The one and only MOSAGALLAKU MOSAGADU


The one and only MOSAGALLAKU MOSAGADU

ఎవర్‌గ్రీన్ కౌబాయ్ ఫిల్మ్ ‘మోసగాళ్లకు మోసగాడు’

తెలుగు ప్రాంతానికీ, కౌబాయ్ వాతావరణానికీ ఏమాత్రం సంబంధం లేదు. పశ్చిమ ప్రాంతంలో ఒకప్పటి జీవనాన్ని ప్రేరణగా తీసుకొని హాలీవుడ్‌లో వచ్చిన కౌబాయ్ సినిమాల స్ఫూర్తితో తెలుగులో, తెలుగు ప్రాంతానికి సంబంధించినట్లుగా కథను అల్లి సినిమాలు తీశారు. తెలిసినంతవరకు తెలుగులో ఒక ఇరవై వరకు కౌబాయ్ సినిమాలు వచ్చి ఉంటాయి. అలాంటి సినిమాల రూపకల్పనలో డైరెక్టర్ కె.ఎస్.ఆర్. దాస్ అగ్రగణ్యుడు. ఇక తెలుగులో.. ఆ మాటకొస్తే ఇండియాలోనే కౌబాయ్ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు కృష్ణ. కొంతమంది ఆ తరహా సినిమాల్లో తమను ఆవిష్కరించుకున్నా, ప్రయోగం చేసినా కృష్ణలా ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. కృష్ణ, కె.ఎస్.ఆర్. దాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ (1971) సినిమా భారతీయ కౌబాయ్ సినిమాల్లోనే టాప్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.
తెలుగులో ఎక్కువ కౌబాయ్ సినిమాల్లో నటించిన హీరో కూడా కృష్ణే. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘మంచివాళ్లకు మంచివాడు’, ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త’, ‘నిజం నిరూపిస్తా’ వంటి కౌబాయ్ సినిమాల్లో కృష్ణ హీరోగా కనిపించారు. నిజానికి కృష్ణ కంటే ముందే శోభన్‌బాబు కౌబాయ్‌గా కనిపించారు. ఆ సినిమా ‘దెబ్బకు ఠా దొంగల ముఠా’. పురాణం సుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్‌గా నటిస్తే, ఎస్వీ రంగారావు కీలక పాత్ర చేశారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా కంటే మూడు నెలల ముందుగా 1971 మేలో ఈ సినిమా విడుదలైంది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించకపోవడంతో శోభన్ కౌబాయ్‌గా పేరు తెచ్చుకోలేకపోయారు.
కౌబాయ్‌గా తనూ సక్సెస్ సాధించాలనే సంకల్పంతో చిరంజీవి ‘కొదమ సింహం’ సినిమాతో ప్రయోగం చేశారు. కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటల పరంగా ఆకట్టుకున్నా, సినిమా పరంగా ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి మేనరిజమ్స్ అభిమానుల్ని మెప్పించినా, కథ ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అలా ‘కొదమ సింహం’ ఒక విఫల ప్రయోగంగా మిగిలింది. దాని తర్వాత చిరంజీవి మళ్లీ ఆ తరహా సినిమా జోలికి వెళ్లలేదు. సుమన్, భానుచందర్ హీరోలుగా డైరెక్టర్ పి.ఎన్. రామచంద్రరావు ఒక ప్రయత్నం చేశారు. అది ‘మెరుపుదాడి’. సుమలత నాయికగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందంటే కారణం, డైరెక్టర్ కథనాన్ని బిగువుగా అల్లడం. అయినా బడ్జెట్ రీత్యా గానీ, చిత్రీకరణ పరంగా గానీ కౌబాయ్ సినిమా తియ్యడం రిస్క్‌తో కూడినది కావడంతో సుమన్ కానీ, భానుచందర్ కానీ మళ్లీ ఆ తరహా సాహసం చెయ్యలేదు. యాక్షన్ క్వీన్‌గా ఒకప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మి పేరు తెచ్చుకున్నారు. ‘పిల్లా పిడుగా’, ‘కొరడా రాణి’ చిత్రాలతో జ్యోతిలక్ష్మి కౌబాయ్ సినిమాల నాయకిగా కనిపించగా, విజయలలిత ‘రౌడీ రాణి’గా నటించారు.
కౌబాయ్‌గా కనిపించడానికి అర్జున్ కూడా తన వంతు ప్రయత్నం చేశారు. కె.ఎస్.ఆర్. దాస్ డైరెక్ట్ చేసిన ‘కౌబాయ్ నం.1’లో అర్జున్ హీరో. కానీ ఆయనను ఆ టైటిల్‌లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యలేదు. అంతెందుకు.. కృష్ణ కుమారుడు, నేటి అగ్ర కథానాయకుల్లో ఒకరైన మహేశ్ సైతం కౌబాయ్‌గా కనిపించి మెప్పించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో ‘టక్కరి దొంగ’గా మహేశ్ కనిపించాడు. కానీ ఫలితం మాత్రం ఒకటే.. ప్రేక్షకుల నిరాదరణ.
మొత్తానికి తెలుగులో తిరుగులేని కౌబాయ్‌గా నిలిచింది ఒక్క కృష్ణ మాత్రమే. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథను అల్లుకోవడం, పరుగులెత్తిన కథనం, ప్రధాన పాత్రల చిత్రణ, సన్నివేశాల్లోని బలం, ఆకట్టుకొనే యాక్షన్ ఎపిసోడ్స్, మైమరపింపజేసే పాటలు, హృదయాన్ని హత్తుకొనే సెంటిమెంట్, కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వ ప్రతిభ.. అన్నింటికీ మించి కౌబాయ్‌గా కృష్ణ ఆహార్యం, ఆయన నటన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని ఎవర్‌గ్రీన్ టాలీవుడ్ కౌబాయ్ మూవీగా నిలబెట్టాయి.

– బుద్ధి యజ్ఞమూర్తి
16 నవంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *