Bluff Master Review: 3 Ups And 3 Downs


Bluff Master Review: 3 Ups And 3 Downs

బ్లఫ్ మాస్టర్ రివ్యూ: మూడడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి

తారాగణం: సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్య మీనన్, సిజ్జు
దర్శకుడు: గోపిగణేశ్ పట్టాభి
విడుదల తేది: 28 డిసెంబర్ 2018

నాలుగున్నరేళ్ల క్రితం తమిళంలో నటరాజన్ నటించగా మంచి విజయం సాధించిన ‘సదురంగ వేట్టై’ సినిమాకి రీమేక్‌గా గోపిగణేశ్ పట్టాభి రూపొందించిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. అదివరకు చిన్న పాత్రలు చేసినా, పూరి జగన్నాథ్ సినిమా ‘జ్యోతిలక్ష్మి’తో హీరోగా వెలుగులోకి వచ్చి, తర్వాత హీరోగానే కాకుండా, కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తూ వస్తున్న సత్యదేవ్ ఇందులో టైటిల్ రోల్ చేశాడు.

ఆ మధ్య వచ్చిన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఓ మోస్తరుగానైనా అంచనాలు ఏర్పడ్డాయి. వైట్ కాలర్ మోసాలు చేసే ఒక యువకుడి కథ తెరపై ఎలా వచ్చిందో చూద్దాం…

కథ

చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగుట్టుకున్న ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) ఒక మోసగాడిగా పెరుగుతాడు. ప్రజల్ని నమ్మించి డబ్బు దోచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అవని (నందితా శ్వేత) అనే ఒక మంచి మనసున్న అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు. జీవితంలో సెటిలైపోవచ్చనే ఉద్దేశంతో అదివరకెన్నడూ చేయని ఒక మోసాన్ని చేయడానికి సిద్ధపడతాడు. అందులో అతడు సక్సెసయ్యాడా? అవనిపై ప్రేమ అతడిని ఎలా మార్చిందన్నది మిగతా కథ.

Bluff Master Review: 3 Ups And 3 Downs

కథనం

చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా ఉండే కథనంతో చెప్పాడు దర్శకుడు గోపిగణేశ్. సినిమాని సీరియస్ టోన్‌లో నడిపే అవకాశమున్నా వినోదానికీ పెద్ద పీట వేశాడు. పృథ్విని హీరో మోసం చేసేప్పుడు వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. ఒక బిజెనెస్ కంపెనీ పేరుతో జనాన్ని అతడు మోసం చేసే దగ్గర్నుంచి కథనం వేగం అందుకుంటుంది. ఉత్తమ్ చేసే పనులు తెలుసుకొని అతనికి దూరం జరిగిన అవని, అతడు ప్రమాదంలో చిక్కుకున్న ఎప్పటికో సీన్‌లోకి రావడం సహజంగా అనిపించలేదు.

ఉత్తమ్ వల్లో మోసపోయిన ఒక వ్యక్తి విలన్ (ఆదిత్య మీనన్)ను ఆశ్రయించినప్పుడు కథలో వచ్చిన మలుపు ఆకట్టుకుంటుంది. అవని వల్ల మోసగాడి నుంచి మంచివాడుగా ఉత్తం పరివర్తన చెందటాన్ని దర్శకుడు ఇంప్రెసివ్‌గా చిత్రించలేకపోయాడు. ప్రిక్లైమాక్స్‌కు ముందు అవని ఆపదలో చిక్కుకోవడంతో క్లైమాక్స్ రంజుగా మారింది. ప్రిక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకుల భావోద్వేగాల్ని సంతృప్తి పరుస్తాయి. మిగతా కథనంలో పస లోపించింది.

పాత్రల చిత్రణ – పాత్రధారుల అభినయం

ఎలాంటి కనికరం లేకుండా అతి సునాయాసంగా ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించేవాడుగా కనిపిస్తాడు ఉత్తమ్ కుమార్. పోలీసులకు దొరికినా ఏదో ఒక తాయిలం వేసి, బయటపడటానికి అతని దగ్గర చాలా ఎత్తులే ఉంటాయి. తను చేసే మోసాలకు అతడు చెప్పే సమర్థింపులు ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది కాబట్టి, దానిపై మోజు పెంచుకున్నానని అతడు చెప్పే కథలో రీజనబుల్‌గా తోస్తుంది.

“బట్టలన్నాక మాసిపోవడం.. మనుషులన్నాక మోసపోవడం చాలా కామన్” అనే మాటలు ఉత్తమ్ క్యారేక్టరైజేషన్‌ను పట్టిస్తాయి. ఆ పాత్రలో సత్యదేవ్ చక్కగా రాణించాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ లెవల్స్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. నెగటివ్ నుంచి పాజిటివ్‌గా మారేప్పుడు అతడు ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకుంటాయి.

ఉత్తంని ప్రేమించి, అతడు ఎలాంటివాడో తెలుసుకున్నాక దూరం జరిగి, చివరికి అతడిలో మార్పు తెచ్చే పాత్ర అవని. ఆ పాత్రను నమ్మదగ్గ రీతిలో పోషించింది నందితా శ్వేత. కొన్ని సందర్భాల్లో ఆమె హావభావాలు అతిగా అనిపిస్తాయి. ఈ విషయాన్ని దర్శకుడు గ్రహించకపోవడం పొరబాటు. పోలీసాఫీసర్ పాత్రకు సిజ్జు  న్యాయం చేశాడు. టెంపర్ వంశీ కూడా ఆకట్టుకున్నాడు. విలన్‌గా ఆదిత్య మీనన్ ఫర్వాలేదనిపించాడు.

Bluff Master Review: 3 Ups And 3 Downs

సాంకేతిక విలువలు

సాంకేతిక అంశాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది సంభాషణలు. డైరెక్టర్ గోపిగణేశ్ స్వయంగా రాసిన మాటలు సినిమాకు బలంగా మారాయి. సునీల్ కశ్యప్ సంగీతం ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం సన్నివేశాలకు గాఢతనిచ్చింది. కొన్ని కొన్ని చోట్ల కెమెరా పనితనానికి ముచ్చటేస్తుంది. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు మరింత పని కల్పిస్తే బాగుండేది.

చివరి మాట

తమిళ చిత్రం ‘సదురంగ వేట్టై’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఒరిజినల్‌కు న్యాయం చెయ్యలేకపోయిందని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో బాగానే ఉందనిపిస్తూ, అంతలోనే చికాకు కలిగిస్తుంది. ఇప్పటికే ఈ తరహా కథల్ని తెరపై చాలానే చూసినందువల్ల చాలా పాత కథనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

– బుద్ధి యజ్ఞమూర్తి

28 డిసెంబర్ 2018