So Awful You Walked Out In The Middle Of The Cinema


So Awful You Walked Out In The Middle Of The Cinema

క్లైమాక్స్ దాకా భరించలేని సినిమాలు

సినిమా ప్రధానంగా వినోదాన్ని అందించడానికేనని మన సినిమా దర్శక నిర్మాతలు, హీరోలు నమ్ముతుంటారు. అందుకే ఇతర భాషల సినిమా రంగాలు భిన్న తరహాల సినిమాలు ఎక్కువగా చేస్తున్నా, తెలుగులో 90 శాతం మూస కథల కమర్షియల్ సినిమాలే తయారవుతూ వచ్చాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో కాస్త ఆశాజనక పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని సినిమాలు స్టార్ వాల్యూ పరంగా కానీ, కాంబినేషన్ల పరంగా కానీ, విడుదలకు ముందు జరిగే ప్రచారం వల్ల కానీ అమితాసక్తిని రేకెత్తిస్తాయి. తీరా థియేటర్‌కు వెళ్లి కూర్చుంటే కానీ, తమ ముందు తెరమీద కనిపిస్తున్న గందరగోళం తెలిసిరాదు. ఒక్కోసారి అదెంత బోరింగ్ అనిపిస్తుందటే, ఇంటర్వెల్ అయ్యాక మళ్లీ థియేటర్ లోపలికి వెళ్లాలనిపించదు, మిగతా సగం ఇంకెంత టార్చర్ అనుభవించాలనే భయం వల్ల. ఇంకొన్ని సార్లు క్లైమాక్స్ ముందుగానో, లేదంటే క్లైమాక్స్ జరుగుతుండగానే కుర్చీల్లోంచి లేచి బయటకు వెళ్లాలనుకుంటాం. అంటే ఎండ్ టైటిల్స్ పడే దాకా మనం ఆ సినిమాని భరించలేమన్న మాట. ఆ సినిమాల వల్ల డైరెక్టర్ల, లేదా హీరోల కెరీర్ ఒక్కసారిగా కుదుపుకు గురవుతుంది  కూడా. అలాంటి కొన్ని సినిమాలను ప్రస్తావించుకుందాం.

భాయ్ (2013)

నాగార్జున స్వయంగా నిర్మించిన సినిమా కావడంతో, నిర్మాతగా ఆయన టేస్ట్ మీదున్న నమ్మకంతో అంతా ‘భాయ్’ సినిమాపై చాలా ఆసక్తి కనపరిచారు. పైగా అంతకు ముందు ‘అహ నా పెళ్లంట’, ‘పూల రంగడు’ అనే రెండు కామెడీలతో వరుస హిట్లిచ్చిన వీరభద్రం డైరెక్టర్ కావడం కూడా ఆ ఆసక్తిని పెంచింది. కానీ సినిమా మొదలైన దగ్గర్నుంచి తెరపై కనిపిస్తున్న సన్నివేశాలు చూస్తూ అయోమయానికి గురవడం ప్రేక్షకుల వంతైంది. పైగా అప్పటిదాకా ‘మన్మథుడు’ అనిపించుకున్న నాగార్జున పిల్లి గడ్డంతో తన గ్లామర్ ఇమేజ్‌కు భిన్నంగా కనిపించడం కూడా జనం జీర్ణించుకోలేకపోయారు. ఒక్కోసారి ఒకదానికొకటి పొంతనలేని సన్నివేశాలు రావడం, కథ ఎటునుంచి ఎటు పోతున్నదో అర్థంకాక తలలు పట్టుకొన్న వాళ్లు క్లైమాక్స్‌లో విలన్ల బారి నుంచి తమ్ముడ్ని నాగార్జున రక్షించుకొనేదాకా ఆగలేకపోయారు. జరిగేది తెలుసు కాబట్టి ఇంక భరించేదేముందిలే అని సర్దుకున్నారు. నాగార్జున కెరీర్‌లో, అదీ సొంత బేనర్‌లో ఒక మచ్చలా మిగిలిన ఈ సినిమాతో డైరెక్టర్ వీరభద్రం కెరీర్ అమాంతం కుప్పకూలింది. దాని తర్వాత ఎప్పటికో ఇంకో సినిమా చేసినా ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.

