Taxiwala Review – 4 Ups and 4 Downs


Taxiwala Review - 4 Ups and 4 Downs

టాక్సీవాలా రివ్యూ

నాలుగడుగులు ముందుకి నాలుగడుగులు వెనక్కి

విడుదల తేదీ: 17 నవంబర్, 2018

‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో సంచలన కథానాయకుడిగా రూపాంతరం చెందిన విజయ్ దేవరకొండకు ‘నోటా’ సినిమా అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ అనే ప్రేక్షకులకు పెద్దగా తెలీని ఓ దర్శకుడితో అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కామెడీ సినిమా చేశాడు. మునుపటి సినిమాలో ముఖ్యమంత్రిగా దర్శనమిచ్చిన అతడు, ఇప్పుడు టాక్సీ డ్రైవర్ అవతారమెత్తాడు. సినిమా సినిమాకీ వైవిధ్యాన్ని కోరుకుంటూ, భిన్న పాత్రలు చేస్తున్న విజయ్ ‘టాక్సీవాలా’గా ఓ మోస్తరుగానే ఆకట్టుకున్నాడు.

కథ

రకరకాల ఉద్యోగాలు చేసి, ఎందులోనూ కుదురుకోలేకపోయిన శివ (విజయ్) చివరకు టాక్సీ డ్రైవర్‌గా మారతాడు. అంతా బాగానే ఉందనుకొనే సమయంలో తన టాక్సీలో అనూహ్యమైనవి జరుగుతున్నట్లు గమనిస్తాడు. కారులో ఏదో దెయ్యం ఉన్నదని అనుమానించిన శివ, అతని ఫ్రెండ్స్ ఆ టాక్సీ మునుపటి ఓనర్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వాళ్లకు ఒక ప్రొఫెసర్ తారసపడి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే ఒక కల్పిత శాస్త్ర పద్ధతి గురించి చెబుతాడు. కారును వదిలించుకోవడానికి శివ ప్రయత్నాలు చేస్తుండగానే ఆ కారులో ప్రయాణించిన ఓ డాక్టర్‌ను కారులోని దెయ్యం చంపేస్తుంది. ఆ దెయ్యం ఎవరు? ఆ దెయ్యం లక్ష్యం ఏమిటి? దానికి శివ చేసే సాయమేంటి?.. అనేది మిగతా కథ.

కథనం

హారర్ ఇతివృత్తంతో సినిమా చెయ్యాలంటే లాజిక్‌తో సంబంధంలేని కథనాన్ని ఎంచుకోక తప్పదు. ‘టాక్సీవాలా’లో హారర్‌కు సైన్స్ ఫిక్షన్ అంశాన్ని తెలివిగా జోడించాడు దర్శకుడు. అలా అని ఎక్కువ మందికి అవగాహన ఉండని సైన్స్ పదజాలాన్ని ఎక్కువగా వాడి జనాన్ని కంఫ్యూజ్ చెయ్యకుండా జాగ్రత్తపడ్డాడు. ఒక క్లిష్టమైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్న అతడు మనం బాగా కనెక్టయ్యే సెంటిమెంట్స్‌ను సరైన రీతిలో జోడించి కథనాన్ని మలిచాడు. కథ మొదట్లో అనాసక్తంగా నడుస్తున్నదని మనం భావిస్తున్నంతలో నెమ్మదిగా స్పీడందుకొని, మనల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తుంది. కారు కూడా స్క్రిప్టులో ఒక భాగంగా, ఒక కీలకపాత్రధారిగా అతికినట్లు సరిపోయింది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని మలుపులు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని మన ఊహల్ని నిజం చేస్తాయి. తర్వాత వచ్చే సన్నివేశాల్ని మనం ఊహించగలిగినా, వాటితో పాటు వచ్చే మరికొన్ని అంశాలు మనలో ఆసక్తిని కలిగిస్తూ చూపు తిప్పనివ్వవు. అయితే కథనం మరింత పకడ్బందీగా, మరింత క్రిస్ప్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది చివరకు.

నటుల అభినయం

‘పెళ్లిచూపులు’ నుంచి గమనిస్తే విజయ్ విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది. టాక్సీవాలా శివ పాత్రకు అతడు అతికినట్లు సరిపోయాడు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటుల్లో అతడికే అందరికంటే ఎక్కువ మార్కులు పడతాయి. నాయిక పాత్రలో ప్రియాంకా జవాల్కర్ ఫర్వాలేదనిపించింది. హావభావాల విషయంలో ఇంకాస్త పరిణతి చూపిస్తే బాగుండేది. గతంలో తాను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించిన మాళవికా నాయర్ కనిపించేది తక్కువ సేపే అయినా తన అభినయంతో ఆకట్టుకుంది. మధునందన్ పండించిన హాస్యం ప్రేక్షకులకు రిలీఫ్‌నిస్తుంది. చాలామంది హాస్యగాళ్ల మాదిరిగా ఓవరాక్టింగ్ చెయ్యకుండా సందర్భానికి తగ్గట్లు సున్నిత హాస్యాన్ని కురిపించాడు. కాలీజీ ప్రొఫెసర్‌గా రవివర్మ సరిగ్గా సరిపోయాడు.

సాంకేతిక అంశాలు

హారర్ లేదా సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే మొదటగా వచ్చే విమర్శ.. అందులో లాజిక్ ఉండదని. అయితే ఈ విషయంలో డైరెక్టర్ లాజిక్‌ను సాధ్యమైనంతగా మిస్సవకుండా జాగ్రత్తపడటం కనిపిస్తుంది. దానివల్ల స్క్రిప్టులో ఎక్కువ తప్పులు మనకు కనిపించవు. సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం ప్లస్ పాయింట్. ‘మాటే వినదుగా..’ పాటకు సమకూర్చిన సంగీతంతో పాటు, సన్నివేశాలకు ఇచ్చిన రీరికార్డింగ్ ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువల నాణ్యతకు ఛాయాగ్రహణం ఇంకో నిదర్శనం.

చివరి మాట

క్లైమాక్స్ సన్నివేశాల్ని మరింత బాగా తీర్చిదిద్దినట్లయితే ‘టాక్సీవాలా’ మరింత బాగా ఆకట్టుకొనేవాడే. ఇంటర్వెల్ ముందు నుంచీ ఆసక్తికరంగా నడిచిన సినిమా క్రమంగా బిగువును కోల్పోతూ రావడం సినిమాకి దెబ్బ.

– బుద్ధి యజ్ఞమూర్తి

18 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *