Mr. Majnu: Akhil Desperately Need A Hit


Mr. Majnu: Akhil Desperately Need A Hit

మిస్టర్ మజ్ను: హిట్ తప్పనిసరి

ముచ్చటగా మూడో ప్రయత్నంతోనైనా అఖిల్ హిట్ కొడతాడా?.. ఇప్పుడు అక్కినేని అభిమానులతో పాటు సినీ వర్గాలు, బిజినెస్ వర్గాల్లో నలుగుతున్న ప్రశ్న. అతను హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అఖిల్ హీరోగా పరిచయమవుతున్నప్పుడు కచ్చితంగా అతను తొలి సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధిస్తాడని చాలా మంది ఆశించారు. నాగచైతన్య ‘జోష్’తో దెబ్బతిన్నటువంటి అనుభవం అతడికి ఎదురవదని నమ్మారు. పైగా వి.వి. వినాయక్ వంటి సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు, నమ్మకాలను వమ్ము చేస్తూ ‘అఖిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 20 కోట్ల షేర్ కూడా సాధించలేకపోయింది.

ఆ తర్వాత సూపర్ ట్రాక్ రికార్డ్ ఉన్న విక్రంకుమార్‌కు అఖిల్‌ను అప్పగించారు నాగార్జున. అంతకు ముందే ‘మనం’ వంటి సూపర్ హిట్‌ను అక్కినేని కుటుంబానికి అందించిన విక్రం ‘హలో’ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని డైరెక్ట్ చేశాడు. అయినా ఫలితం కలుగలేదు. ‘అఖిల్’ స్థాయిలో కూడా ఆ సినిమా వసూళ్లను సాధించలేకపోయింది. దానికంటే సుమారు రూ. 2 కోట్ల షేర్ తక్కువ వచ్చింది.

ఇది అక్కినేని అభిమానులకు మింగుడుపడని విషయం. స్ఫురద్రూపం, నటనా సామర్థ్యం, డాన్సింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ సరైన కంటెంట్ లేకపోవడంతోనే ఆ సినిమాలు ఆడలేదనే విషయం ఒప్పుకోవాలి. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్లు వద్దనుకొని, నటుడి నుంచి డైరెక్టర్‌గా మారి వరుణ్ తేజ్‌తో ‘తొలిప్రేమ’ తీసి హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్.

అలా ‘మిస్టర్ మజ్ను’ సినిమా తయారవుతోంది. నాగచైతన్యతో ‘సవ్యసాచి’లో నాయికగా నటించిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో అఖిల్ సరసన నటిస్తోంది. తాత, నాన్న ‘మజ్ను’గా నటించి సక్సెస్ అవగా, అదే బాటలో తాను కూడా ‘మజ్ను’గా సక్సెస్ అవుతానని గట్టిగా నమ్ముతున్నాడు అఖిల్. అతడి నమ్మకం ఎలా ఉన్నా, తప్పకుండా అతడికి ఒక హిట్ కావాలి.

లేకపోతే ఒక స్టార్ వారసుడిగా పరిచయమై ఆదిలోనే ఫ్లాపుల హ్యాట్రిక్ మూటగట్టుకొన్న చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ రూపంలో ఒక క్లిష్ట పరీక్షను ఎదుర్కొంటున్నాడు. అతడికి తప్పుకుండా హిట్ దక్కుతుందనే ఆశిద్దాం.