TiTles That Lied To You
మోసపుచ్చే టైటిల్స్
సాధారణంగా ఒక సినిమా టైటిల్ చూసి ఒక అంచనాకు వస్తాం. సినిమాలోని విషయాన్ని టైటిల్ ప్రతిబింబిస్తుందని అనుకుంటాం. దర్శక నిర్మాతలు, రచయితలు, హీరోలు కూడా ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా టైటిల్ ఉండాలని కోరుకుంటారు. అసలు టైటిల్‌తోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించవచ్చని ఆసక్తికరమైన టైటిల్స్‌కు మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ప్రేక్షకుల్ని మోసపుచ్చే రీతిలో టైటిల్ పెడుతుంటారు. అంటే కథకూ, లేదా పాత్రలు ప్రవర్తించే తీరుకూ సంబంధం లేకుండా టైటిల్ ఉంటుంది. లేదంటే కథకు పూర్తి వ్యతిరేకంగానూ ఒక్కోసారి టైటిల్ ఉంటుంది. అలాంటి కొన్ని టైటిల్స్ ఏవంటే…
అత్తారింటికి దారేది
టైటిల్ ప్రకారం ఎవరో ఒకరు వాళ్ల అత్తారింటికి దారి వెతుక్కుంటూ వెళ్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది. కానీ సినిమాలో జరిగింది వేరు. ‘అత్తారింటికి దారేది’ అని హీరో పవన్ కల్యాణ్ ఎవరినీ అడగడు, అత్తరిల్లెక్కడా అని అన్వేషించడు. నేరుగా అక్కడ ల్యాండై పోతాడు. సాధారణంగా అత్తారిల్లు అంటే భార్య పుట్టిల్లో లేక భర్త పుట్టిల్లో అనుకుంటాం. ఇక్కడ అది కాదు, ఇది మేనత్త ఇల్లు. తన ఐడెంటిటీని చెప్పకుండా మేనత్త ఇంట్లో కారు డ్రైవర్‌గా అవతారమెత్తుతాడు హీరో. తర్వాత ఆ మేనత్త నిజం గ్రహించేస్తుంది. ఆ తర్వాత జరిగే కథకూ, అత్తారింటికి దారేది టైటిల్‌కూ పొంతనేమీ ఉండదు. మొదట్లోనే అత్తారింట్లోకి హీరో వాలిపోయాడు కాబట్టి టైటిల్‌తో డైరెక్టర్ త్రివిక్రం మనల్ని మోసం చేశాడన్న మాటే.
బెంగాల్ టైగర్
పులుల్లో బెంగాల్ టైగర్ ప్రత్యేకమైన బ్రీడ్‌గా చెప్పుకుంటారు. అలాంటి ఆ బెంగాల్ టైగర్కూ, ఈ సినిమా కథకూ ఎలాంటి సంబంధమూ ఉండదు. పోనీ కథలో హీరో రవితేజది బెంగాల్ కాబట్టి ఆ టైటిల్ పెట్టి ఉంటారనుకున్నా అతను బెంగాల్వాడు కాదు, మన ప్రాంతంలోనే పుట్టి పెరిగిన తెలుగబ్బాయే. అంటే పులి పౌరుషానికి పేరుపొందింది కాబట్టి డైరెక్టర్ సంపత్ నంది ఆ పేరు పెట్టాడని అనుకోవాలి. కానీ సినిమాలో ఎక్కువ భాగం రవితేజ వినోదాన్ని పంచే సరదా వ్యక్తిలానే కనిపిస్తాడు. ఆ రకంగా చూసినా టైటిల్ ప్రేక్షకుడ్ని మోసం చేసినట్లే.
సైజ్ జీరో
సన్నగా, శరీరంలో కొవ్వనేది లేకుండా ఉండేవాళ్లని ‘సైజ్ జీరో’ అంటారని తెలుసు. అనుష్క నాయికగా నటించి ఈ సినిమాకు వెళ్లే ముందు ప్రేక్షకులకు వచ్చే అంచనా.. అనుష్క సైజ్ జీరోలో కనిపిస్తుందని. కానీ టైటిల్‌కు పూర్తి భిన్నంగా స్థూలకాయంతో దర్శనమిస్తుంది అనుష్క. ఆమె ఆకారం వల్ల పెళ్లి చేసుకోడానికెవరూ ముందుకు రారు. ఆర్యను చూసి ప్రేమలో పడిన ఆమెకు తన రూపం అతడిని తనవైపు ఆకర్షింపజేయట్లేదని అర్థమై సైజ్ జీరో కావడానికి కష్టపడుతుంది కానీ కాలేకపోతుంది. చివరకు అందమనేది రూపంలో కాదు, మనసులో ఉండాలని ఈ కథ ద్వారా చెబుతాడు దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి.
