Antariksham Review: 5 Ups And 3 Downs


Antariksham Review: 5 Ups And 3 Downs

అంతరిక్షం రివ్యూ: 5 అడుగులు ముందుకి, 3 అడుగులు వెనక్కి

తారాగణం: వరుణ్‌తేజ్, అదిరిరావ్ హైదరి, లావణ్యా త్రిపాఠి, రెహమాన్, అవసరాల శ్రీనివాస్, సత్యదేవ్, రాజా

దర్శకత్వం: సంకల్ప్

విడుదల తేది: 21 డిసెంబర్ 2018

వరుణ్‌తేజ్ హీరోగా, లావణ్యా త్రిపాఠి, అదితిరావ్ హైదరి నాయికలుగా నటించిన ‘అంతరిక్షం’ చిత్రం  తెలుగులో తొలి, దేశంలో రెండో అంతరిక్ష నేపథ్య చిత్రంగా రికార్డు పుటల్లో చోటు సంపాదించింది (తొలి భారతీయ స్పేస్ ఫిల్మ్ తమిళంలో వచ్చిన ‘టిక్ టిక్ టిక్’). ఇదివరకు మనదేశపు తొలి జలాంతర్గామి నేపథ్య చిత్రం ‘ఘాజీ’తో అందరి దృష్టినీ తనవేపుకు తిప్పుకున్న సకల్ప్‌రెడ్డి  రూపొందించడంతో ఈ సినిమాపై అందరి దృష్టీ పడింది.

ఈ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని ఆ మధ్య విడుదల చేసిన టీజర్ చూస్తేనే తెలిసిపోయింది. “దీన్ని ఇండియా వదులుకోదు” అనే వరుణ్ డైలాగ్ ఆసక్తిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అంతరిక్షం’ ఎలా ఉంది? అంచనాలకు తగ్గట్లే ఉందా?

కథ

ఇండియన్ స్పేస్ సెంటర్‌లో పనిచేసే దేవ్ (వరుణ్‌తేజ్) తన ప్రతిభా సామర్థ్యాలతో చంద్రుడి ఆనుపానులను తెలుసుకొనే లక్ష్యంతో విబ్రియాన్ అనే శాటిలైట్‌ను రూపొందిస్తాడు. దాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెడతారు. స్పేస్ సెంటర్ డైరెక్టర్ కూతురు పార్వతి (లావణ్యా త్రిపాఠి), దేవ్ ప్రేమించుకొని, సహ జీవనం చేస్తుంటారు.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రాత్రి విబ్రియాన్ నుంచి సిగ్నల్స్ ఆగిపోతాయి. విషయం తెలిసి ఇంటి నుంచి దేవ్ బయలుదేరతాడు. తను కూడా వస్తానని పార్వతి కారెక్కుతుంది. స్పేస్ సెంటర్ నుంచి సైంటిస్ట్ రియా (అదితిరావ్ హైదరి)కి కారును ఓ వైపు డ్రైవ్ చేస్తూనే సూచనలిస్తుంటాడు దేవ్. ఆ క్రమంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద రాయిని చూసుకోకపోవడంతో ప్రమాదం జరిగి పార్వతి మరణిస్తుంది.

గాయాలతో దేవ్ బయటపడతాడు. మరోవైపు విబ్రియాన్ జాడ తెలీకుండా పోతుంది. ఐదేళ్లు గడుస్తాయి. ఈసారి భారత్ ప్రయోగించిన మిహిర అనే శాటిలైట్ గతి తప్పి పక్కనే ప్రయాణిస్తున్న మరో దేశపు శాటిలైట్‌ను ఢీకొనే ప్రమాదం ఏర్పడుతుంది. అది ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థనే నాశనం చేసే అవకాశం ఉండటంతో ‘ఆపరేషన్ మిహిర’ మొదలవుతుంది.

అయితే ఆ శాటిలైట్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని డీకోడ్ చేసే వ్యక్తి దేవ్ ఒక్కడే కావడం వల్ల అతడి సాయం తీసుకోవాలని స్పేస్ సెంటర్ భావిస్తుంది. కానీ పార్వతిని కోల్పోయాక దేవ్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఎక్కడో రామేశ్వరంలో పార్వతికి ఇష్టమైన టీచర్‌గా పనిచేస్తూ పిల్లలకు సైన్స్ నేర్పిస్తూ ఉంటాడు.

