Ardhangi: Based On The Bengali Novel Swayam Siddha


Ardhangi: Based On The Bengali Novel Swayam Siddha

అర్ధాంగి: బెంగాలీ నవల ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన చిత్రం

ప్రసిద్ధ బెంగాలీ రచయిత మణిలాల్ బందోపాధాయ రచించిన ‘స్వయంసిద్ధ’ నవల ఆంధ సచిత్ర వార పత్రికలో 1953-54 మధ్యలో తెలుగులో ప్రచురితమైంది. దాని ఆధారంగా రూపొందిన చిత్రం ‘అర్ధాంగి’. 1955 జనవరి 26న విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను బాగా పొందింది. పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను సావిత్రి చేయగా, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య ప్రధాన పాత్రలు పోషించారు. భీమవరపు నరసింహారావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఆత్రేయ రాసిన ‘పెళ్లి ముహూర్తం కుదిరిందా పిల్లా’, ‘రాధను రమ్మన్నాడు’, ‘రాక రాక వచ్చావు చందమామా’, ‘సిగ్గేస్తాదోయ్ బావా సిగ్గేస్తాదీ’, ‘ఎక్కడమ్మా చంద్రుడూ’, ‘వద్దురా కన్నయ్యా’ పాటలు ఆ రోజుల్లో సంగీత ప్రియుల్ని అమితంగా అలరించాయి. గుమ్మడి, శాంతకుమారి, సురభి బాలసరస్వతి, కోడూరి అచ్చయ్య, డాక్టర్ శివరామ కృష్ణయ్య, వక్కలంక కామరాజు, గంగారత్నం, చదలవాడ కుటుంబరావు, నాగభూషణం, దొరస్వామి ఇతర పాత్రధారులు. ఇదే చిత్రం తమిళంలో రీమేక్ అవగా, అందులో సావిత్రి, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలు పోషించారు.

కథేమిటంటే…

జమీందారు (గుమ్మడి) వృద్ధుడు. అందరికీ మంచి చెప్పగలిగినవాడు. ఆయన రెండో భార్య రాజేశ్వరి (శాంతకుమారి)కి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండదు. ఎంతసేపూ కొడుకు నాగు (జగ్గయ్య)ను పాడుచెయ్యడమూ, భర్త మాటల్ని పెడచెవిని పెట్టడం తప్ప ఆమెకింకో పని తెలీదు. జమీందారు మొదటి భార్య కొడుకు రాఘవేంద్రరావు (అక్కినేని నాగేశ్వరరావు) మరీ అమాయకుడు. నాగు అచ్చుబోసిన ఆంబోతు. అన్న అమాయకుడైన కారణాన జమీందారీకి తనే వారసుడిగా వ్యవహరిస్తుంటాడు. అన్నను తరచూ కొడుతుంటాడు. రాఘవేంద్రరావు భార్యగా పద్మ (సావిత్రి) ఆ ఇంట్లో అడుగుపెడుతుంది. బాగా చదువుకున్న యువతి. ఆ ఇంట్లోని కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. అయితే నాగును ఎదిరించడం వల్ల రాజేశ్వరికి శత్రువవుతుంది. తన భర్తను మామూలు మనిషిని చేసి, నాగుకు దక్కుతుందనుకున్న జమీందారీని అతనికి దక్కే పరిస్థితి తీసుకొస్తుంది.

Ardhangi: Based On The Bengali Novel Swayam Siddha