Next Enti Review: 1 Up And 7 Downs

నెక్స్ట్ ఏంటి రివ్యూ: 1 అడుగు ముందుకి, 7 అడుగులు వెనక్కి
తారాగణం: తమన్నా, సందీప్ కిషన్, నవదీప్, శరత్‌బాబు, లారెస్సా బొనేసి, పూనం కౌర్
దర్శకుడు: కునాల్ కోహ్లి
విడుదల తేదీ: 7 డిసెంబర్ 2018
బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి రూపొందించిన సినిమా, తమన్నా, సందీప్ కిషన్ జంటగా నటించిన సినిమా, లండన్ నేపథ్యంలో తీసిన సినిమా.. ఇన్ని ఆకర్షణలున్న సినిమా అంటే ఉండే ఆసక్తితో ఎవరైనా ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాకు వెళ్లొచ్చు. ‘బాహుబలి’ తర్వాత తమన్నాకు చెప్పుకోదగ్గ సినిమా లేదు. సందీప్ కిషన్‌కూ ఇటీవలి కాలంలో గొప్పగా చెప్పుకోడానికి ఒక్క సినిమా లేదు.ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడ్ని మెప్పించేలా ఉందా? చికాకు తెప్పించేలా ఉందా?
కథ
సంజయ్ అలియాస్ సంజు (సందీప్ కిషన్) ఇండియా నుంచి ఉద్యోగం నిమిత్తం లండన్ వెళ్తాడు. అక్కడ అతనికి లండన్‌లో సెటిలైన తెలుగమ్మాయి టామీ (తమన్నా) పరిచయమవుతుంది. ఒకరంటే ఒకరు ఇష్టపడి ఆరునెలలు టామీ ఇంట్లోనే సహజీవనం చేశాక, ఆమెతో శారీరకంగా కలవడానికి ఫోర్స్ చేస్తాడు సంజు. అది నచ్చని టామీ బ్రేకప్ చెబ్తుంది. ఆమెకు బిజినెస్ టైకూన్ క్రిష్ (నవదీప్)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది.
అయితే క్రిష్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో, అప్పటికే డైవోర్సీ అవడమే కాకుండా, ఆరేళ్ల కూతురికి తండ్రి కూడా అయినందున, వయసు తేడా కూడా ఎక్కువ అయినందున ఆమె మనసు అందుకు ఒప్పుకోదు. మరోవైపు సంజుకు పెద్దలు ఒక సంబంధం కుదుర్చుతారు. సంజు కూడా ఈ పెళ్లికి సిద్ధపడతాడు. చివరకు టామీ, సంజు జీవితాలు ఏమయ్యాయి? ఆ ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారా?.. అనేది క్లైమాక్స్.

కథనం
తమన్నా కానీ, సందీప్ కిషన్ కానీ తమ కెరీర్లో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో పరమ బోరింగ్ సినిమా ఇదే కావచ్చు. కథలో సంఘటనలు చాలాతక్కువ, పాత్రల మధ్య చర్చలు ఎక్కువ కావడంతో సినిమా ఆరంభమైన ఐదో నిమిషం నుంచే మొదలయ్యే చికాకు క్రమేపీ పెరిగి, పతాక సన్నివేశం రాకముందే పతాక స్థాయికి చేరుకొని కుర్చీల్లోంచి లేవక తప్పని ఇరిటేషన్ కలుగుతుంది.
రెండు గంటల సినిమాలో గంటన్నర సేపు ఏవో రెండు పాత్రల పాత్రల మధ్య చర్చలే నడుస్తాయి. అంటే డైలాగ్స్ మీదే సినిమాని నడపడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఫస్టాఫ్‌లో టామీ, ఆమె స్నేహితురాలు (పూనం కౌర్) 20 నిమిషాలసేపు నడుచుకుంటూ మాట్లాడుకోవడం ఒక సన్నివేశం! ఆ సీనయ్యేసరికే జనం కుర్చీల్లో అసహనంగా కదలడం మొదలుపెడతారు.
