Venkatesh And Tamannaah: Odd But Interesting Pair


Venkatesh And Tamannaah: Odd But Interesting Pair

వెంకీ-తమన్నా జోడీ: ఆడ్ బట్ ఇంటరెస్టింగ్

‘ఎఫ్2’ టీజర్ వచ్చేసింది. అందులో వెంకటేశ్-తమన్నా ఒక జంటగా, వరుణ్‌తేజ్-మెహరీన్ మరో జంటగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. టీజర్ చూస్తే సినిమా హిలేరియస్‌గా నవ్విస్తుందని అర్థమైపోతుంది.

“మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత” అంటూ చివరలో ఏడుపు ముఖతో నిర్వచనం చెప్పే వెంకటేశ్ ముఖం మనల్ని వెంటాడుతుంటుంది. తమన్నాతో పెళ్లయ్యాక తను పడే బాధలను ఆ మాటల ద్వారా వెంకీ వ్యక్తం చేశాడన్న మాట. ఒక సీన్లో అయితే వెంకీ, తమన్నా గొడవ పడుతున్నట్లు, వెంకీపై తమన్నా అప్పడాల కర్ర విసిరేస్తున్నట్లు కూడా చూపించారు.

అంత వరకు బాగానే ఉంది కానీ, వెంకీ-తమన్నా జంట తెరపై ఎలా ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి వెంకీ వయసు 57 ఏళ్లయితే, తమన్నా వయసు 28 ఏళ్లు. ఇంత వయసు తారతమ్యం ఉన్న హీరోయిన్‌తో జోడీకట్టడం వెంకీకి ఇదే మొదటిసారి. తమన్నాకైనా అంతే. ఇంత సీనియర్ హీరోతో చేయడం ఆమెకిదే తొలిసారి.

టీజర్‌లో ఇద్దరి మధ్యా గొడవ పడుతున్న సీన్ ఉంది కాని, దానితో వాళ్ల మధ్య కెమిస్ట్రీని అంచనా వేయలేం. సినిమాల్లో 60 ఏళ్లు దాటిన హీరోలు పాతికేళ్ల భామతో డాన్సులేయడం కొత్తేమీ కాదు. అందుకు రజనీకాంత్ పెద్ద ఉదాహరణ. ‘2.0’లో ఆయన అమీ జాక్సన్‌తో రొమాన్స్ చెయ్యడం చూశాం. అయితే జంటగా మెప్పించగలిగితేనే ఏ సినిమా అయినా ప్రేక్షకుల్ని అలరించగలుగుతుంది.

చూడ్డానికి ఆడ్‌గా కనిపిస్తున్నా, వెంకీ-తమన్నా జోడీ ఆసక్తి కలిగిస్తోంది. ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండితే, ‘ఎఫ్2’కు అది ప్లస్సవుతుంది, లేదంటే మైనస్‌గా మారి సినిమా విజయాన్ని నిర్దేశించే అవకాశమూ ఉంటుంది. వెంకీ-తమన్నా జంటగా మెప్పిస్తారా, లేదా తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.