అతడిని రప్పించే బాధ్యత తీసుకొని దేవ్‌ని కలుస్తుంది రియా. మొదట రానని చెప్పిన దేవ్, చివరకు వస్తాడు. ‘ఆపరేషన్ మిహిర’ సక్సెసయ్యిందా? అసలు దేవ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నది కేవలం మిహిర గురించేనా? ఇంకేదైనా ఉద్దేశముందా? అనేది మిగతా కథ.

Antariksham Review: 5 Ups And 3 Downs

కథనం

జలాంతర్గామి ఎలా ఉంటుందో ‘ఘాజీ’లో వివరంగా చూపించిన సంకల్ప్, ‘అంతరిక్షం’లో శాటిలైట్ల గురించీ, స్పేస్ సెంటర్ కార్య కలాపాల గురించీ చూపించాడు. అయితే దీన్ని కేవలం టెక్నాలజీతో ముడిపడిన సినిమాగానే కాకుండా భావోద్వేగాలు మిళితం చేసిన కథతో మనకు ప్రెజెంట్ చేశాడు. మొదట మిహిర శాటిలైట్‌కు ఎదురైన సమస్యను చూపించి, దేవ్ కోసం రియా రామేశ్వరంకు వెళ్లేటప్పుడు ఐదేళ్ల క్రితం నాటి ఫ్లాష్‌బ్యాక్‌కు కథను మళ్లించాడు.

ఆ కథలో దేవ్, పార్వతిల అనురాగాన్ని సున్నితమైన భావోద్వేగాలతో చిత్రించాడు. విబ్రియాన్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయని తెలిసినప్పుడు రాత్రివేళ పార్వతితో కలిసి కారులో వెళ్తూ దేవ్ ప్రమాదానికి గురవడం, పార్వతి మరణించడం మనసునే కాదు, కళ్లనీ తడి చేస్తుంది.

మిహిర శాటిలైట్‌లోని సాంకేతిక లోపాన్ని సవరించడానికి తానే స్వయంగా అంతరిక్షంలోకి వెళ్తానని దేవ్ పేచీ పెట్టే సన్నివేశాల విషయంలో సంకల్ప్ మరింత శ్రద్ధ వహిస్తే బాగుండేదనిపిస్తుంది. కవలలైన ఆదిత్య, కరణ్ (రెండు పాత్రలూ సత్యదేవ్ చేశాడు) ఎంతో కష్టపడి రష్యాలో శిక్షణ పొంది వచ్చినవాళ్లు. మిహిర ఆపరేషన్లో రియా, సంజయ్ (రాజా)తో పాటు వెళ్లాల్సింది ఆ ఇద్దరూ.

అందులో ఆదిత్యకు డేటా ట్రాన్స్‌ఫర్ చేయకుండా దేవ్ మొండిగా వ్యవరిస్తాడు. ఆదిత్య స్థానంలో తాను రోదసిలోకి వెళ్తాడు. దీనివల్ల ఆ కవలలిద్దరి మనసులూ గాయపడతాయి. అలా కాకుండా ఏదో రకంగా ఆదిత్యను దేవ్ కన్విన్స్ చేసినట్లు చూపించినట్లయితే దేవ్ పాత్రతో ప్రేక్షకుడు మరింతగా సహానుభూతి చెందేవాడు. దేవ్ రోదసిలోకి వెళ్లడానికి ఒక మోటివ్ ఉన్నదని చివరలో కానీ తెలీదు.

అప్పటిదాకా ఆదిత్య విషయంలో అతను నిర్దయగా ప్రవర్తించాడనే ఉద్దేశంతోనే ప్రేక్షకులుంటారు. అంతరిక్షంలో దేవ్ బృందం ఇబ్బందుల్లో చిక్కుకుందని తెలిసి అంతకు ముందు అలిగి వెళ్లిపోయిన ఆదిత్య స్పేస్ సెంటర్‌కు వచ్చి బృందానికి దిశా నిర్దేశం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. అలాంటి మానవత్వాన్ని ఆదిత్య విషయంలో దేవ్ చూపించలేదని అనిపిస్తుంది.

