Odiyan Review: 3 Ups And 5 Downs


Odiyan Review: 3 Ups And 5 Downs

ఒడియన్ రివ్యూ: 3 అడుగులు ముందుకి, 5 అడుగులు వెనక్కి

తారాగణం: మోహన్‌లాల్, ప్రకాశ్‌రాజ్, మంజు వారియర్, సనా అల్తాఫ్, సిద్దిఖ్
దర్శకుడు: వి.ఎ. శ్రీకుమార్ మీనన్
విడుదల తేదీ: 14 డిసెంబర్ 2018

మోహన్‌లాల్ టైటిల్ రోల్ పోషించగా యాడ్ ఫిల్మ్ మేకర్ శ్రీకుమార్ మీనన్ తొలిసారి డైరెక్ట్ చేసిన ‘ఒడియన్’ సినిమా కొంత కాలంగా ప్రచార మాధ్యమాల్లో నలుగుతోంది. 31 దేశాల్లో విడుదలవబోతున్న తొలి భారతీయ చిత్రంగా మీనన్ ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు. ఒక మలయాళ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అనువాదమై ఒరిజనల్ వెర్షన్‌తో పాటు విడుదలవడమూ ఇదే తొలిసారి.

సామాన్య మానవులకు ఉండని కొన్ని అద్భుత శక్తులు కేరళలో ఒకప్పుడు జీవించిన ‘ఒడియన్’ తెగవాళ్లకు ఉంటాయని ప్రతీతి. ఆ తెగకు చెందిన చివరి వ్యక్తి కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉందా? 

కథ

కేరళలో అద్భుత శక్తులున్నాయని జనం చెప్పుకొనే ఒడియన్ తెగకు చెందిన ఆఖరు వ్యక్తి మాణిక్యం (మోహన్‌లాల్). అతని తాత మాణిక్యం తన పేరే మనవడికి పెట్టి ఒడియన్‌గా తీర్చిదిద్దుతాడు. రాత్రివేళల్లో సంచరిస్తూ ఎవరో ఒకర్ని భయపెట్టడం ద్వారా జీవికను సంపాదించుకోవడం అతడి వృత్తి. ప్రభ (మంజు వారియర్) అనే పెద్దింటి యువతికీ, అతడికీ ఒకరంటే ఒకరికి అనురాగం.

కానీ నింగీ, నేలా కలవవని ఆమెతో కలిసి జీవనం సాగించలేనంటాడు మాణిక్యం. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటుంది ప్రభ. అయితే ఆమెనే భార్యగా పొందాలని తపించే ఆమె బావ రాజారావ్ (ప్రకాశ్‌రావ్) ఇది భరించలేకపోతాడు. ప్రభకూ, మాణిక్యంకూ మధ్య అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త ప్రకాశ్‌కు నూరిపోస్తాడు. మాణిక్యం సంగతి తేల్చమని అతడిని రెచ్చగొడతాడు.

నడి బజార్లో మాణిక్యంపై గొడవపడతాడు ప్రకాశ్. కానీ అతడి చేతిలో తన్నులు తింటాడు. అదే రాత్రి స్కూటర్‌పై వెళ్తున్న ప్రకాశ్ తనపై ఏదో గుర్తుతెలీని ఆకారం దాడిచేయబోతే, అదుపుతప్పి కిందపడిపోతాడు. పొద్దున్నే అతడు చచ్చిపడి ఉంటాడు. అతడిని మాణిక్యమే హత్య చేసి ఉంటాడని ఊళ్లో పుకారు బయలుదేరుతుంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుంటారు.

అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకాశ్ గుండె ఆగి చనిపోయాడని రావడంతో మాణిక్యాన్ని వదిలిపెడతారు. ఊరికి విద్యుత్ సౌకర్యం రావడంతో వెలుగంటే గిట్టని మాణిక్యం ఇబ్బంది పడతాడు. ప్రభ చెల్లెలు అంధురాలైన మీనాక్షి (సనా అల్తాఫ్) భర్త రవి (కైలాష్)ను కూడా చంపుతారు. కరంటు తెచ్చాడనే కోపంతో రవిని మాణిక్యమే చంపాడని రాజారావ్ బృందం ప్రచారం చేస్తుంది.

మాణిక్యాన్ని ప్రభ అసహ్యించుకుంటుంది. దాంతో ఊరొదిలి వారణాసి వెళ్లిపోతాడు మాణిక్యం. అయితే పదిహేనేళ్ల తర్వాత అతడు మళ్లీ తన ఊరికి తిరిగొస్తాడు. అతడెందుకు వచ్చాడు? ప్రకాశ్, రవి మరణాల వెనకున్నదెవరో అతడు తెలుసుకున్నాడా? ప్రభ ఎలా స్పందించింది? మాణిక్యం ఏమయ్యాడు?.. అనేది మిగతా కథ.

