NTR: Kathanayakudu – Kathanayaka Single: A Tribute To NTR


NTR: Kathanayakudu - Kathanayaka Single: A Tribute To NTR

యన్.టి.ఆర్: కథానాయకుడు – ఎన్టీఆర్‌కు నీరాజనం పలికిన గీతం

కథానాయకుడిగా ఎన్టీ రామారావు సినీ ప్రస్థానం అనితర సాధ్యం. భారతీయ చిత్రసీమలోనే మరెవరికీ దక్కని కీర్తి ప్రతిష్ఠలు ఆయన సొంతం. ఒక పురాణ పురుషుడి బొమ్మ కావాలంటే ఆయన బొమ్మే ప్రత్యక్షయమవుతుంది. కృష్ణుడైనా, రాముడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా, అర్జునుడైనా, భీముడైనా, భీష్ముడైనా, రావణుడైనా.. కళ్లముందు నిలిచేది ఆయన ఆహార్యమే.

సాధారణంగా ఒక కథానాయుడు ఒక తరహా పాత్రలతో కీర్తి పొందుతారు. కానీ పురాణ, జానపద, సాంఘిక చిత్రాల కథానాయకుడిగా ఎన్టీఆర్ రాణించిన తీరు అమోఘం. అలాంటి ఆయన జీవిత కథ రెండు భాగాలుగా సెల్యులాయిడ్‌పై అనువాదమవుతోంది. తొలి భాగం ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ జనవరి 9న సంక్రాంతి సందర్భంగా వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నారు. ఆ చిత్రంలోని తొలి పాటను డిసెంబర్ 2న యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు.

కథానాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన ఘనతలు, పోషించిన పాత్రలను ఉదహరిస్తూ ఈ పాట ధీరోదాత్తంగా, గంభీరంగా నడిచింది. మోహనరాగంలో ఎం.ఎం. కీరవాణి స్వరాలు కూర్చిన ఈ గీతాన్ని ఎక్కువగా సంస్కృత సమాసాలు, సంధుల కూర్పులతో కె. శివదత్త, డాక్టర్ కె. రామకృష్ణ సంయుక్తంగా రచించారు. బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ స్వరం ఈ గీతాలాపనకు సరిగ్గా సరిపోయింది.

‘ఘనకీర్తిసాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా..’ అంటూ ఎన్టీఆర్‌ను కీర్తించే ఈ పాటలోని కొన్ని పదబంధాలు సామాన్యులకు అర్థమవడం కష్టమే. మూడొందల పైగా చిత్రాలతో ఆయన జైత్రయాత్ర చేశారనీ, రూపంలోనూ, వాచకంలోనూ, నటనా విన్యాసంలోనూ అద్భుత కథానాయకుడనీ కొనియాడారు. ఆయన పోషించిన పురాణ పాత్రలను ప్రస్తావిస్తూ వాటిని గొప్పగా పోషించారని ప్రశంసించారు. తను పోషించిన పాత్రలతో అన్ని రసాలనూ అద్భుతంగా పండించారన్నారు. ఆ పాత్రలతో అఖండ కీర్తి ప్రతిష్ఠల్ని ఆర్జించారని చెప్పారు.

ఈ పాట రికార్డింగ్ సన్నివేశాలు, సినిమా సెట్స్ రూపకల్పనను చూపిస్తూ వీడియోను రూపొందించారు. చివరలో సుయోధన సార్వభౌముడి గెటప్‌లో దాదాపు తండ్రికి సరితూగేలా బాలకృష్ణ కనిపించడం విశేషం. స్వర పరంగా, గాన పరంగా, సాహిత్య పరంగా ఆకట్టుకుంది ఈ పాట. కథానాయకుడిగా ఎన్టీఆర్‌కు నీరాజనం పలికిన ఈ పాట ఆయన అభిమానుల్ని విశేషంగా అలరిస్తుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *