2018 Tollywood Review: 7 Small Gem Films


2018 Tollywood Review: 7 Small Gem Films

2018లో రత్నాల్లాంటి 7 చిన్న సినిమాలు

ప్రతి ఏటా వందా, నూట యాభై పైగా సినిమాలు తెలుగులో విడుదలవుతుంటాయి. వాటిలో 10 శాతానికి అటూ ఇటుగా లాభాలు ఆర్జిస్తే, మిగతావి నిర్మాతలకు, బయ్యరలకు నష్టాలు చేకూరుస్తుంటాయి. ఇది వ్యాపార కోణం. వాణిజ్యపరంగా ఆలోచించకుండా, అంటే జయాపజయాలను లెక్కలోకి తీసుకోకుండా చూస్తే కొన్ని రత్నాల్లాంటి చిన్న సినిమాలు 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

వాటిలో కొన్ని వాణిజ్యపరంగా విజయం సాధిస్తే, కొన్ని సాధించలేకపోవచ్చు. కానీ విమర్శ దృష్టితో చూస్తే అవి కూడా విలువైన సినిమాలే. అలాంటి 7 సినిమాల గురించి మాట్లాడుకుందాం…

కేరాఫ్ కంచరపాలెం (దర్శకుడు: వెంకటేశ్ మహా)

ఇతివృత్తపరంగా కానీ, పాత్రల చిత్రణ పరంగా కానీ 2018లోనే అత్యంత విలువైన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. చూస్తున్నంత సేపూ ఒక రసానుభూతిలోకీ, కంచరపాలెంలోకీ వెళ్లిపోతాం. ఏదో ఒక పాత్రలో మనల్ని మనం చూసుకుంటాం. ఒక పాత్రను ఎలా తీర్చిదిద్దాలో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. అంత బాగా క్యారెక్టరైజేషన్స్‌ను తీర్చిదిద్దాడు దర్శకుడు మహా వెంకటేశ్.

గ్రామాల్లో కుల వ్యవస్థ ప్రభావం, పరువు పేరిట హత్యలు ఎలా చోటు చేసుకుంటాయనే విషయాల్ని ఎంతో పరిణతితో చూపించాడు. అక్కడి ప్రేమలు వాస్తవికంగా ఉంటూనే మన హృదయాల్ని స్పృశిస్తాయి. వినోదమైనా అంతే. అలాగే కొన్ని కఠిన వాస్తవాలు మన మనసుల్ని తడి చేస్తాయి. ఏదీ బలవంతంగా చొప్పించినట్లు ఉండదు.

పాత్రలతో పాటు మనమూ ప్రయాణిస్తూ, అవి ఏడిస్తే మనమూ ఏడుస్తాం, అవి నవ్వితే మనమూ నవ్వుతాం. అవి గాయపడితే మన మనసులూ గాయపడతాయి. స్కూలు పిల్లలు సునీత, సుందరం, యువ జంట భార్గవి, జోసెఫ్, ముప్పై ఏళ్లు దాటిన గడ్డం, సలీమా, నడి వయసులో ఉండే రాజు, మేడం మధ్య ప్రేమలు ఎంత వాస్తవికంగా, సజీవంగా మన కళ్లముందుకొస్తాయి!

ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక అరుదైన చిత్రం. తెలుగు సినిమా చరిత్ర మొత్తం మీద ఇలాంటి సినిమాలు వేళ్లపై లెక్కించదగినన్ని మాత్రమే ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించకపోవచ్చు. కానీ అనుభూతుల వర్షంలో మనల్ని తడిపేస్తుంది.

2018 Tollywood Review: 7 Small Gem Films
సమ్మోహనం (దర్శకుడు: ఇంద్రగంటి మోహన్‌కృష్ణ)

ఒక సినీ తార జీవితాన్ని ఒక రచయిత కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ‘సమ్మోహనం’ చూస్తే తెలుస్తుంది. ఒక సినీ తార, ఇంకో సామాన్య యువకుడి మధ్య పెనవేసుకొనే అనుబంధాన్ని సున్నితమైన భావోద్వేగాలతో చిత్రించాడు దర్శకుడు మోహన్‌కృష్ణ. తెరపై నడిచే కథతో ప్రయాణించే మనం అనేక సందర్భాల్లో ఉద్వేగానికి లోనవకుండా ఉండలేం.

సినిమా షూటింగ్ కోసం తండ్రి తమ ఇంటిని ఒక నెల రోజుల పాటు అద్దెకిస్తే, ఆ షూటింగ్ కోసం వచ్చిన హీరోయిన్ సమీర (అదితిరావ్ హైదరి)తో పరిచయం కలిగిన విజయ్ (సుధీర్‌బాబు) ఆమెకు అసలైన అందం బాహ్యమైంది కాదనీ, అది వ్యక్తిత్వానికి సంబంధించిందనీ చెప్పడం.. దాని చుట్టూనే ఆ ఇద్దరి కథ నడవడం మనం చూస్తాం.

అంటే అసలైన ‘సమ్మోహనం’ అనేది బాహ్యం కాదు, అంతర్గతం అని చెప్పదలచుకున్నాడు దర్శకుడు. సమీర, విజయ్ పాత్రలలోని జీవం, విలక్షణత్వం మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. సినిమా తారలపై ఉండే గాసిప్స్‌నూ, తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు లేకపోవడాన్నీ ఈ సినిమా చర్చకు పెట్టింది. సినిమాల్లో నటించాలనే పిచ్చితో ఉద్యోగానికి వొలంటరీ రిటైర్మెంట్ ఇచ్చే వ్యక్తిగా నరేశ్ మనలో చాలామందికి ప్రతినిధిగా కనిపిస్తాడు.

సినీ తార అయినప్పటికీ అందరిలాగే సింపుల్ లైఫ్ గడపాలని ఆశించే సమీర పాత్ర మన హృదయాల్ని కట్టిపడేస్తుంది. దానికి తగ్గట్లే విజయ్‌తో ఆమె ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లే సన్నివేశం మనల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. సినిమా ఒక దృశ్య కావ్యంలా కనిపించిందంటే పి.జి. విందా సినిమాటోగ్రఫీ కూడా కారణమే.

2018 Tollywood Review: 7 Small Gem Films
నీదీ నాదీ ఒకే కథ (దర్శకుడు: వేణు ఊడుగుల)

కొడుకును ప్రయోజకుడిగా చూడాలనుకొనే ఒక సగటు బడి పంతులు, చదువంటే చిరాకుపడుతూ, డిగ్రీ పూర్తి చేయడానికి తంటాలు పడే ఒక కొడుకు.. ఆ ఇద్దరి మధ్య బంధాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ చూపించలేరనిపిస్తుంది ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా చూస్తే. ఆ ఇద్దరిపై చిత్రించిన భావోద్వేగ సన్నివేశాలే ఈ సినిమాకు ఆయువుపట్టు.

ఆద్యంతమూ సినిమా ఒక ఫీల్‌తో నడుస్తుందని కొన్ని సినిమాలకే చెప్పుకుంటాం. ఇది సరిగ్గా అలాంటి సినిమానే. ఇది దర్శకుడి సినిమా. దర్శకుడిలోని భావుకుడినీ, అదే సమయంలో ఒక వాస్తవికవాదినీ చూపించే సినిమా. ప్రతి మధ్య తరగతి తండ్రీ, ప్రతి విద్యార్థీ ఈ కథను తమదిగా చేసుకుంటారనడంలో సందేహమే లేదు. ఆ రెండు పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం చూస్తే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాని తీశాడంటే త్వరగా నమ్మబుద్ధి కాదు.

అంత బాగా ఆ పాత్రల్ని మలిచాడు దర్శకుడు వేణు. కొడుకు సాగర్‌గా శ్రీవిష్ణు, తండ్రిగా సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ నటించిన తీరు కూడా ఆ పాత్రల్ని అంతే సజీవంగా మనముందు నిలిపాయి. కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని తండ్రి కలలు కంటుంటే, కొడుకేమో ఏ మెకానిక్ గానో, లేదంటే ఏ క్యాబ్ డ్రైవర్ గానో అయితే చాలనుకుంటాడు.

ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంటే చూస్తున్న మనం తల్లడిల్లుతుంటాం. వ్యక్తిత్వ వికాసంపై లెక్చర్లు దంచేవాళ్ల నిజ స్వరూపాన్ని మరో కోణంలో ఈ సినిమా చూపించింది. జీవితంలో స్థిరపడ్డమనే అంశం చుట్టూ తిరిగే ఈ సినిమా నిజానికి మరింత విజయం సాధించడానికి అర్హమైంది.

2018 Tollywood Review: 7 Small Gem Films
అ! (దర్శకుడు: ప్రశాంత్‌వర్మ)

ఈ ఏడాది నిజంగా కొత్త దర్శకులది. ఈ కొత్త దర్శకులు మూసలో పోకుండా కొత్త ధోరణులతో, కొత్త అప్రోచ్‌తో, కొత్త కథలతో విలక్షణ చిత్రాలు రూపొందించి తెలుగు సినిమాకు జవసత్వాలు ఇచ్చారు. అలాంటి దర్శకుల్లో ‘అ!’ రూపకర్త ప్రశాంత్‌వర్మనూ తప్పకుండా చేర్చాలి. కమర్షియల్‌గా ‘అ!’ పెద్ద విజయం సాధించకపోవచ్చు. కానీ ఒక ఊహాతీత ఇతివృత్తంతో, ఒక కొత్త ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమాను దర్శకుడు రూపొందించిన తీరుకు ‘వహ్వా’ అనాల్సిందే.

