Kalki: A Special Film In Rajasekhar’s Career?


Kalki: A Special Film In Rajasekhar's Career?

కల్కి: రాజశేఖర్ కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్?

తొమ్మిదేళ్ల పాటు హిట్టనేది లేకుండా బలవంతంగా కెరీర్ నెట్టుకొచ్చి ఎట్టకేలకు 2017లో ‘పి.ఎస్.వి. గరుడవేగ’ సినిమాతో హిట్టు కొట్టిన డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరు ‘కల్కి’.

హీరో నాని నిర్మించిన ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్‌వర్మ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై విమర్శకుల దృష్టి పడుతోంది. కంటెంట్ పరంగా ‘అ!’ ఎంత విలక్షణంగా ఉందో తెలిసిందే. 1980ల నాటి నేపథ్యంలో తెరకెక్కుతుండటం ‘కల్కి’ సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ పాయింట్.

‘కలి’ని తుదముట్టించడానికి విష్ణువు ‘కల్కి’ అవతారమెత్తుతాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. ఆ దృష్టితో చూస్తే కలిలాంటి మహా క్రూరుడిని అంతం చేసే కల్కిలాంటి పాత్రను రాజశేఖర్ పోషిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. కలి తరహా పాత్రలో బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణా కనిపించనున్నాడు.

ఇందులో ఒకరికి ముగ్గురు తారలు రాజశేఖర్ సరసన నటిస్తున్నారు. వాళ్లు.. అదాశర్మ, నదితాశ్వేత, స్కార్లెట్ విల్సన్. 2019 ప్రథమార్ధంలో విడుదల కానున్న ఈ సినిమా రాజశేఖర్ కెరీర్‌లో ప్రత్యేకమైందిగా నిలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.