Dil Raju Fires On ‘Peta’ Producer


Dil Raju Fires On 'Peta' Producer

‘పేట’ నిర్మాతకు గట్టి జవాబిచ్చిన దిల్ రాజు

రజనీకాంత్ ‘పేట’ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న అశోక్ వల్లభనేని తమని కుక్కలంటూ దూషించడం, షూట్ చెయ్యాలని మాట్లాడటంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. తమకో కేరక్టర్ ఉందనీ, ఆయనలా మాట్లాడలేమని అంటూ సంక్రాంతి సీజన్‌లో మూడు పెద్ద క్రీజీ సినిమాలు విడుదలవుతున్నప్పుడు, వాటికే థియేటర్లు అడ్జస్ట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు మధ్యలో పక్క రాష్ట్రం సినిమా తెచ్చి థియేటర్లు ఇవ్వమంటే ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తను నిర్మించిన ‘ఎఫ్2’ ప్రి రిలీజ్ వేడుకలో ఆయన దీనిపై మాట్లాడారు.

పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు

“తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది మాతో పాటు మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. నిన్న ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో వాళ్లు తొందరపడి స్టేట్‌మెంట్ ఇచ్చారో, లేదో నాకు తెలీదు. సంక్రాంతికి వస్తున్నట్లు ఈ మూడు సినిమాలు (యన్.టి.ఆర్: కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2) అనౌన్స్‌మెంట్ అయ్యాయి. ఇది అందరికీ తెలుసు.”

“ఆ మూడు పెద్ద తెలుగు సినిమాలకి ఎలా థియేటర్లు సెట్ చేసుకోవాలా అని నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. అలాంటి టైంలో ఒక 15 రోజుల క్రితమో, నెల రోజుల క్రితమో ఆ సినిమా (పేట)ను కొనుక్కొని వచ్చి, సంక్రాంతికి తెస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మూడు తెలుగు సినిమాలు ఉన్నప్పుడు, పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి?”

“ఆ ప్రొడ్యూసరే గత నాలుగు నెలల్లో మూడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. ‘నవాబ్’, ‘సర్కార్’, ఇప్పుడు ‘పేట’. ‘సర్కార్’ సినిమాకు ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకున్నారు. అప్పుడు అన్ని వేసుకున్నవాళ్లు ఇప్పుడు దొరకడం లేదని అనవసరమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం న్యాయమా? తెలుగు సినిమాలకి థియేటర్లు తగ్గించుకొని రిలీజ్ చెయ్యలేం కదా?”

“ఈ సీజన్‌లో మన తెలుగు సినిమాలకు కాకుండా వేరే సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. 18 నుంచి తమ సినిమా ఎక్కువ థియేటర్లలో పడుతుందని వాళ్లే అన్నారు. అలాంటప్పుడు 18నే తమ సినిమాని వేసుకోవచ్చు కదా! అప్పుడు రెండు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయి కదా! ఇది ఆలోచించకుండా అనవసర కాంట్రవర్సీ స్టేట్‌మెంట్లు ఇచ్చి, టంగ్ స్లిప్పయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. అలా మేమూ మాట్లాడగలుగుతాం. కానీ మాకో కేరక్టర్ ఉంది.”

“మేం చేస్తోంది వ్యాపారం. ఆయన కూడా డబ్బు సంపాదించుకోడానికే, వ్యాపారం చెయ్యడానికే సినిమాలు చేస్తున్నారు. మేం సినిమాలు తీసేది ప్రేక్షకుల నుంచి డబ్బులు తెచ్చుకోవాలనే. ఏడాదిలో డిస్ట్రిబ్యూషన్‌లో నా డబ్బులెన్నో పోయాయి. అయినా సినిమాపై ఉన్న ప్యాషన్‌తోనే డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడక్షన్‌లో కానీ ఇన్ని తెలుగు సినిమాలు తీస్తూ ఇక్కడ మేమున్నాం. ఆరునెల్ల క్రితం అనౌన్స్ అయిన తెలుగు సినిమాలకు థియేటర్లు ఉండాలా, వద్దా?”

“ఇక్కడ వస్తున్న మూడూ క్రేజీ సినిమాలే. ఇక్కడ రాంచరణ్ గారి సినిమా హయ్యెస్ట్ బడ్జెట్‌తో వస్తోంది. ఎన్టీఆర్ గారి బయోపిక్ ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్. మల్టీస్టారర్‌గా వస్తున్న ‘ఎఫ్2’ ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్. వీటికే థియేటర్లు అడ్జస్ట్ చేసుకోలేక కాంప్రమైజ్ అవుతూ, ఒక అండర్‌స్టాండింగ్‌తో వెళ్తున్నాయి. ఇది రైటా, రాంగా మీడియానే డిసైడ్ చెయ్యాలి.”

Dil Raju Fires On 'Peta' Producer

అంతకు ముందు జరిగిన ‘పేట’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత అశోక్ వల్లభనేని థియేటర్ లీజుదారుల్ని కుక్కలతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్ నాయీంను చంపినట్లు వాళ్లను షూట్ చెయ్యాలన్నారు. ఆయన ప్రసంగ పూర్తి పాఠం…

అశోక్ వల్లభనేని స్పీచ్

“నిజ జీవితంలో రజనీకాంత్ గారే నాకు స్ఫూర్తి. ఒక గొప్ప మనిషి, మహానుభావుడు. ఎన్నో సేవా కార్యక్రమాలు తమిళనాడులో చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆయన చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు చెయ్యాలని సంకల్పించాను. ఇప్పుడు సినిమా థియేటర్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. యు.వి. క్రియేషన్స్ వాళ్లు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు.. వీళ్లంతా థియేటర్లతోనే పుట్టినట్లుగా, థియేటర్లు ఇవ్వడానికి వీళ్లకేంటండీ నొప్పి?”

“ఒకే సినిమాని వందల థియేటర్లలో వేసేసి, మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు లేకుండా చెయ్యడం ఎంతవరకు భావ్యం? దీనికి ప్రభుత్వాలు ఏం చెయ్యాలి? వీళ్లు జనాల మీద రుద్దే సినిమాలే చూడాలా? మంచి సినిమా చూడకూడదా? దీనికి ప్రభుత్వాలు ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ చంద్రబాబునాయుడు గారు కానీ, ఇలాంటి కుక్కలకి బుద్ధి చెప్పి థియేటర్ మాఫియాని కడిగేయాలని కోరుతున్నా.”

“నయీంను చంపి, ఎంతో మందికి మేలు చేశారు కేసీఆర్ గారు. థియేటర్ మాఫియా ఉన్నవాళ్లను ఎందుకు షూట్ చెయ్యరు చెప్పండి? ఇవాళ మామూలు జనాలు వాళ్లకు నచ్చిన సినిమాలు చూసే అవకాశం లేకుండా వందలాది థియేటర్లలో ఒకే సినిమానేసి, చిన్న సినిమాల్ని చంపేస్తున్నారు. నా సినిమాకు థియేటర్లు ఎన్నో చెబితే.. ఎంత నీచంగా ఉందో పరిస్థితి. చెప్పుకోవాలంటే సిగ్గుచేటులా ఉంది.”