Amrita Rao Back On The Screen After Six Years

ఆరేళ్ల తర్వాత తెరపై అమృత!
తెలుగులో మహేశ్ జోడీగా ‘అతిథి’లో కనిపించి ఆకట్టుకున్న బాలీవుడ్ తార అమృతా రావ్ ఆరేళ్ల సుదీర్ఘ విరామంతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆ సినిమా ‘ఠాకరే’. జనవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రంలో ఆమె బాల్ ఠాకరే భార్య మీనా ఠాకరే పాత్రలో కనిపించనున్నది. ఠాకరేగా నవాజుద్దీన్ సిద్దిఖి నటించాడు. ఆ సినిమాలో నటించడం కంటే తనకు వేరే ఆప్షన్ లేకపోయిందని చెప్పింది అమృత. “నిర్మాత సంజయ్ రౌత్, డైరెక్టర్ అభిజిత్ పన్సే నాకు చాయిస్ ఇవ్వలేదు. వాళ్లు మరాఠీలో కథ చెప్పారు. మా సాహెబ్ (మీనా ఠాకరే)గా అప్పటికే నన్ను ఊహించుకున్నామని చెప్పారు. దాంతో ఓకే అని ఆ పాత్ర చేశాను” అని ఆమె తెలిపింది.
‘ఠాకరే’ చిత్రంలో ఆయన భార్య పాత్ర చేయడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నానని ఆమె చెప్పింది. “ఆ పాత్ర చేయడంతో నాకో ఇమేజ్ వచ్చింది. పెద్ద బేనర్ల నుంచి చాలా అవకాశాలు వస్తున్నాయి. పెద్ద సంస్థలు, పెద్ద హీరోలతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఎవరినైనా ఎట్రాక్ట్ చేస్తుంది. అయితే ఆన్-స్క్రీన్ డిమాండ్స్ మారుతుంటాయి. అందుకే నాకు సౌకర్యంగా అనిపించిన వాటినే ఎంచుకుంటాను” అని తెలిపింది ఈ ‘జాలీ ఎల్ఎల్బి’ గాళ్. “మా సాహెబ్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకొని, ఆమ నడవడిక తెలుసుకొని నా తరహాలో ఆ పాత్రను పోషించాను. ఒక నిజ జీవిత పాత్రను చేసేప్పుడు, ఆ పాత్రలో ఎమోషనల్గా కనెక్టయ్యేవాళ్లుంటారు. అది కల్పిత పాత్ర కాదు. అందువల్ల ఒక బాధ్యతతో దాన్ని పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆ పాత్రకు న్యాయం చెయ్యడానికి శాయశక్తులా కృషి చేశాను” అని ఆమె వివరించింది. చివరిసారిగా ఆమె ప్రకాశ్ ఝా సినిమా ‘సత్యాగ్రహ’ (2013)లో సుమిత్రా ఆనంద్ పాత్రలో కనిపించింది.