టెక్నికల్ బ్రిలియన్స్‌కు ఒక చక్కటి ఉదాహరణ ఈ సినిమా. ‘అ!’ అనేది ఐది కేరక్టర్ల మీద నడిచే కథ. సైకియాట్రిస్ట్ (నిత్యా మీనన్), ఒక మామూలు అమ్మాయి (ఈషా రెబ్బా), ఒక చెఫ్ (ప్రియదర్శి), ఒక డ్రగ్ ఎడిక్ట్ (రెజీనా కసాండ్రా), ఒక మెజీషియన్ (మురళీశర్మ).. ఆ ఐదు కేరక్టర్లు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ నటులు సినిమాని వాళ్లు తమ భుజాలపై మోశారు.

వాళ్లను తెరపై చూస్తున్నంత సేపూ మనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూనే ఉంటాం. వీళ్లకి తోడు చేపగా నాని, బోన్సాయ్ చెట్టుగా రవితేజ మాట్లాడుకొనే సన్నివేశాలు దర్శకుడి ఊహాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. క్రిష్ కేరక్టర్‌లో నిత్యను చూసి ఆశ్చర్యపోని వాళ్లు ఉండరు. తన లవర్‌తో సమానంగా మటన్ సూప్ (పాయ)ను ఆమె ఇష్టపడటం ఆశ్చర్యాన్ని కలిగించకుండా ఉంటుందా?

తన పుట్టినరోజుకు వినాశనం సృష్టించాలనుకొనే కలి (కాజల్ అగర్వాల్) పాత్ర కూడా ఇందులో ఉంది. ఇన్ని పాత్రలతో దర్శకుడు కథను ఎలా నడిపిస్తాడు, ఏ పాత్రకైనా తగిన న్యాయం చేకూరుస్తాడా.. అని సందేహించినవాళ్లు కూడా సినిమా చూసి దర్శకుడి ప్రతిభకు శభాష్ అనేస్తారు.

2018 Tollywood Review: 7 Small Gem Films
గూఢచారి (దర్శకుడు: శశికిరణ్ తిక్క)

గూఢచారి సినిమాలంటే భారీ బడ్జెట్, క్రేజీ స్టార్స్ తప్పనిసరిగా ఉండే అంశాలని అలాంటి హాలీవుడ్ సినిమాలు చూసిన మనకు తెలుసు. కానీ అతి తక్కువ బడ్జెట్‌తో, భారీ తారాగణం లేకుండానే ‘గూఢచారి’ సినిమా తీసి విమర్శకుల ప్రశంసలూ, ప్రేక్షకుల ఆదరణా సాధించవచ్చని హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ నిరూపించారు. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, భావోద్వేగాలు రంగరించిన కథ కూడా.

ఇందులోని గూఢచారి పని ప్రపంచాన్ని కాపాడ్డం కాదు. తన గుర్తింపును తెలుసుకోవడం, ఏ దిక్కు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని స్థితిలో అప్రమత్తంగా ఉంటూ తనను తాను కాపాడుకోవడం, అంతిమంగా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడం. శేష్ స్వయంగా రాసిన స్క్రిప్టును దర్శకుడు అంతే సమర్థవంతంగా స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు.

‘రా’ ఏజెంట్‌గా మంచి పేరు సంపాదించుకున్న తండ్రి అడుగు జాడల్లో తాను కూడా అలా పేరు తెచ్చుకోవాలని తపించే అర్జున్ (అడివి శేష్) కేరెక్టర్‌ను, ఆ కేరెక్టర్ ఎదుర్కొనే సవాళ్లను చక్కగా, ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. అతడు ప్రేమించిన సైకాలజిస్ట్ సమీర (శోభిత ధూళిపాళ్ల) చనిపోతే, అర్జున్ అనుభవించే విషాదంతో మనమూ సహానుభూతి చెందుతాం.

ఏ ఒక్కరూ పాత్ర పరిధిని దాటి కెమెరా ముందు ప్రవర్తించరు, ఆఖరుకి ఓవరాక్టింగ్ చేసే ప్రకాశ్‌రాజ్ సహా. అత్యంత భారీతనంతో, మహేశ్ వంటి సూపర్‌స్టార్‌తో మురుగదాస్ రూపొందించిన ‘స్పైడర్’ను జనం తిరస్కరించడానికీ, ఎలాంటి స్టార్లు లేకపోయినా ‘గూఢచారి’ని జనం ఆదరించడానికీ కారణం అనుభూతుల మధ్య తేడానే.

