Mahesh And Sukumar Film: Preparations For A Hit

మహేశ్ – సుకుమార్ సినిమా: హిట్ కోసం సన్నాహాలు
మహేశ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చే రెండో సినిమా కోసం ప్రిప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ ‘మహర్షి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2019 ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈలోగా సుకుమార్‌తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేశ్. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘1.. నేనొక్కడినే’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపయింది.
సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మహేశ్ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి కానీ, ప్రేక్షకులకు ఆ సినిమా కథ కానీ, చాలా సన్నివేశాలు కానీ ఓ పట్టాన అర్థం కాలేదు. సినిమాను సుకుమార్ చాలా స్టైలిష్‌గా తీశాడని పేరు తెచ్చుకున్నాడు కానీ, ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో తీస్తే ప్రయోజనమేమిటనే విమర్శలు ఎదుర్కొన్నాడు. మహేశ్‌తో ఫ్లాప్ సినిమా తీసినందుకు బాధ పడుతున్నాననీ, మరో అవకాశంతో ఆ నష్టాన్ని పూడ్చుకుంటాననీ సుకుమార్ ఇదివరకే చెప్పాడు.
ఇప్పుడు ‘రంగస్థలం’ వంటి 2018 బిగ్గెస్ట్ హిట్ సాధించిన అతనికి మహేశ్ మరో ఛాన్స్ ఇచ్చాడు. దాంతో నటుడిగా మహేశ్‌ను ఎలివేట్ చేసే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు సుకుమార్. ‘మహర్షి’ విడుదలకు ముందుగానే ఈ సినిమా లాంఛనంగా మొదలవుతుందని సమాచారం. ఈ చిత్రంలో మహేశ్ జోడీగా రకుల్‌ప్రీత్ పేరు వినిపిస్తోంది. ఇదివరకు ‘స్పైడర్’లో ఆ ఇద్దరూ కలిసి నటించారు.