Definitely Akhil Will Be One Of The Finest Actors: Jr NTR


అఖిల్ కంటే గొప్పగా ఎవరూ ఆత్మవిమర్శ చేసుకోరు: జూనియర్ ఎన్టీఆర్

“నేను చాలా తక్కువమందిలో చూసిన గొప్ప గుణం అఖిల్‌లో ఉంది. ఒక నటుడికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మ విమర్శ. నాకు తెలిసి అఖిల్ కంటే గొప్పగా ఎవరూ ఆత్మవిమర్శ చేసుకోరిక్కడ. ఆత్మవిమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. ఎన్నిసార్లు తను ఆత్మవిమర్శ చేసుకొని, తనని తాను మార్చుకుంటూ, తన పంథాని మార్చుకుంటూ ఈ రోజు ఈ మజిలీకి చేరాడు” అన్నారు జూనియర్ ఎన్టీఆర్.

అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’ ప్రి రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ “రాసిపెట్టుకోండి.. ఈ రోజు నేను చెప్తున్నాను. డెఫినెట్‌గా అఖిల్ విల్ బి ఒన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. నేను కూడా ఆరోజు కోసం ఎదురుచూస్తుంటాను. అది ఎంతో దూరంలో లేదు, దగ్గర్లోనే ఉంది. అది ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో మీక్కూడా తెలుస్తుంది. ఇది అఖిల్ కెరీర్‌లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నా” అని చెప్పారు.

“నేనిక్కడికి ఒక గెస్టులా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మంచి చిత్రాలు తియ్యాలంటే ఒక నిర్మాతకి కేవలం వ్యామోహం ఉంటే సరిపోదు, వ్యాపారం కూడా తెలియాలి అని నేను చాలా సార్లు అంటూ ఉంటాను. ఒక నిర్మాతకి ఆ రెండూ ఉండాలి. ఈ బేనర్‌లో నేను రెండు సినిమాలు చేశాను.. ‘ఊసరవెల్లి’, ‘నాన్నకు ప్రేమతో’. రిజల్ట్ పక్కనపెడ్తే ‘ఊసరవెల్లి’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ‘నాన్నకు ప్రేమతో’ నాకు బాగా దగ్గరైన సినిమా. ప్రసాద్ గారిలో నేను గమనించింది, ఆయనకు వ్యాపారం తెలీదు, వ్యామోహం మాత్రమే తెలుసు. సంపాదించే ప్రతి పైసాని తిరిగి చలనచిత్రసీమకే అందించే గొప్ప నిర్మాత. అలాంటి మంచి నిర్మాత పది కాలాల పాటు సుఖంగా ఉండాలి. ఆయన కెరీర్‌లో ‘మిస్టర్ మజ్ను’ సినిమా మరో మైలురాయి అవ్వాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నా.

నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్‌లో వెంకీ అట్లూరి ఒకడు. మొదట నటుడిగా నాకు పరిచయం. తర్వాత రచయితగా పరిచయమయ్యాడు. తర్వాత ఒక దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘తొలిప్రేమ’ అనే ప్రేమకథా చిత్రాన్ని తీశాడు. వెంకీ ఇప్పుడు చెప్తున్నా. అయాం ప్రౌడ్ ఆఫ్ యూ. ఫైట్లు, పాటలు మీద కాకుండా కథాబలంతో, కథనబలంతో, నటీనటుల బలంతో ఒక కథని తెరకెక్కించడం చాలా కష్టమైన పని. మొదటి చిత్రంతోనే తను సాధించాడు. అతను వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. తప్పకుండా ‘మిస్టర్ మజ్ను’ను ఒక ఫైనెస్ట్ ఫిలింగా తీసుంటాడు.

తమన్ చాలా ప్రతిభావంతుడు. ఇండస్ట్రీలోని వాళ్ల చుట్టూ ఒక వలయం వస్తుంది. పైకి వచ్చిన వాళ్లు కూడా అలా కిందికి వెళ్లక తప్పదు. అలా తను కిందికి వెళ్లినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నాకు తెలుసు అతనిలో ఎంత పొటెన్షియల్ ఉందో. అలా ‘తొలిప్రేమ’ వచ్చింది. ‘అరవింద సమేత’లో దగ్గర్నుంచి చూశాను. ఇప్పుడు అతని పనితనానికి నిదర్శనం ‘మిస్టర్ మజ్ను’ ఆడియో” అని అన్నారు తారక్.