ఈ లోపాన్ని తర్వాత గుండెను తాకే సన్నివేశాలతో పూడ్చుకున్నాడు దర్శకుడు. మిహిర ఆపరేషన్ సక్సెస్ అయ్యాక చంద్రుడి సమీపానికి వెళ్లాలనే తమ ఆపరేషన్‌లో లేని నిర్ణయాన్ని బృందం తీసుకున్నప్పుడు సంజయ్ నాలుగేళ్ల కూతురు కిన్నెర స్పేస్ సెంటర్‌కు వచ్చి అంతరిక్షంలోని తండ్రిని చూస్తూ చెప్పే మాటలు హ్యాట్సాఫ్ అనిపిస్తాయి. మనసుని కదిలించేస్తాయి. సినిమాలోని హైలైట్ సన్నివేశాల్లో అదొకటి.

అలాగే మిహిర సమస్యను రియాతో కలిసి దేవ్ పరిష్కరించే సన్నివేశాలను గ్రిప్పింగ్‌గా ఊపిరి బిగపట్టించేలా తీశాడు దర్శకుడు. ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో దేవ్‌ను ప్రాణాపాయ స్థితిదాకా తీసుకెళ్లడం రోమాలు నిక్కబొడుచుకొనేలా తీశాడు. తన కారణంగా ఒంటరివాడయ్యాడనే అపరాధ భావనలో ఉన్న రియా, దేవ్‌కు సన్నిహితమవడం సహజంగా చిత్రించాడు. అంతరిక్ష సన్నివేశాలు చూస్తే ఒక తెలుగు సినిమాలో ఇలా తియ్యడం సాధ్యమా? అనిపిస్తుంది. ఆ క్రెడిట్ అంతా సంకల్ప్‌దే.

Antariksham Review: 5 Ups And 3 Downs

పాత్రల చిత్రణ – పాత్రధారుల అభినయం

కాస్త ఆవేశపరుడైన సైటిస్టుగా దేవ్ పాత్రను చిత్రించాడు దర్శకుడు. సహనం తక్కువైన అతడు మొదట రియా వద్ద తన ఆవేశాన్ని ప్రదర్శిస్తాడు. ప్రాణంగా ప్రేమించిన పార్వతిని పోగొట్టుకున్నాక స్పేస్ సెంటర్‌ను విడిచిపెట్టి వెళ్లిపోతాడు. ఐదేళ్ల తర్వాత తనను వెదుక్కుంటూ వచ్చిన రియా వద్ద తన ధోరణిని ప్రదర్శిస్తాడు. తర్వాత దేశం కోసం ఆపరేషన్ మిహిరను సక్సెస్ చేయడానికి స్పేస్ సెంటర్‌కు వచ్చి, ఒకరిని బలవంతంగా ఆపు చేయించి, అతడి స్థానంలో తను వెళ్తాడు.

తన మనసులో ఉన్న అసలు ఉద్దేశాన్ని రియా సహా ఎవరికీ చెప్పకుండా ఆఖరుదాకా దాచిపెడ్తాడు. ఆవేశం, మొండితనం మేళవించిన ఈ పాత్రలో వరుణ్ చాలా బాగా రాణించాడు. అంతరిక్షంలోకి వెళ్లడానికి అతడు ప్రవర్తించిన తీరే కాస్త కష్టం కలిగిస్తుంది. అయితే అతడు అలా ప్రవర్తించడానికి ఒక కారణముందనీ, దేశం గర్వపడేలా చెయ్యాలనే సంకల్పం దాని వెనుక ఉందనీ ఆఖరులో తెలిశాక ఊరట చెందుతాం.

అయితే ఆ సన్నివేశాల్ని మరింత బలంగా చిత్రించినట్లయితే బాగుండేదనిపిస్తుంది. పార్వతిగా లావణ్య పోషించిన పాత్ర చిన్నదైనా ఆకట్టుకుంటుంది. దేవ్‌ను ప్రేమించి, సహ జీవనం చేసే ఆమెను మనమూ ప్రేమిస్తాం, ప్రమాదంలో ఆమె చనిపోతే దేవ్‌తో పాటు మనమూ దుఃఖపడతాం. ఆ పాత్రలో లావణ్య చక్కగా ఇమిడిపోయింది.

