Rangasthalam: Why It Is Sukumar’s Best Film So Far


 

Ramcharan in rangasthalam

రంగస్థలం: సుకుమార్ సినిమాల్లో ద బెస్ట్

తెలుగు సినిమా అగ్రశ్రేణి దర్శకుల్లో సుకుమార్ ఒకరు. సమకాలీన దర్శకుల్లో మూస పద్ధతిలో కాకుండా భిన్నంగా ఆలోచించి, కొత్తగా సన్నివేశాల్ని కల్పించి, పాత్రల్ని వీలైనంత విలక్షణంగా చూపించే దర్శకుడు. 2018లో ఆయన నుంచి వచ్చిన ‘రంగస్థలం’ ఒక గొప్ప చిత్రం. తెలుగు చిత్రసీమలో సృజనాత్మకంగా ఆలోచించే టాప్ డైరెక్టర్లలో సుకుమార్ అగ్రరణ్యుడని నిరూపించిన చిత్రం. చెప్పాలంటే తన కెరీర్‌లో ఇప్పటివరకూ తీసిన 7 సినిమాల్లో ద బెస్ట్ ‘రంగస్థలం’. అందులో అంత గొప్ప ఏముందని ప్రశించేవాళ్లు ఉండొచ్చు. ఆ సినిమాకు అంత సీన్ లేదని వాదించేవాళ్లూ ఉండొచ్చు. ఎందుకు అది సుకుమార్ బెస్ట్ ఫిలిమో చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.

తొలి సినిమా ‘ఆర్య’తోటే సంచలనం సృష్టించాడు. రివర్స్ హీరోయిజంతో మెప్పించి, అల్లు అర్జున్‌లో స్టార్ మెటీరియల్ ఉందని నిరూపించాడు. ఆ సినిమా, దాని సీక్వెల్ ‘ఆర్య 2’, మహేశ్‌తో చేసిన ‘1.. నేనొక్కడినే’, జూనియర్ ఎన్టీఆర్‌తో రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు జనరేషన్ నెక్స్ట్ సినిమాలు. అంటే నేటి తరానికంటే ముందుకుపోయి ఆలోచించి చేసిన సినిమాలు. రాం హీరోగా తీసిన ‘జగడం’ ఒక బస్తీ కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే క్రమాన్ని చూపించిన చిత్రం.

నాగచైతన్య, తమన్నా జంటగా తీసిన ‘100% లవ్’ ఇద్దరు బావామరదళ్ల మధ్య ప్రేమను, ఇగోతో ఒకరికొకరు దూరమైన వైనాన్ని చూపించిన ఫిల్మ్. ఇప్పుడు తీర్చిదిద్దిన ‘రంగస్థలం’ వాటన్నింటి కంటే మరింత భిన్నమైంది. సుకుమార్ తీసిన ఏడు సినిమాల్లో ఏ ఒక్కటీ మరొకదానితో పోలిక లేనిది. ఆఖరుకి ‘ఆర్య’, ‘ఆర్య 2’కూడా ఒకదానికొకటి భినంగా తోస్తాయి. రాబోయే తరాల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు తీసే సుకుమార్ నుంచి 1980ల కాలం నాటి, అదీ ఒక గ్రామీణ నేపథ్య కథాంశంతో సినిమాని మనం ఊహించగలమా? కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నత స్థాయి కథ, కథనం, పాత్రల చిత్రణ, సన్నివేశాల కల్పనతో ‘రంగస్థలం’ను మరపురాని తెలుగు చిత్రాల కోవలో నిలిపాడు సుకుమార్.

 

Samantha & Ramcharan in Rangasthalam

చిట్టిబాబు క్రమ పరిణామం

1980ల నాటి పల్లె వాతావరణాన్ని ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించాడు సుకుమార్. ప్రెసిడెంట్లు ఎలా నియంతల్లా ఊరంతట్నీ తమ గుప్పెట్లో పెట్టుకొని, తమ ఆధిపత్యానికి ఎదురొచ్చినవాళ్లను ఆనవాళ్లు లేకుండా చంపేస్తారో, కన్నుపడిన భూముల్ని తమపరం చేసుకుంటారో, పేదలపై దాష్టీకాలు చేస్తారో జగపతిబాబు పోషించిన ఫణీంద్రభూపతి పాత్ర ద్వారా చూపించాడు.

రాంచరణ్ పోషించిన పాత్ర చూస్తే మొదట్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఊళ్లో ప్రెసిడెంట్ అక్రమాల్నీ, పీడననీ ఏమాత్రం పట్టించుకోని ఒక సగటు గ్రామీణుడిగా, బాధ్యతలు తెలీనివాడుగా చిట్టిబాబు కనిపిస్తాడు. పైగా అతడు చెవిటివాడు. అయితే తనలోపాన్ని ఒప్పుకోని సగటు చెవిటివాడు. అన్న ఇచ్చిన వినికిడి యంత్రాన్ని కూడా విసిరేసేంత అభిమానవంతుడు. రామలక్ష్మిని చూసి ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.

