F2: Srinivas Reddy The Hilarious Entertainer


F2: Srinivas Reddy The Hilarious Entertainer

ఎఫ్2: తెగ నవ్వించిన శ్రీనివాస్‌రెడ్డి

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి చిత్ర విచిత్ర పాత్రల్ని ప్రవేశపెట్టాడు. వాటిలో శ్రీనివాస్‌రెడ్డి పోషించిన పాత్ర ఒకటి. ప్రకాశ్‌రాజ్ ఇంట్లో పనివాడుగా శ్రీనివాస్‌రెడ్డి కనిపిస్తాడు. అతను చాలా అమాయకుడు. ఎంత అమాయకుడంటే ప్రకాశ్‌రాజ్ కాఫీ తెమ్మంటే తెచ్చి నిలబడతాడు. ఎంత సేపటికీ ప్రకాశ్‌రాజ్ కాఫీ తీసుకోకపోతే “అయ్యా.. కాఫీ” అంటాడు రెడ్డి. టీపాయ్ చూపించి “అక్కడ పెట్టి చావు” అంటాడు ప్రకాశ్. అక్కడ పెట్టి, ప్రకాశ్ అరుస్తున్నా వినిపించుకోకుండా పరుగెత్తుకుంటూ ఇంటిపైకి వెళ్లి కిందికి దూకేస్తాడు. అది చూసి రెడ్డి చనిపోయాడేమోనని వెంకీ, వరుణ్ ఆందోళన చెందుతుంటే, ప్రకాశ్ అతడ్ని నెమ్మదిగా లేవమంటాడు. రెడ్డి ‘నెమ్మదిగా’ స్లో మోషన్‌లో లేచి, “సారీ అయ్యా. నేను చావలేదు. ఇంకోసారి ట్రై చేస్తాను” అంటాడు.

ఇంకో సీన్లో వేడి వేడిగా కాఫీ తెమ్మని ప్రకాశ్ అంటే, చేతిలో పోసుకొని తెస్తాడు. “ఇదేంట్రా?” అనడిగితే, “వేడిగా తెచ్చానయ్యా.. కానీ ఇక్కడికొచ్చాక చల్లారిపొయ్యాయి. మళ్లీ తెస్తా” అని వెళ్తాడు. అంతటి అమాయకుడన్న మాట. ఆ పాత్రకు తనదైన శైలి నటనను జోడించి భలే రక్తి కట్టించాడు రెడ్డి. అతడు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల మొహాల్లో నవ్వులే నవ్వులు.