NTR: Kathanayakudu Trailer: 6 Things To Expect


NTR: Kathanayakudu Trailer: 6 Things To Expect

ఎన్‌టీఆర్ ట్రైలర్: ఊహల్లో 6 విషయాలు

ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్‌టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్‌టీఆర్: మహానాయకుడు’ చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రాల్ని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు.

వీటిలో మొదటి సినిమా జనవరి 9న, రెండో సినిమా జనవరి 24న విడుదలవుతున్నాయి. కాగా ‘ఎన్‌టీఆర్: కథానాయకుడు’ ట్రైలర్‌ను డిసెంబర్ 16న హైదరాబాద్‌లో, ఆడియో వేడుకను 21న ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ట్రైలర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లోనే కాకుండా సినిమా ప్రియులందరిలోనూ వ్యక్తమవుతోంది. తొలి భాగం ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించింది కాబట్టి ఆయన నిమ్మకూరు నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టే సన్నివేశాన్ని ఈ ట్రైలర్‌లో రివీల్ చేసే అవకాశాలున్నాయి.

ఆయన తొలిసారి కెమెరా ముందు నిల్చున్న సినిమా ‘మనదేశం’. అందువల్ల ఆ సినిమాలో ఆయనపై చిత్రీకరించిన తొలి సన్నివేశాన్ని చూపించవచ్చనే అంచనా వేసుకోవచ్చు.

బ్లాక్ అండ్ వైట్ యుగంలో చక్రం తిప్పాక కలర్ యుగంలోనూ ‘అడవిరాముడు’, ‘వేటగాడు’ సినిమాలతో కమర్షియల్ సినిమాకు అర్థం చెప్పిన కథానాయకుడిగా సినీ రంగాన్ని ఎలా ఏలారనే సన్నివేశాల్ని ఈ ట్రైలర్‌లో మనం ఆశించడంలో తప్పేమీ లేదు.

పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు కాబట్టి ‘మాయాబజార్’ కృష్ణుడిగా, ‘దానవీరశూరకర్ణ’లోని సుయోధనుడిగా ఎన్టీఆర్ వేషంలోని బాలకృష్ణను మనం దర్శించే అవకాశం ఉంది. వీటితో పాటు బసవతారకంతో పెళ్లి సన్నివేశాన్ని కూడా క్రిష్ ఈ ట్రైలర్‌లో ఏమైనా చూపించబోతున్నాడా?

సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి నిశ్చయించుకున్న సన్నివేశం కూడా ఈ ట్రైలర్‌లో ఉంటుందా?.. ఇలా ఇంకా చాలా ఊహలే ఈ ట్రైలర్‌లో ఉండొచ్చనిపిస్తోంది. చూద్దాం.. బాలకృష్ణ, క్రిష్ జోడీ ఏం మాయ చేయబోతున్నారో!