Maharshi: We Want To See One Actor Other Than Mahesh


Maharshi: We Want To See One Actor Other Than Mahesh

‘మహర్షి’లో మహేశ్ కాకుండా మనం చూడాలనుకుంటున్న నటుడు

ఏడాదికి నాలుగైదు సినిమాలు తక్కువ కాకుండా చేస్తూ వచ్చిన నటుడు హఠాత్తుగా ఒకట్రెండు సినిమాలకు పరిమితమవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. అల్లరి నరేశ్ పరిస్థితి అలాగే ఉంది. ఇది కావాలని అతడు తీసుకున్న నిర్ణయం కాదు. సరైన అవకాశాలు రాకపోవడమే దీని వెనకున్న కారణం.

రాజేంద్రప్రసాద్ తర్వాత నవ్వుల హీరోగా నరేశ్ రాజ్యం చేయడం ఖాయమని చాలామంది భావించారు. 2012లో వచ్చిన ‘సుడిగాడు’ సినిమా అతడి ఇమేజ్‌ను అందలం ఎక్కించింది. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా అతడి కెరీర్ తిరోగమన బాట పట్టడం విచిత్రంగా తోస్తుంది. ‘సుడిగాడు’ తర్వాత ఒక్కటంటే ఒక్క సరైన హిట్ అతడికి రాలేదు.

2017, 2018 సంవత్సరాల్లో విడుదలయ్యింది ఒక్కో సినిమానే. నిన్న మొన్నటి దాకా అతడి కాల్షీట్ల కోసం ఎదురు చూస్తూ వచ్చిన నిర్మాతలు ఇవాళ మొహం చాటేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోగా కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నరేశ్ దర్శనమివ్వనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మహర్షి’లో అతను టైటిల్ రోల్ చేస్తోన్న మహేశ్‌కు స్నేహితుడిగా కనిపించబోతున్నాడు.

గతంలో క్రిష్ డైరెక్ట్ చేసిన ‘గమ్యం’లో చేసిన గాలి శీను క్యారెక్టర్‌తో హీరో శర్వానంద్‌కు మించి మంచి పేరు తెచ్చుకున్నాడు నరేశ్. అది ఆ క్యారెక్టర్‌లోని గొప్పతనం. ఆ స్థాయిలో ‘మహర్షి’లో చేస్తున్న పాత్ర అతడికి పేరు తీసుకొస్తుందా? మహేశ్ వంటి సూపర్ స్టార్ సినిమాలో మరో క్యారెక్టర్‌కు (విలన్ కాకుండా) స్కోప్ ఉంటుందా? నరేశ్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడంటే దానికి కథలో ప్రాధాన్యం ఉంది కాబట్టే.

ఆ పాత్రను దర్శకుడు వంశీ పైడిపల్లి విలక్షణంగా డిజైన్ చేశాడని యూనిట్ వర్గాల సమాచారం. ఆ పాత్రలో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే ఎలిమెంట్ ఉంటుందని వినికిడి. అది నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అని ఓ వైపు, సెంటిమెంట్ రంగరించిన పాత్ర అని ఇంకో వైపూ ఊహలు నడుస్తున్నాయి. అయితే అతడి పాత్ర కథలోని ఒక కీలక మలుపు కారణమవుతుందని విశ్వసనీయ వర్గాల మాట.

ఇంతవరకు మనం చూడని నరేశ్‌ను ‘మహర్షి’లో చూడబోతున్నామనీ, మహేశ్, నరేశ్ మధ్య వచ్చే ఒక సన్నివేశం ఎమోషనల్‌గా ఉండి, ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఈ సినిమాతో నరేశ్ తన గేర్‌ను ఎలా మార్చబోతున్నాడో త్వరలోనే చూస్తాం.