ఊళ్లో ఏదైనా జాతర జరుగుతుందంటే మనవాడి సంబరం చూడాల్సిందే. అలాంటివాడు అన్న కుమార్‌బాబు ప్రెసిడెంటుకు వ్యతిరేకంగా ఎలక్షన్లలో నిలబడితే మొదట ఆనందపడతాడు, తోడుంటాడు. కానీ ప్రెసిడెంటు వల్ల అన్నకు ప్రాణహాని ఉందని రంగమ్మత్త చెప్పినప్పుడు అన్నను కాపాడుకోడానికి ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటాడు. ఆ విషయం తెలిసి తన వాళ్లందరూ అసహ్యించుకుంటే తిరిగి ఇచ్చేస్తాడు. ప్రమాదంలో చిక్కుకున్న అన్నను కాపాడుకోడానికి శక్తివంచన లేకుండా పోరాడుతాడు. తన వినికిడి లోపం కారణంగా అన్న చావుబతుకుల్లోకి వెళ్లడంతో తొలిసారి తనకు ఆ లోపం ఉన్నందుకు బాధపడతాడు. చివరకు అన్నను చంపిన వాళ్లను తుదముట్టిస్తాడు.

నిజంగా ఆ పాత్రను సుకుమార్ మలిచిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం తెలీని గ్రామీణ కుర్రాడి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలే యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా చిట్టిబాబు క్రమానుగత పరిణామాన్ని కన్విన్సింగ్‌గా తీర్చిదిద్దడంలో సఫలీకృతుడయ్యాడు సుకుమార్. అంతే కాదు, రాంచరణ్‌తో పాత్రను చేయించిన విధానానికి కూడా సుకుమార్ ప్రశంసార్హుడు. చరణ్‌తో ఈ తరహా నటుడున్నాడని మనం ఇంతవరకు ఊహించలేదు. అతని నటనా ప్రతిభను ఈ స్థాయిలో వెలికితీసే పాత్ర రాకపోవడం దీనికి కారణం కావచ్చు.

సినిమాలో అధిక భాగం అతడు పైకి ఎత్తికట్టిన లుంగీతో, పెంచిన గడ్డంతో కనిపిస్తాడు. అతని డైలాగ్ డిక్షన్ కానీ, రామలక్ష్మితో రొమాన్స్ చేసేప్పుడు, తన చెవిటితనాన్ని కప్పిపుచ్చేటప్పుడు, రంగమ్మత్తతో సరసాలు ఆడేప్పుడు, అన్నతో సరదాగా చిన్న చిన్న గొడవలు పడేప్పుడు, ప్రమాదంలో ఉన్న అన్నను రక్షించుకొనే సందర్భంలో, క్లైమాక్సులో ప్రకాశ్‌రాజ్‌ను చంపే ముందు చరణ్ ఉన్నత స్థాయి నటనను కనపరిచాడు. చిట్టిబాబుగా అతని అభినయం కచ్చితంగా అవార్డు తెచ్చిపెట్టదగ్గది.

 

Ramcharan & Adhi Pinisetti in Rangasthalam

సానుభూతి పొందే కుమార్‌బాబు

సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆది పినిశెట్టి పోషించిన కుమార్‌బాబు పాత్ర. తమ్ముడు చిట్టిబాబు తనేమిటో, తన సరదాలేమిటో అన్నట్లు కనిపిస్తే, కుమార్‌బాబు దానికి పూర్తి భిన్నంగా, ఊరిలో ఒకింటి పెద్దకొడుకు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటాడో అన్నదానికి నిదర్శనంగా కనిపిస్తాడు. దుబాయ్ నుంచి వచ్చిన అతను కేవలం తన కుటుంబ బాధ్యతలే కాదు, ప్రెసిడెంటు చేస్తున్న అక్రమాలు, పెత్తందారీతనం చూసి, రగిలిపోయి ఊరి బాధ్యతను కూడా తీసుకోవాలనుకుంటాడు.

ప్రెసిడెంటుపై ఎన్నికల్లో పోటీకి నిల్చుంటాడు. ప్రెసిడెంటుతో పాటు ఎమ్మెల్యే దక్షిణామూర్తి కుట్రకు బలైపోతాడు. ఊరికోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన కుమార్‌బాబు పాత్ర ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలిస్తుంది, సానుభూతిని సంపాదించుకుంటుంది. పాత్రను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నందునే కుమార్‌బాబుగా ఆది పినిశెట్టి అత్యుత్తమంగా నటించాడు.