So Awful You Walked Out In The Middle Of The Cinema

షాడో (2013)

వెంకటేశ్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకంతో ఉంటారు ప్రేక్షకులు. తాము టికెట్‌కు ఖర్చు పెట్టిన డబ్బుకు న్యాయం జరుగుతుందనే భరోసాతో ఉంటారు. అలాంటివాళ్లందర్నీ ఒక్క దెబ్బతో దిమ్మ తిరిగేట్లు చేసిన సినిమా ‘షాడో’. కథలను ‘ఓహో’ అనిపించేట్లు చెప్పగల సమర్థుడని పేరున్న మెహర్ రమేశ్, తెరమీదకొచ్చేసరికి ‘యాక్’ అనిపించేట్లు తీస్తాడని తేటతెల్లం చేసిన సినిమా ఇది. గడ్డం, పొడవాటి జుట్టుతో ట్రైలర్‌లో వెంకటేశ్ కనిపించిన తీరుతో ప్రేక్షకులు ఒక కొత్త వెంకటేశ్‌ను చూడబోతున్నామనుకొన్నారు. అది నిజమే అని సినిమా చూస్తుంటే తెలిసింది. కానీ ఆ కొత్త వెంకటేశ్‌ను ఎలా భరించాలో మాత్రం వాళ్లకు అర్థం కాలేదు. తన కుటుంబాన్ని చంపిన నానా భాయ్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకొనే రాజారం అలియాస్ షాడో పాత్రలో వెంకటేశ్‌ను ప్రేక్షకులు భరించలేకపోయారు. ఆయన కూడా ఏమాత్రం మనసుపెట్టకుండా నటిస్తున్నట్లు కనిపిస్తూ వచ్చాడు. సగం సినిమాకే పరిస్థితి అర్థమైన ప్రేక్షకులు పంటి బిగువున మరికొంచేం చూపు కుర్చీల్లో కూర్చొని, ప్రీక్లైమాక్స్ కంటే ముందే లేచి బయటకు రావడం మొదలుపెట్టేశారు. ప్చ్.. మెహర్ రమేశ్ ఏమైపోయాడో…

So Awful You Walked Out In The Middle Of The Cinema

ఆల్ ద బెస్ట్ (2012)

అదివరలో ‘ఎగిరే పావురమా’, ‘ఒన్ బై టు’ సినిమాల్లో కలిసి నటించి మెప్పించిన శ్రీకాంత్, జేడీ చక్రవర్తి జోడీ మరోసారి కలిసి నటించడం, పైగా జేడీ స్వయంగా డైరెక్ట్ చేయడంతో ‘ఆల్ ద బెస్ట్’ సినిమాపై ప్రేక్షకులు కనీస వినోదాన్ని ఆశించారు. కానీ వాళ్లందరికీ ఈ సినిమా పెద్ద షాక్‌నిచ్చింది. జైలుకెళ్లిన తండ్రిని బయటకు తీసుకొని రావడానికి పదిహేను లక్షల రూపాయలు అవసరమైన రవి (శ్రీకాంత్), డబ్బు కోసం చందు (జేడీ)తో చేతులు కలిపి అతడి ఫ్రాడ్ పనుల్లో భాగమై ఎలా కష్టాలు పడ్డాడో చూసిన ప్రేక్షకులు సానుభూతి చూపలేదు సరికదా, శ్రీకాంత్ స్వయంకృతాపరాధాన్ని క్షమించలేకపోయారు. టికెట్‌కు పెట్టిన డబ్బుకు న్యాయం చెయ్యలేదనే కోపంతో ఇంటర్వెల్ తర్వాత కథను చూడకుండా వెనుతిరిగి వెళ్లడం మొదలుపెట్టారు. ఇక జేడీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. క్లైమాక్సులోనే కొంత బెటర్ అనిపించాడు. కానీ అప్పటికే బయటకు వెళ్లిపోవడంతో చాలామందికి అతడి నటనా కౌశలాన్ని వీక్షించే అవకాశం దక్కలేదు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఘోరంగా ఫెయిలయ్యాడన్న ఖ్యాతిని మిగుల్చుకున్నాడు. శ్రీకాంత్, జేడీ కలిసి ‘ఆల్ ద బెస్ట్’ అనే సినిమా చేశారనే విషయం ఇప్పుడు చాలామంది మర్చిపోయారు కూడా.

So Awful You Walked Out In The Middle Of The Cinema

శక్తి (2011)