2018 Tollywood Review: 7 Small Gem Films
ఛలో (దర్శకుడు: వెంకీ కుడుముల)

కొట్లాటలంటే ఇష్టపడే నేటి తరంలోని అనేకమంది కుర్రాళ్ల ప్రతినిధి లాంటి హరి (నాగశౌర్య) కథ ఇది. ఎక్కడ గొడవలు జరుగుతుంటే, అక్కడికి వెళ్లిపోయి ఆ గొడవను పెద్దది చేసే అతడి గుణంతో వచ్చే చిక్కులు భరించలేక తండ్రి (నరేశ్), అతడిని తిరుప్పురం అనే ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో ఉండే ప్రాంతానికి పంపిస్తే, అక్కడి తెలుగు, తమిళుల మధ్య ఉండే గొడవల్లోకి హరి ఎలా ప్రవేశించాడు, అక్కడ ఎలా నెగ్గుకొచ్చాడు, కార్తీక (రష్మికా మండన్న) ప్రేమను ఎలా గెలుచుకున్నాడనే కథను దర్శకుడు తెరపై చిత్రించిన విధానానికి ముచ్చటేస్తుంది.

తెలుగు, తమిళుల మధ్య జరిగే గొడవల్ని వివాదాస్పదం కాని రీతిలో వినోదాత్మంగా అతడు చిత్రించాడు. కేంపస్ కామెడీతో ఫస్టాఫ్‌నూ, తిరుప్పురంలోని ఘర్షణలు, అక్కడ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథతో సెకండాఫ్‌నూ నడిపించి ఆకట్టుకున్నాడు. కథను ఎక్కడా దారి తప్పించకుండా, ఎక్కడా బోర్ కొట్టనీయకుండా తీయడం దర్శకుడి ప్రతిభను పట్టిస్తుంది.

వెన్నెల కిశోర్, రఘుబాబు, సత్య, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష పాత్రల్ని దర్శకుడు కల్పించిన తీరుకు ఆ పాత్రలతో ప్రేమలో పడకుండా ఉండలేం. ఇంటిల్లిపాదీ హాయిగా థియేటర్లో కూర్చొని మనసారా ఆస్వాదించాలనుకున్న వాళ్లను ‘ఛలో’ పూర్తిగా సంతృప్తి పరుస్తుంది.

2018 Tollywood Review: 7 Small Gem Films
ఆర్ఎక్స్ 100 (దర్శకుడు: అజయ్ భూపతి)

ఒక ప్రేమ జంట జీవితంలోని ఆనందాల్నీ, విషాదాన్నీ ‘ఆర్ఎక్స్ 100’ అనే బైక్ సాక్ష్యంగా చూపించిన సినిమాని కొంత మంది విమర్శకులు హింస మోతాదు మించిన, మితిమీరిన చుంబన సన్నివేశాలున్న సినిమాగా తీసిపారేయవచ్చు. కానీ ఒక నిజమైన ప్రేమికుడు ఎలా ప్రవర్తిస్తాడో, ప్రేమ పేరుతో ఒక పెద్దింటి యువతి తను మోజుపడ్డ యువకుడ్ని ఎలా వంచించగలదో ఈ సినిమాతో మన కళ్లముందు పరిచాడు దర్శకుడు అజయ్.

శివ అనే ఆ ప్రేమికుడిగా కార్తికేయ, ఇందు అనే ఆ యువతిగా పాయల్ రాజ్‌పుత్.. ఇద్దరూ కొత్తవాళ్లే అయినా ఆ పాత్రల్ని సజీవంగా మన కళ్ల ముందు నిలిపి ఆకట్టుకున్నారు, అలరించారు, చివరకు ఏడ్పించారు కూడా. కథకు సపోర్టునిచ్చే పాత్రల్లో రాంకీ, రావు రమేశ్ తమ వంతు బలాన్ని అందించారు. శివ, ఇందు పాత్రల మధ్య రొమాన్స్‌ను దర్శకుడు సున్నితంగా కాక తీక్షణంగా చూపించాడు. కారణం ఇందు పాత్రలోని అగ్రెసివ్‌నెస్.

శివతో పోలిస్తే ఆమెది డామినేటింగ్ నేచర్. అతడిని కవ్విస్తూ, ప్రేమలోకి దించి, ఆ ప్రేమ మత్తులో ఉన్న అతడితో ఆడుకొని, చివరకు అతడిని వంచించే పాత్ర ఆమెది. ఆమె వల్లే కథలో భావ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని పట్టుకోగలిగాడు కాబట్టే దర్శకుడు అజయ్ ఈ సినిమాని ప్రేక్షక రంజకంగానూ చిత్రాన్ని మలిచాడు. శివ పాత్రతో ఆద్యంతమూ సహానుభూతి చెందుతూ వచ్చే మనం చివరకు “అయ్యో!” అని ఆవేదన చెందుతాం.

– బుద్ధి యజ్ఞమూర్తి

16 డిసెంబర్ 2018