బ్రూస్లీ.. ద ఫైటర్
మనందరికీ బ్రూస్లీ తెలుసు. మార్షల్ ఆర్ట్స్ కింగ్ అయిన ఆయన పేరును ఈ సినిమా టైటిల్‌గా పెట్టారంటే, హీరో పేరు అదేనేమోనని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. అలా అనుకున్నవాళ్లంతా తప్పులో కాలేసినట్లే. ఇందులో హీరో ఒక స్టంట్‌మన్. అతడి పేరు కార్తి. తన అక్క చదువు కోసం తన చదువును కూడా త్యాగం చేసేంత మంచి మనసున్నవాడు. ఒక సమస్యలో చిక్కుకున్న ఆమెను రిస్క్ చేసి కాపాడతాడు. అందుకని ఈ సినిమాకు ‘బ్రూస్లీ’ అనే పేరు పెట్టాడు దర్శకుడు శ్రీను వైట్ల. అంతకు మించి బ్రూస్లీకీ, ఈ సినిమాకూ ఎలాంటి సంబంధం లేదు. ఫైట్ చేసే వాళ్లందరూ బ్రూస్లీలైతే ఈపాటికి ఎంతమంది ఉండేవారో!
జేమ్స్ బాండ్
మనకు తెలిసిన జేమ్స్ బాండ్ ఒక గూఢచారి. అది అతడి పేరే. అయినప్పటికీ గూఢచారులందర్నీ జేమ్స్ బాండ్లుగా మనం పొరబడుతుంటాం. అదలా ఉంచితే, అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమాకు ‘జేమ్స్ బాండ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టినట్లు? టైటిల్ పక్కనే ‘నేను కాందు నా పెళ్లాం’ అనే ట్యాగ్‌లైన్ ఉపయోగించారు. సరే ఆమేవన్నా గూఢచారా? కానే కాదు. ఒక ఒక లేడీ డాన్. పేరు బుల్లెట్ (సాక్షి చౌధరి). చేతిలో గన్ ఉంటుందంతే. ఆమె డాన్ అని తెలీక పెళ్లి చేసుకున్న నాని (నరేశ్)కి సినిమా మధ్యలో అసలు విషయం తెలుస్తుంది. దానికే ఆమెను జేమ్స్ బాండ్ అనుకోమంటున్నాడు డైరెక్టర్ సాయికిశోర్ మచ్చా.
హృదయ కాలేయం
హృదయమేంటి, కాలేయమేంటి? కాలేయానికి హృదయముండటమేంటి? నవ్వుకోడానికే డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ అలియాస్ సాయిరాజేశ్ ఆ టైటిల్ పెట్టారని అర్థమవుతుంది. అయితే పక్కనే ఇంకో ట్విస్ట్ ఉంది. ‘ఎ కిడ్నీ విత్ ఎ హార్ట్’ అనేది ట్యాగ్ లైన్. కిడ్నీ అంటే మూత్రపిండం, కాలేయం కాదు. తెలుగులోనేమో కాలేయమనీ, ఇంగ్లీషులోనేమో కిడ్నీ అని అంటున్నారేంటి? రెండూ ఒకటి కాదు కదా? తెలిసి పెట్టారా? తెలియక పెట్టారా? ఆ తికమకతోనే ప్రేక్షకులు సినిమాకు వెళ్తారు. సినిమా చూసినంతసేపూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి, టైటిల్ గురించిన సందేహాన్ని పక్కన పడేస్తారు. పెద్ద పెద్ద దొంగతనాలు చేసే సంపూర్ణేశ్ బాబు అనే ఒక దొంగ కథ ఇది. హృదయ కాలేయం టైటిల్లో ఉన్న కన్ఫ్యూజనే కథలోనూ ఉంటుంది.
– బుద్ధి యజ్ఞమూర్తి
20 నవంబర్, 2018