మనల్ని ఆకట్టుకొనే మారో పాత్ర రియా. సైంటిస్టుగా పరిచయమై, పార్వతి మృతికి దేవ్‌తో పాటు తానూ కారణమనే అపరాధ భావనతో బాధపడుతుండే ఆమె దేశం కోసం దేవ్‌ను ఆపరేషన్ మిహిరలో భాగమయ్యేట్లు చేస్తుంది. అంతరిక్షంలో అతడికి సన్నిహితమై, అతడు ప్రమాదంలో చిక్కుకుంటే విలవిల్లాడుతుంది. అతడిని తనవాడిగా చేసుకుంటుంది.

ఆ పాత్రలో అదితిరావ్ హైదరి ఊహాతీతంగా రాణించింది. చిన్న చిన్న భావాల్ని సైతం ఆమె ముఖం పలికిన తీరు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అభినయపరంగా అందరీకంటే ఎక్కువ మార్కులు పడేది ఆమెకే. మిహిర ఆపరేషన్‌ను తన కనుసన్నల్లో నడిపించే స్పేస్ సెంటర్ డైరెక్టర్ పాత్రలో రెహమాన్ సరిగ్గా ఇమిడిపోయాడు.

సైంటిస్ట్ మోహన్‌గా అవసరాల శ్రీనివాస్, కవల సోదరులుగా సత్యదేవ్, సంజయ్‌గా రాజా పాత్రల పరిధి మేరకు రాణించారు. సంజయ్ నాలుగేళ్ల కూతురిగా నటించిన పాప అందరి హృదయాల్నీ దోచుకుంది. విలన్లు అనే వాళ్లు లేకపోవడం ఒక రకంగా చూస్తే లోపం, ఇంకో రకంగా చూస్తే రిలీఫ్.

Antariksham Review: 5 Ups And 3 Downs

సాంకేతిక అంశాలు

విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషించే ఈ సినిమాకు తియ్యడానికి అత్యంత భారీ బడ్జెట్ కావాలి. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులతోనే టెక్నాలజీని ఉపయోగించుకొని సంకల్ప్ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ‘అంతరిక్షం’ను రూపొందించాడు. శాటిలైట్ల నిర్మాణం, రాకెట్ లోపలి సన్నివేశాలు, అంతరిక్షంలో శాటిలైట్లు తిరుగాడే సన్నివేశాలను గొప్పగా చూపించాడు.

వి.ఎస్. జ్ఞానశేఖర్ అత్యున్నత స్థాయి సినిమాటోగ్రఫీకి ఈ విజువల్ ఎఫెక్ట్స్ తోడై చిత్రాన్ని విజువల్ ఫీస్ట్‌గా మార్చాయి. సినిమా ఇలా రావడంలో ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్‌కూ చాలా భాగముంది. ‘సమయమా..’ పాటకు అతడందించిన స్వరాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అతడిచ్చిన నేపథ్య సంగీతంతో సన్నివేశాలు ఆకర్షణీయంగా తయారయ్యాయి.

చాలా సందర్భాల్లో చిన్న చిన్న మాటలే ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ఆర్ట్, ఎడిటింగ్ డిపార్టుమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేశాయి. ప్రొడక్షన్ విలువులు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

చివరి మాట

ఫార్ములా సినిమాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి భిన్న సినిమాలు ఎప్పుడో కానీ రావు. వాటిని రూపొందించడం ఆషామాషీ కాదు. దర్శకుడికి ఎంతో గట్టి సంకల్పం, తపన ఉండాలి. అలాంటివి సంకల్ప్‌లో మెండుగా ఉన్నాయి కాబట్టే వాటిని తియ్యగలిగాడు.

తెలుగు సినిమాని మరిన్ని మెట్లు పైకి ఎక్కించేది ఇలాంటి దర్శకులే. ‘అంతరిక్షం’ లాంటి సినిమాల్ని ఆదరిస్తే పోయేదేమీ లేదు, మరింత కీర్తి రావడం తప్ప.

– బుద్ధి యజ్ఞమూర్తి

21 డిసెంబర్ 2018