Odiyan: What Does It Really Mean?

‘ఒడియన్’ సినిమా దేని గురించంటే…
మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించిన మలయాళ చిత్రం ‘ఒడియన్’ అనేక అంశాల పరంగా మొదటిదిగా నిలుస్తోంది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలను రూపొందించిన శ్రీకుమార్ మీనన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 31 దేశాల్లో, తొలిసారిగా జపాన్, పోలండ్‌లలో విడుదలవుతున్న తొలి మలయాళ చిత్రం. అలాగే మూడువేల థియేటర్లలో విడుదలవుతున్న మొదటి మలయాళ చిత్రం.
వందలాది ఏళ్లుగా ఉత్తర కేరళలో పేరుపొందిన తెగ అయిన ఒడియన్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఒడియన్లు రూపం మార్చుకోగల శక్తిసంపన్నులనీ, క్షణ కాలంలో భయంకర జంతు రూపంలోకి మారిపోతారనీ, వాటిని చూసిన భయంతోనే మనుషులు చనిపోతారనీ ఒక నమ్మకం వ్యాపించి ఉంది. ఒడియన్లు నిశాచరులు. మారుమూల ప్రాంతాల్లోకి సైతం విద్యుత్ సౌకర్యాలు రావడంతో ఒడియన్ జాతి నాశనమైపోయిందని చెప్పుకుంటారు.
విద్యుత్ సౌకర్యం రాకముందు, వచ్చాక.. మొత్తం 50 యేళ్ల కాలం కథతో శ్రీకుమార్ ‘ఒడియన్’ను రూపొందించాడు. చిట్టచివరి ఒడియన్ అయిన మాణిక్యన్ అనే పాత్రను మోహన్‌లాల్ పోషించాడు. ప్రకాశ్ రాజ్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు. భారీ బడ్జెట్‌తో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సినిమాలోని ఎక్కువ భాగాం చిత్రించారు.
‘ఒడియన్’ను శ్రీకుమార్ ‘దేశి సూపర్ హీరో’గా అభివర్ణిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రకటనల రంగంలో ఉన్నందున ఈ సినిమాని కూడా అదే తరహాలో మార్కెటింగ్ చేస్తున్నాడు. ‘ఒడియన్’ విగ్రహాలను కేరళవ్యాప్తంగా నెలకొల్పుతున్నాడు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నాడు. ఒడియన్ కథల్ని కామిక్ బుక్స్‌గా తీసుకు వస్తున్నాడు. అలాగే ‘ఒడియన్’ పేరుతో మొబైల్ యాప్‌ను, వీడియో గేంను విడుదల చేస్తున్నాడు.
సాధారణంగా దక్షిణాన రజనీకాంత్ సినిమాలు విడుదలయ్యేప్పుడు ఎలాంటి సందడి వాతావరణం, హంగామా ఉంటుందో, అలాంటి వాతావరణమే ఇప్పుడు ‘ఒడియన్’ విడుదలలో కనిపిస్తుండటం విశేషం. మలయాళంతో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో డిసెంబర్ 14న వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
– సంజయ్
8 డిసెంబర్, 2018