F2: Rajendra Prasad Factor


F2: Rajendra Prasad Factor

ఎఫ్2: తను ఏడుస్తూ ప్రేక్షకుల్ని నవ్వించాడు!

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశాజనక వసూళ్లతో ముందుకు పోతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కల్పించిన వాటిలో రాజేంద్రప్రసాద్ పాత్ర కూడా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తోంది. సెకండాఫ్‌లో తను ఏడుస్తూ ప్రేక్షకుల్ని నవ్వించాడు నవ్వుల రేడు. నిజానికి రాజేంద్రప్రసాద్ ఇమేజ్ పరంగా చూస్తే, అది ఆయన వెయ్యాల్సిన వేషంగా అనిపించదు. కానీ ఆ ఇమేజ్‌ను పక్కన పెట్టి మరీ ఆయన ఆ పాత్ర చేశాడు. భార్యా విధేయుడిగా కనిపిస్తూ, పక్కింటి వాళ్ల కాపురాల్లో చిచ్చుపెట్టేవాడిగా ఆయన ‘ఎఫ్2’లో దర్శనమిస్తాడు. ఆయన పద్ధతి చూసి విసిగిపోయిన వెంకీ, ఆయనక్ రెండో భార్యను మొదటి భార్య ముందు నిలబెడ్తాడు. దాంతో రాజేంద్రప్రసాద్ బిక్కచచ్చిపోతాడు. ఆయన ఇద్దరు భార్యలుగా ప్రేక్షకులకు పేర్లు కూడా తెలీని చిన్న తారలు చేశారు. రెండో భార్యగా చేసినామె ఒక టీవీ తార కావడం గమనార్హం.

ఇద్దరు భార్యల పోరు పడలేక హీరోలను కూడా రెచ్చగొట్టి సరదాగా గడిపొద్దామంటూ యూరప్ ట్రిప్‌కు తీసుకుపోతాడు రాజేంద్రప్రసాద్. అక్కడ ప్రకాశ్‌రాజ్ చెల్లెలు (హరితేజ)కు లైన్ వేస్తాడు. కథ రివర్స్ తిరిగి, తన మొగుడ్ని చంపితే ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చని ఆమె చెప్తుంది. హత్య అనేసరికి మనవాడికి గొంతులో పచ్చి వెలక్కాయపడుతుంది. వణుకు పుడుతుంది. హరితేజ ఊరుకోదు. తన మొగుడ్ని చంపమని పోరు పెడ్తుంటే, మనవాడు ఏడుపే ఏడుపు. ఒకసారి హరితేజ భర్తని మేడ మీంచి కిందికి తోసేసే ప్రయత్నంలో తనే కిందపడి చావుతప్పి లోట్ట పోయినంత పనవుతుంది. హరితేజ కాంబినేషన్‌లో రాజేంద్రప్రసాద్ కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు విరుస్తూనే ఉంటాయి. చివరకు “నన్నొదిలిపెట్టమ్మా” అని హరితేజను ఏడుస్తూ బతిమాలుకోవడం కూడా వినోదాన్ని పంచింది. తనలో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టే హాస్యనటుడు అలాగే ఉన్నాడని ఈ పాత్రతో మరోసారి నిరూపించాడు రాజేంద్రుడు.