Ali Considering Political Career?


Ali Considering Political Career?

రాజకీయాల వైపు అలీ చూపు

స్టార్ కమెడియన్ అలీ సినీ కెరీర్ నుంచి పొలిటికల్ కెరీర్ వైపు చూపు సారిస్తున్నట్లు కనిపిస్తోంది. కామెడీ హీరోగానూ కొంత కాలం సక్సెస్ అయిన ఆయన ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు టీవీ షోల హోస్ట్‌గానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆలీతో సరదాగా’ అనే టీవీ షోను ఆయన నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాజకీయాల్లోనూ తన ముద్ర వేయాలని ఆయన తహతహలాడుతున్నారు. 2014 ఎన్నికల్లోనే ఆయన రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థిగా నిలుస్తారని అనుకున్నారు కానీ, అది జరగలేదు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అందులో భాగంగానే ఆయన ఇటీవల చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్.. ఇద్దరితోనూ సమావేశమయ్యారు.

మొదట్నుంచీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు పవన్ కల్యాణ్ ‘జనసేన’ కూడా బరిలో ఉండటంతో ఏ పార్టీలో చేరాలనే విషయంలో సందిగ్ధానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆయన పవన్ కల్యాణ్‌ను బాగా అభిమానిస్తారు. అందుకే ‘జనసేన’లో చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ఆయన తన స్వస్థలం రాజమండ్రి నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్యచౌదరి (టీడీపీ) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానం ఆయనకు పదిలమే. ఒకవేళ అలీ టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటే రాజమండ్రి సిటీ నియోజక వర్గం నుంచి చేయవచ్చు.

ప్రస్తుతం ఆ స్థానం నుంచి బీజీపేకి చెందిన ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదే జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటే ఈ రెండు నియోజక వర్గాల్లో దేన్నుంచైనా ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అలీ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో కొద్ది రోజుల్లో తెలియనున్నది.