Antariksham Trailer Reactions

అంతరిక్షం: ఉత్కంఠను పెంచిన ట్రైలర్
కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘అంతరిక్షం.. 9000 కేఎంపీహెచ్’ సినిమా ట్రైలర్ డిసెంబర్ 9న విడుదలైంది. వరుణ్‌తేజ్ హీరోగా ‘ఘాజీ’ ఫేం సంకల్ప్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మనకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ట్రైలర్ చెబుతోంది.
వరుణ్ రాకెట్ నుంచి కిందపడిపోతుంటే, “యు లూజ్ ఇన్ కంట్రోల్.. ప్యానిక్ అవ్వకు” అంటూ బహుశా అదితిరావ్ హైదరి చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ఈ ట్రైలర్ ప్రకారం వరుణ్ పేరు దేవ్ అనీ, శాటిలైట్స్‌కు కోడింగ్ చెయ్యడంలో ఎక్స్పర్ట్ అనీ తెలుస్తోంది.
అలా అంతరిక్షంలోని ఒక శాటిలైట్‌కు కోడింగ్ చెయ్యడానికి దేవ్‌ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపిస్తుందనీ, అతనితో పాటు మరో ముగ్గురు కూడా అంతరిక్షంలోకి వెళ్తారనేది స్పష్టం.
“కనీసం ఈ సారైనా ఒక టీం మెంబర్లా ఉండు, డిక్టేటర్లా బిహేవ్ చెయ్యకు” అని వరుణ్‌తో రెహమాన్ (రఘు) అనడాన్ని బట్టి వరుణ్ పాత్ర ఎలా ఉండబోతుందో అంచనా వేసుకోవచ్చు.
ట్రైలర్ ప్రకారం వరుణ్‌కు అప్పగించిన టాస్క్ చాలా క్లిష్టమైంది. అందుకే అది సాధ్యమవుతుందో, లేదోననే సందేహాన్ని అవసరాల శ్రీనివాస్ వ్యక్తం చేస్తాడు. “ఒకప్పుడు ఇక్కడ నీకు చాలా రెస్పెక్ట్ ఉండేది. దాన్ని పోగొట్టుకోకు” అని అతనంటాడు. దానికి “ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ఎక్కువ అవమానం ఉండదు మోహన్” అని వరుణ్ సమాధానమిస్తాడు.
రాకెట్లు, శాటిలైట్లు, రాకెట్ లోపలి భాగాలు, అందులోని సన్నివేశాలతో తెలుగులో మనం ఇప్పటివరకూ చూడని అత్యున్నత సాంకేతిక సామర్థ్యాన్ని చూడబోతున్నామనిపిస్తోంది. “ఈ శాటిలైట్ ఒక సోల్జర్ లాంటిది. ఫెయిలైతే ఎలా అని అడక్కూడదు. గెలవాలంటే ఏం చెయ్యాలని మాత్రమే ఆలోచించాలి” అని ఒక చిన్న పిల్లాడితో వరుణ్ చెప్పడం ఈ సినిమా థీంగా కనిపిస్తోంది.
వరుణ్ భార్యగా లావణ్యా త్రిపాఠి, సహ వ్యోమగామిగా అదితిరావ్ హైదరి కనిపిస్తారు. అంతరిక్షంలో వరుణ్, హైదరి మధ్య ఎమోషనల్ సీన్లు, వాళ్ల మధ్య కూడా రొమాన్స్ పుట్టే సన్నివేశాలు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో వరుణ్ గడ్డంతో, గడ్డం లేకుండా.. రెండు భిన్న ఆహార్యాల్లో కనిపిస్తున్నాడు.
‘అంతరిక్షం’లో దేవ్ అండ్ కో మిషన్ ఏమిటి? దేశం కోసం దేవ్ ఏం చేశాడు, ఏం సాధించాడనేది ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. జలాంతర్గామి లోపల ఎలా ఉంటుంది? దాన్ని ఎలా నడిపిస్తారనే విషయాలతో సహా ‘ఘాజీ’లో చూపించిన సకల్ప్రెడ్డి ‘అంతరిక్షం’ సినిమాతో మనకు శాటిలైట్ల గురించి క్షుణ్ణంగా మనకు చెప్పబోతున్నాడనేది ఖాయం.
దాంతో పాటు కథా కథనాల విషయంలోనూ అతడు ఒక కొత్త తరహా సినిమాని మనకు చూపించబోతున్నాడని చెప్పాలి. అందుకు డిసెంబర్ 21 వరకు ఆగాలి.
- సంజయ్
9 డిసెంబర్, 2018