ఒంటరి తండ్రి (శరత్‌బాబు) నుంచి జీవితమంటే ఏమిటో తెలుసుకున్న టామీ ప్రేమ విషయంలో ఎందుకంత కన్ఫ్యూజింగ్గా ప్రవర్తిస్తుందో అర్థంకాదు. ఒకరి తర్వాత ఒకరితో ఆమె డేటింగ్ చెయ్యడం, ఏదో కారణంతో బ్రేకప్ చెప్పేయడం.. ఆమె పాత్రకు జరిగిన అన్యాయం. టామీ, సంజు బ్రేకప్ అవడం ఇంటర్వల్ పాయింట్. ఈ సినిమాకు రిలీఫ్ పాయింట్ ఏదంటే ఇంటర్వల్ ఇవ్వడమే.
బలవంతంగా సెకండాఫ్ చూసేవాళ్లంతా ముళ్ల మీద కూర్చున్నట్లే ఫీలవుతారు. ఫస్టాఫ్‌లో టామీ-సంజు, టామీ-ప్రాచిత (పూనం) చర్చోప చర్చల సీన్లతో సగం నీరసపడ్డ మనం సెకండాఫ్‌లో టామీ-క్రిష్, సంజు-రోషిణి (లారెస్సా), టామీ-సంజు చర్చలతో పిచ్చెక్కిపోతాం. ఒక సినిమా స్క్రీన్‌ప్లే ఎలా ఉండకూడదనేందుకు ‘నెక్స్ట్ ఏంటి’ ఒక చక్కని ఉదాహరణ.
పాత్రల చిత్రణ
సినిమాలో ఏ పాత్రా మనల్ని మెప్పించదు. హీరో హీరోయిన్లయిన సంజు, టామీ పాత్రల చిత్రణే సరిగా లేకపోతే మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్ల చిత్రణ బాగా ఉన్నా ఫలితం ఉండదు. ఇందులో శరత్‌బాబు పోషించిన టామీ తండ్రి పాత్ర, నవదీప్ పోషించిన క్రిష్ పాత్ర ఉన్నంతలో కాస్త మెరుగ్గా అనిపించాయి. ఆధునిక భావాలున్న తండ్రి తన కూతురిని ఎంత శ్రద్ధగా, అదే విషయంలో ఎంత స్వతంత్రంగా, స్వేచ్ఛగా పెంచుతాడో అంత స్వతంత్ర భావాలతో టామీని ఆయన పెంచుతాడు.
ఆఖరుకు మద్యం ఏది తాగాలో (అవాక్కవకండి..అది లండన్ కదా!) కూడా ఆమెకే స్వేచ్ఛనిస్తాడు. బాయ్‌ఫ్రెండ్స్ గురించి, సెక్స్ గురించి సలహాలిస్తాడు. ఇక క్రిష్ విషయానికొస్తే అతడికి జీవితంపై స్పష్టమైన భావాలుంటాయి. భార్యతో పొసగక విడాకులిచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత టామీని తన జీవిత సహచరిని చేసుకోవాలని ఆశించి, భంగపడతాడు.
అయినా టామీని అతను ఫోర్స్ చెయ్యడు. తన నుంచి టామీ దూరంగా వెళ్లిపోతుంటే అసహాయంగా చూస్తుండిపోతాడు. ఒక చక్కని తండ్రి పెంపకంలో ఆధునిక భావాలతో పెరిగిన టామీ రిలేషన్షిప్ విషయంలో పదే పదే డైలమాలో పడుతుంటుంది. సంజు పరిచయం కాకముందే మరొకరితో డేటింగ్ చేసి, వదిలేస్తుంది.
సంజు ‘ఆ పని’ చేద్దామంటే ‘అంత తొందరెందుకు?.. దాని గురించి ఆలోచించలేదం’టుంది. ‘సహజీవనం చేస్తున్నప్పుడు శారీరక సంబంధం సహజమైన విషయం కదా’.. అని సంజు అంటే, తనకు ఆఫీలింగ్స్ కలగడం లేదని బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత క్రిష్ పరిచయమయ్యాక, వయసు అంతరం చాలా ఉన్నా అతడితో ప్రేమలో పడుతుంది. అతడికి సన్నిహితంగా మెలుగుతుంది. అతడు ఎప్పుడైతే పెళ్లి ప్రపోజల్ పెట్టాడో, అప్పుడు మళ్లీ ఆమెలో డైలమా.
