Alia Bhatt Confirms RRR Deal?

అలియా ‘ఆర్ఆర్ఆర్’ డీల్ ఒప్పుకుందా?
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో హీరోయిన్లపై స్పెక్యులేషన్స్‌కు అంతూ దరీ ఉండట్లేదు. ఆ సినిమాలో హీరోయిన్గా ఫలానా తార ఎంపికయ్యే అవకాశం ఉందంటూ చిన్నా, పెద్దా తేడా లేకుండా అని మీడియాలూ కోడై కూస్తున్నాయి. కీర్తి సురేష్, కియారా అద్వానీ, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా.. ఇలా చాలా పేర్లు రంగం మీదికి వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ తార అలియా భట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజానికి అలియా పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది కాదు. గత నవంబర్ నుంచే ఆమె పేరు తెరపైకి వచ్చింది. తన మిత్రుడైన కరణ్ జోహార్ ద్వారా అలియాతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అలియా బాలీవుడ్ సినిమా ‘గల్లీబాయ్’ ప్రమోషన్లో బిజీగా ఉంది. అది విడుదలవగానే, ‘కళంక్’ సినిమా ప్రచారంలో పాల్గొనే అవకాశముంది. మరోవైపు రణబీర్ కపూర్ సరసన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తోంది. డిసెంబర్లో విడుదలయ్యే ఆ సినిమా కోసం పని చేయాల్సిన ఆమె ‘ఆర్ఆర్ఆర్’కు కాల్షీట్స్ ఇస్తుందా?.. అనేది సందేహం. అయితే ‘బాహుబలి’ సినిమాలతో రాజమౌళి బాలీవుడ్‌లోనూ అమితమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి అవకాశం రావడమే అదృష్టంగా చాలామంది తారలు భావిస్తుంటారు. అయితే మొదట్నుంచీ డైరెక్టర్ల కంటే సబ్జెక్టులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న అలియా ‘ఆర్ఆర్ఆర్’ కథ, అందులో తనకు ఆఫర్ చేస్తున్న కేరెక్టర్ నచ్చితేనే డీల్‌కు ఓకే చెప్పే అవకాశాలున్నాయి. లేదంటే ఈ సినిమాలో ఆమే చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఉత్త వదంతిగా మిగులుతుంది.