Vinaya Vidheya Rama: ‘Thandaane’ Single – Melodious And Heart Touching
వినయ విధేయ రామ: ఆకట్టుకున్న ‘తందానె’ పాట
రాంచరణ్, బోయపాటి శ్రీను తొలి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి పోటీకి సై అంటున్న ఈ సినిమాలోని తొలి పాట లిరికల్ వీడియోను డిసెంబర్ 3న యూట్యూబ్లో ఆవిష్కరించారు. ‘తందానె తందానె తందానె తందానే.. చూశార ఏ చోటైన ఇంతానందాన్నే.. తందానె తందానె తందానె తందానే.. కన్నార ఎవరైన ప్రతి రోజూ పండగనే..’ ఆంటూ ఈ పాట సాగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కూర్చిన ఈ పాటను యువ గేయ రచయిత శ్రీమణి రాయగా, ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఆలపించాడు. ‘ఏ తియ్యదనం మనసుపడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే.. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే..’ అంటూ ఒక ఇంట్లోని మనుషులు ఎంత అందమైనవాళ్లో, ఎంత అందమైన హృదయమున్నవాళ్లో తెలియజేస్తాడు. ‘ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే.. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే.. ఎక్కడ పుట్టినవాళ్లో ఏ దిక్కున మొదలైనోళ్లో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా.. ఏ నింగిన గాలిపటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా..’ అనే పాదాల్ని బట్టి వాళ్లంతా ఒక కుటుంబలోని వాళ్లు కాదనీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి, కలిసి చాలా ఆనందంగా బతుకుతున్నారనీ తెలుస్తుంది. ‘ఈ ఇంటిలోనా ఇరుకుండదే ప్రతి మనసులోనా చోటుందిలే.. ఈ నడకకెపుడూ అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే.. విడివిడిగా వీళ్లు పదాలే.. ఒకటైన వాక్యమల్లే ఒక తియ్యటి అర్థం చెప్పారుగా.. విడివిడిగా వీళ్లు స్వరాలే.. కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా’ అనేపాదాలతో ఆ ఇంటిలోని వాళ్లంతా విశాల హృదయులనీ, వాళ్లకు అండగా ఒక వ్యక్తి ఉన్నాడనీ అర్థమవుతోంది. విడివిడి మనుషులైనా చక్కగా కలిసి ఒక్కటిగా జీవితానికి అర్థం చెబుతున్నారనే ధ్వని వినిపిస్తోంది. ఇది హీరో పాడిన పాటా లేక నేపథ్య గీతంగా వస్తుందా? అనే విషయం స్పష్టం కావడం లేదు. ఏదేమైనా ఇదొక కమ్మని పాట అనేది స్పష్టం. బోయపాటి శ్రీను శైలి తెలిసిందే కాబట్టి ఒక ఇంటిలోని వాళ్లను పరిచయం చెయ్యడానికి ఈ పాటను ఉపయోగించినట్లు అనిపిస్తోంది. దేవిశ్రీ బాణీల్లోని కమ్మదనానికి తగ్గట్లే శ్రీమణి చక్కని సాహిత్యాన్ని అందించిన ఈ గీతం తప్పకుండా ఆకట్టుకుంటుంది. విన్నకొద్దీ ఈ పాటలోని మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. రాంచరణ్ జోడీగా కియారా అద్వానీ నటించిన ఈ సినిమాలో ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రలు పోషించగా, వివేక్ ఓబరాయ్ విలన్గా కనిపించనున్నాడు.