ఎవరినీ ప్రేమించనంతగా అతడిని ప్రేమించానని చెబుతూనే, ఒక కూతురు కూడా ఉన్న అతడి కుటుంబాన్ని భరించలేనని వెళ్లిపోతుంది. చివరలో నలభై ఏళ్లు కలిసి జీవించామని ఒక ఇంగ్లీషు జంట గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటే చూసి, ఆలోచనలో పడుతుంది. అక్కడ మళ్లీ కనిపించిన సంజుతో మళ్లీ చర్చలు కొనసాగాక కానీ ఆమె ఒకనిర్ణయానికి రాదు. టామీ తరహాలోనే సంజు పాత్ర కూడా బలహీనంగా కనిపిస్తుంది.
అవకాశం దొరికితే ఏ అమ్మాయితోనైనా సంబంధంలోకి వెళ్లే టైపు వ్యక్తిత్వం కలిగినవాడుగా కనిపించే సంజు, సెక్స్ కోసం టామీతో ఆర్గ్యూ చేసి, విఫలమై వెళ్లిపోయిన అతడు, పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధపడి, ఎంగేజ్మెంట్ అయ్యాక ఆమెతో శారీరకంగా కలిసి, ఆమె టేబుల్ డ్రాయర్లో కనిపించిన కండోమ్స్ చూసి, ఆమెను వదిలించేసుకుంటాడు. తనకైతే ఒకరూలు, ఎదుటివాళ్లకు ఇంకో రూలు అన్నట్లు అతడి వ్యక్తిత్వం కనిపిస్తుంది. చివరలో అతడి భావాల్లో మార్పు కలిగినట్లుగా కూడా మనకు అనిపించదు.

నటుల అభినయం
టామీగా తమన్నా అభినయానికి వంక పెట్టాల్సింది లేకపోయినా, సొంతంగా ఆమె చెప్పిన డబ్బింగ్ ఇంప్రె సివ్గా లేదు. కొన్నిడైలాగ్స్ను పలకడంలో అపరిపక్వత కనిపించింది. ‘గారాబం’ అనే మాటను ‘గారబం’ అని పలికింది. శారీరక ప్రదర్శన విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించడం మాత్రం ఆశ్చర్యపరిచింది. సినిమాలో అత్యధిక భాగం పొట్టి స్కర్టులలోనే కనిపిస్తుంది.
ఇప్పటివరకూ ఆమె చేసిన సినిమాల్లో ఇలా ఎప్పుడూ కనిపించలేదు. సంజు పాత్రలో సందీప్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఆ క్యారెక్టర్‌ను అతడు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. సందర్భానికి తగ్గట్లు కాకుండా ప్రతి సన్నివేశంలోనూ డైలాగ్స్‌ను చాలా క్యాజువల్‌గా చెప్పడం బాలేదు. క్రిష్‌గా నవదీప్ నటనతో ఆకట్టుకున్నాడు కానీ, అక్కడక్కడా నెరిసినగడ్డం, జుట్టుతో ఆహార్యపరంగా ఆశ్చర్యపరిచాడు.
టామీ తండ్రి పాత్రలో శరత్‌బాబు ఒదిగిపోయారు. ఆయన పాత్ర అర్ధంతరంగా ఆగిపోయినట్లు అనిపించడమొక్కటే అసంతృప్తి కలిగిస్తుంది. టామీ స్నేహితురాలి పాత్రలో పూనం నటన కానీ, ఆమెరూపం కానీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఒక సన్నివేశంలో ఆమె కూర్చున్న తీరు ఎంత అసభ్యంగా తోస్తుందో! లారెస్సా బొనేసి కాస్త బెటర్.
చివరి మాట
కథా కథనాల పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేని ఈ సినిమా చవకబారు పాత్రల చిత్రణతో మరింత నాసిరకంగా కనిపిస్తుంది. టెక్నికల్‌గా ఏమాత్రం మెప్పించని ఈ సినిమా టిక్కెట్‌కు పెట్టిన పైసలకు అస్సలు న్యాయం చెయ్యదు. పొరబాటున ఈ సినిమాకు వెళ్లినవాళ్లు ఓపిగ్గా చివరిదాకా కుర్చీల్లో కూర్చోవడం కష్టం.
– బుద్ధి యజ్ఞమూర్తి
7 డిసెంబర్, 2018