Odiyan Review: 3 Ups And 5 Downs
కథనం

ఒడియన్ అనే ఒక అరుదైన తెగకు చెందిన వ్యక్తి కథగా ప్రచారం పొందిన సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎన్నో ఊహలు, అంచనాలు ఉంటాయి. ఎవరైనా ఒక గొప్ప కథను ఊహిస్తారు. ఒడియన్ అద్భుతాలు చేస్తాడనుకుంటారు. ఆ అద్భుతాలను వీక్షించడం కోసం కళ్లు కాయలు చేసుకుంటారు. కానీ ఆ ఊహలకూ, అంచనాలకూ పొంతనలేకుండా ఉంది ‘ఒడియన్’ సినిమా.

ఒడియన్ మాణిక్యంకు అతి వేగంగా కదిలే శక్తి, ఎగిరే శక్తి, రూపం మారే శక్తి ఉన్నా, కథ అతి సాధారణంగా ఉండటం, ఆ కథను చెప్పే పద్ధతి తికమక కలగజేసేట్లు ఉండటం పెద్ద మైనస్ పాయింట్. నిజానికి ఓపెనింగ్ సీన్ అంచనాలకు తగ్గట్లే ఉన్నత ప్రమాణాల్లో ఉంది.

వారణాసిలో గంగా నదిలో ప్రమాదవశాత్తూ ఒక నడివయసు స్త్రీ చీర చెంగు ఒక బోటుకు తగులుకొని, ఆ బోటు ఆమెను ఈడ్చుకొని వెళ్తుంటే ఒడ్డున ధ్యాన ముద్రలో ఉన్న ఒక నడివయసు వ్యక్తి నీటిలో దూకి ఆమెను రక్షించడం, అతడిని చూసి ఆమె గుర్తుపట్టి ఒడియన్ మాణిక్యంగా సంబోధించడం.. ఒక గొప్ప సినిమాను చూడబోతున్న బిల్డప్‌నిస్తుంది.

అక్కడి నుంచి కథ పలు దఫాలుగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి వర్తమానంలోకి వస్తుంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ఇంకో ఫ్లాష్‌బ్యాక్ రావడం స్క్రీన్‌ప్లేలో దొర్లిన పెద్ద లోపం. దర్శకుడి అనుభవ రాహిత్యం ఇక్కడ స్పష్టం. ఇంకా తికమక పెట్టే విషయమేమంటే ప్రభ కోణం నుంచి ఫ్లాష్‌బ్యాక్ నడిచి, వర్తమానం మాణిక్యం కోణంలోకి రావడం. ఇది కథ నడకను డిస్టర్బ్ చేసింది.

ఫస్టాఫ్‌లో ఈ తీరుతో తీవ్ర అసహనానికి గురవుతాం. ఎడిటర్ కూడా దీన్ని సరిచేయలేకపోయాడు. సెకండాఫ్‌లో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాల వల్ల కథ కాస్త ఆసక్తికరంగా ఉన్నట్లనిపించినా, సాగతీత ఎక్కువై ఇంకా సినిమా పూర్తవట్లేదేమిటనే చికాకు కలుగుతుంది. రాజారావ్ అల్లుడి బృందాన్ని భయపెడుతూ మాణిక్యం వాళ్లను చావగొట్టే సన్నివేశాలను పీటర్ హైన్స్ ఒళ్లు గగుర్పాటు కలిగే రీతిలో చిత్రించాడు.

కానీ రాజారావ్ బృందంతో మాణిక్యం తలపడే క్లైమాక్స్ ఫైట్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. యవ్వనంలో ఉండగా మాణిక్యం, ప్రభ మధ్య రొమాన్స్‌కు ఎక్కడా తావివ్వలేదు దర్శకుడు. కానీ నడివయసులో ఉన్న ప్రభ ఊహల్లో ఆ ఇద్దరి మధ్య పాట రావడం ఎంత అసందర్భంగా ఉందో!

Odiyan Review: 3 Ups And 5 Downs
పాత్రల చిత్రణ – నటుల అభినయం

చివరి ఒడియన్ మాణిక్యం పాత్రను ప్రత్యేక శ్రద్ధతో మోహన్‌లాల్‌ను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దాడు దర్శకుడు. చిన్నతనం నుంచి ఒడియన్‌గా అతడు ఎదిగే క్రమాన్ని బాగానే చూపించాడు. కానీ అవసరమైన సందర్భాల్లో ఆ పాత్ర ఔచిత్యాన్ని ప్రశ్నార్థకం చేశాడు.