రాంచరణ్ తర్వాత మనల్ని బాగా ఆకట్టుకొనేది ఆదినే. చిట్టిబాబు అల్లరిచిల్లరగా కనిపిస్తే, కుమార్‌బాబు హుందాగా, హీరోయిక్‌గా కనిపిస్తాడు. దుండగుల చేతుల్లో చిక్కి అతడు మరణించే సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరించిన తీరు మన హృదయాల్ని కలచివేస్తుంది. రెండు బిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల పాత్రల్ని సుకుమార్ డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రల మధ్య అనుబంధాన్ని చిత్రించిన వైనం మనల్ని కట్టిపడేస్తుంది.

 

Anasuya & Ramcharan in Rangasthalam

కీలకమైన రంగమ్మత్త పాత్ర

ప్రెసిడెంటు కిరాతకత్వం ఎలాంటిదో చిట్టిబాబుకు తెలియజెప్పే రంగమ్మత్త పాత్రను సుకుమార్ తీర్చిదిద్దిన దర్శకుడిగా ఆయనలోని వివేకానికి నిదర్శనం. చిట్టిబాబుతో పైకి సరదాగా మాట్లాడుతూ, సరసాలాడే రంగమ్మ హృదయంలో ఎంతటి బడబానలం దాగుందో!

మొగుడు ప్రెసిడెంటు మనుషుల చేతుల్లో దారుణంగా చనిపోయినా, దాన్ని పంటి బిగువున అదిమిపెట్టుకొని, అతడు దుబాయ్ వెళ్లాడని ఊరివాళ్లను మభ్యపెడుతూ, పైకి నవ్వుతూ కాలం గడిపే రంగమ్మ పాత్రను అనుభవం ఉన్న నటితో కాకుండా యాంకర్‌గా అందరికీ పరిచయమున్న అనసూయతో చేయించడం ఒక సాహసం.

ఆ పాత్రను అర్థం చేసుకొని, ఆ పాత్రలోని పెయిన్‌ను చక్కగా అనసూయ చేసిందంటే ఆ క్రెడిట్ సుకుమార్‌ది కాక మరెవరిది! ప్రెసిడెంట్ చచ్చాక ఏకగ్రీవంగా ఊరంతా ఆమెను ప్రెసిడెంటుగా ఎన్నుకున్నట్లు చూపించి, ఊరికి మంచిరోజులొచ్చాయనే విషయాన్ని అన్యాపదేశంగా చెప్పాడు.

 

Ramcharan in Rangasthalam

చివరి దాకా సస్పెన్స్

ఆరంభ, ముగింపు సన్నివేశాలను సుకుమార్ కల్పించిన తీరు ఆయన ప్రతిభకు మరో నిదర్శనం. చిట్టిబాబు సైకిల్ తొక్కుకుంటూ ఎమ్మెల్యే దక్షిణామూర్తి ఇంటి దగ్గరకు వచ్చిన సమయంలోనే ఆయన లారీ యాక్సిడెంట్‌కు గురై, కోమాలోకి వెళ్లడం, సంవత్సరాల తరబడి చిట్టిబాబు ఆయనకు సేవలు చేస్తున్న వైనం చూసి, అదంతా ఆయనను చంపడానికేనని క్లైమాక్స్ దాకా మనం ఊహించం.

ఆ సస్పెన్స్‌ను చివరి దాకా నిలబెట్టడంలోనూ, దక్షిణామూర్తిని చిట్టిబాబు చాలా తీరిగ్గా చంపే సన్నివేశాన్ని కల్పించడంలోనూ సుకుమార్‌లో ఉన్నత స్థాయి దర్శకుడు మనకు గోచరిస్తాడు. ఇక్కడ కూడా ధనిక-పేద, పెద్ద కుల-తక్కువ కుల తారతమ్యాలు ఎంతటి దుర్మార్గానికైనా ఎలా దారితీస్తాయో కూడా దర్శకుడు చూపించాడు. పైకి వెన్నలా కనిపించే దక్షిణామూర్తి లోపలి విషం ఎంత భయకరంగా ఉందో చిట్టిబాబుతో చివర ఆయన చెప్పే మాటల్లో మనకు కనిపిస్తుంది.

ఊరంటే ఎలా ఉంటుంది? ‘రంగస్థలం’లా ఉంటుంది! ఊరి మనుషులెలా ఉంటారు? ‘రంగస్థలం’లో మాదిరిగా ఉంటారు! ఊరి మనుషుల్లో అనుబంధాలెలా ఉంటాయి? ‘రంగస్థలం’లో మాదిరిగా ఉంటాయి! అంతలా ఊరినీ, ఊరి మనుషుల్నీ, వాళ్ల మధ్య అనుబంధాల్నీ, పీడకుల దాష్టీకాల్నీ సహజంగా జరిగాయి, జరుగుతున్నాయన్నట్లుగా మనముందు నిలపడం వల్ల సుకుమార్ ఇప్పటివరకూ రూపొందించిన సినిమాల్లోనే అత్యుత్తమ చిత్ర్రం ‘రంగస్థలం’.

– బుద్ధి యజ్ఞమూర్తి

2 డిసెంబర్, 2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *