Akhil Should Learn Acting From Jr NTR: Nagarjuna


తారక్ నుంచి అఖిల్ నటన నేర్చుకోవాలి: నాగార్జున

తారక్ నుంచి అఖిల్ నటనతో పాటు మాస్ నేర్చుకోవాలని అక్కినేని నాగార్జున సలహా ఇచ్చారు. అఖిల్ టైటిల్ రోల్‌లో వెంకీ అట్లూరి రూపొందించిన ‘మిస్టర్ మజ్ను’ ప్రి రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ “తారక్ మా పెద్దబ్బాయి. చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా ‘బాబాయ్.. బాబాయ్..’ అని పిలుస్తాడు. అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తారక్ నుంచి అఖిల్ నేర్చుకోవాల్సింది యాక్టింగ్ అండ్ మాస్. (అఖిల్‌ను ఉద్దేశించి) రేయ్.. మాస్ నేర్చుకోరా అక్కడ! బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్‌లో అఖిల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నిర్మాతగా ఇది 25వ సినిమా. ఇండస్ట్రీకి ఆయన రెండు బ్లాక్‌బస్టర్స్‌ను ఇచ్చారు.. ‘మగధీర’, ‘అత్తారింటికి దారేది’. అలాంటి ప్రొడక్షన్‌లో అఖిల్ వెళ్లడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నా. వెంకీ అట్లూరి తీసిన ‘తొలిప్రేమ’ చూశాను. లవ్ స్టోరీకి కావాల్సినవేంటో అతనికి బాగా తెలుసు. ఏడిపించడం, నవ్వించడం, ప్రేమించడం బాగా తెలుసు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. చాలా చాలా బాగున్నాయ్. (అభిమానులను ఉద్దేశించి) ఈ మజ్ను టైటిల్ ఎవరిది? ఆ టైటిల్ నాన్నగారిది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఆ రెండు మజ్నులు ఎంత పెద్ద హిట్టయ్యాయో అంత పెద్ద హిట్ ఈ మజ్ను అవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు. ‘మిస్టర్ మజ్ను’ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.