ప్రభ భర్త ప్రకాశ్, మీనాక్షి భర్త రవి మరణాలు మిస్టరీగా మారినప్పుడు, వాళ్ల మరణాల వెనుక తను ఉన్నానని స్వయంగా ప్రభ నమ్మినప్పుడు ఊరొదిలి పారిపోవడం ఏమిటి? ఎన్నో శక్తియుక్తులున్న అతడు అప్పుడే ఆ మిస్టరీలను ఛేదించే పని ఎందుకు చేపట్టలేదు? రాజారావ్ దుష్టుడని తెలిసి కూడా ఆ హత్యల వెనుక అతడున్నాడనే విషయాన్ని కనీసం ఎందుకు ఊహించలేకపోయాడు?

“వాళ్లను నేను చంపలేదు” అని బేలగా ప్రభ కాళ్ల మీద మాణిక్యం పడటం ఆ పాత్ర వీరత్వాన్నీ, ధీరత్వాన్నీ తగ్గించి వేసింది. ఆ సంగతలా ఉంచితే మాణిక్యం పాత్రలో మోహన్‌లాల్ తనకే సాధ్యమైన రీతిలో అభినయాన్ని ప్రదర్శించాడు. వాస్తవంగా నడి వయసు దాటిన ఆయన మాణిక్యం యువకుడిగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన సన్నివేశాల్లో కుర్రాడిలాగే కనిపించి అబ్బురపరిచాడు.

ఎంత మేకప్‌తో కవర్ చేసినా ఆ యంగ్ లుక్ రావడం కష్టం. సెటిల్డ్‌గా ఆ పాత్రను మోహన్‌లాల్ చేసుకుపోయాడు. ఆయన తర్వాత మెప్పించింది ప్రభ పాత్రను చేసిన మంజు వారియర్. మాణిక్యం అంటే మనసులో ప్రేమను పెట్టుకొని ప్రకాశ్‌ను పెళ్లాడిన ఆమె అంధురాలైన చెల్లెలు మీనాక్షిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది.

తన భర్త ప్రకాశ్‌నూ, మీనాక్షి భర్త రవినీ మాణిక్యమే చంపాడని పొరబడుతుంది. ఆయా సందర్భాల్లో భావోద్వేగాల్ని మంజు ఉన్నత స్థాయిలో ప్రదర్శించింది. రాజారావ్‌గా ప్రకాశ్‌రాజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది! ఇలాంటి దుష్ట పాత్రలు చేయడం ఆయనకు నల్లేరుపై బండి నడక. అతి సునాయాసంగా చేసుకుపోయాడు. అయితే ఆయన పాత్రతో ‘నలుపు’ను కించపర్చడం బాలేదు.

“నీ ఒళ్లే కాదు, నీ మనసూ నలుపే” అని ప్రభ చేత డైలాగ్ చెప్పించడం తగిన పనికాదు. ఇవాళ నలుపు ఆత్మగౌరవానికి చిహ్నంగా మారిందనే అవగాహన దర్శకుడికి లేదని అర్థమైంది. మీనాక్షిగా నటించిన సనా అల్తాఫ్ అభినయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే.

కళ్లులేని అమ్మాయిగా ఎంత అమాయకంగా కనిపించి మెప్పించిందో, చివరలో పదిహేనేళ్లపాటు తన గది నుంచి బయటకు రాకుండా ఉండిపోయిన ఆమె మాణిక్యం రాకను పసిగట్టి బయటకు వచ్చినప్పుడు చూపిన హావభావాలతో అంతగా హృదయాల్ని కదిలించివేస్తుంది. మిగతా వాళ్లు పాత్రల పరిధుల మేరకు చేశారు.

Odiyan Review: 3 Ups And 5 Downs
చివరి మాట

మోహన్‌లాల్ అభిమానులైనా ‘ఒడియన్’ కేళిని ఆస్వాదిస్తారేమో కానీ, ఈ సాధారణ కథను, తికమకపెట్టే కథనాన్నీ ఆస్వాదించలేరు. ఇక సగటు ప్రేక్షకుడి గురించి చెప్పేదేముంది? మొదటి సగం అసహనానికి గురై, కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతాం.

రెండో సగంలో యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలతో పర్వాలేదనుకుంటాం. ప్రిక్లైమాక్స్‌కు వచ్చేసరికి పదే పదే టైం చూసుకొని, సినిమా ఇంకెప్పుడవుతుందా.. అని ఎదురు చూస్తాం. ఆఖరుకు “ప్చ్..” అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తాం.

  • బుద్ధి యజ్ఞమూర్తి
    14 డిసెంబర్ 2018