ఈ కేటగిరీలో మెహర్ రమేశ్ మళ్లీ వచ్చాడు. ‘షాడో’ కంటే ముందు అతగాడు డైరెక్ట్ చేసిన సినిమా ‘శక్తి’. జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోని, చలసాని అశ్వినీదత్ వంటి ఉద్ధండ నిర్మాతనీ తన కథన చాతుర్యంతో అబ్బురపరిచి అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని తీసేట్లు చేశాడు మెహర్. శక్తిపీఠాల నేపథ్యంలో కథ అనేసరికి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఎగ్జయిట్ అయ్యి ఈ సినిమా చేశాడు. మెహర్ కథ చెప్పిన విధానంతో కచ్చితంగా తనకు కెరీర్ బెస్ట్ బ్లాక్‌బస్టర్ వస్తుందనే గట్టిగా నమ్మాడు. కానీ తాను పేపర్‌పై రాసుకున్న కథను తెరపై ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలో తెలియని మెహర్ సన్నివేశాల్ని ఎట్లాపడితే అట్లా తీసేసి, ప్రేక్షకుల గుండెల్ని ఠారెత్తించాడు. రుద్రశూలం అనే ఆయుధం, జ్వాలాముఖి అనే మహిమాన్విత వజ్రం కోసం జరిగే అన్వేషణలో అవి ఎవరకు లభిస్తాయో మనకు తెలియంది కాదు. దాని కోసం పొడవాటి జుట్టుతో వీరయోధుడి ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన తీరు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. క్లైమాక్స్ సీన్లు దగ్గర పడుతున్నాయనంగా ప్రేక్షకులు అసహనంతో కుర్చీల్లో కదలడం కనిపించింది. తర్వాత ఒక్కొక్కరే లేచి బయటకు వెళ్తూ వచ్చారు. సినిమా పూర్తయ్యేసరికి ఎక్కువ చోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.

So Awful You Walked Out In The Middle Of The Cinema

ఒక్క మగాడు (2008)

కమల్‌హాసన్ ‘భారతీయుడు’ సినిమానే కొద్దిగా మార్చి ఒక పెద్ద హీరోతో ఇంకో భారీ సినిమా తీసి, సొమ్ము చేసుకుందామని ఎవరైనా అనుకుంటారా? ఆ సాహసం చేశాడు దర్శకుడు వైవీఎస్ చౌదరి. పైగా ఆ సినిమా చెయ్యడానికి ఆయన ఒప్పించింది ఇంకెవర్నో కాదు, నందమూరి బాలకృష్ణని. ‘ఒక్క మగాడు’ అనే టైటిల్‌ను ముందుగానే రిజిస్టర్ చేసి పెట్టుకొన్న చౌదరి, ఆ టైటిల్‌తోనే బాలయ్యను పడగొట్టేశాడు. తనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుకొంటూనే ఉన్నారు, వినోదంతో కాదు, తెరమీద నడుస్తున్న కథ, సన్నివేశాలు అంత హాస్యాస్పదంగా కనిపించి. సామాన్య ప్రజల ప్రాణాలకు విలువివ్వని వాళ్లను చంపుతుండే రఘుపతి రాఘవ రాజారాం పాత్ర, ఆ పాత్రలో బాలకృష్ణ గెటప్ చూస్తుంటే చాలు, మన కళ్ల ముందు ‘భారతీయుడు’ సినిమా మెదులుతుంది. ఆఖరికి గెటప్ కూడా అదే తరహాలో రూపొందించడం ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికి ‘భారతీయుడు’ వచ్చి కొద్ది కాలమే అవడం, ఇంకా పచ్చిగానే ఆ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఉండటం వల్ల ‘ఒక్క మగాడు’ను చివరికంటా చూడలేకపోయారు ప్రేక్షకులు. బాలకృష్ణ కూడా ఆ సినిమా చెయ్యడం పొరబాటని ఒప్పుకోవడం కొసమెరుపు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్‌గా చౌదరి గ్రాఫ్ కిందికి పడిపోయి, మళ్లీ పైకి లేవలేదు.

So Awful You Walked Out In The Middle Of The Cinema

సీబీఐ ఆఫీసర్ (2004)

కృష్ణకు హీరోగా, నటునిగా ఒక స్టేచర్ ఉంది. అలాంటాయన ‘సీబీఐ ఆఫీసర్’ వంటి బీ గ్రేడ్ సినిమా చెయ్యడం సాధారణ ప్రేక్షకులకే కాదు, ఆయన వీరాభిమానులూ జీర్ణం చేసుకోలేని విషయం. డి. రంగారావు అనే ఒక రోజు నుంచి ఐదు రోజుల్లోపల సినిమాలు తీసేసే బీ గ్రేడ్ సినిమాల డైరెక్టర్‌తో కృష్ణ ఈ సినిమా చెయ్యడం నిజంగా ఇబ్బందికర విషయమే. కనీసం ఒక్కరోజు కూడా పూర్తి ఆటలు ఆడించకుండా తీసేసిన సినిమా కృష్ణ కెరీర్లో బహుశా ఇదే కావచ్చు. సగం సినిమా కూడా చూడకుండా జనం థియేటర్లను ఖాళీ చేసి, తమ నిరసనను ఆ రకంగా తెలిపారు. హీరోగా కృష్ణ కెరీర్‌కు ఒక మాయని మచ్చ ఈ సినిమా.

– బుద్ధి యజ్ఞమూర్తి

21 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *