F2 Trailer Teases A Frustrating Ending


F2 Trailer Teases A Frustrating Ending

పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ‘ఎఫ్2’ ట్రైలర్

వెంకటేశ్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ జంటలుగా నటిస్తున్న ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల నిడివి ఉన్న ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపూ నవ్వకుండా ఉండలేం. పెళ్లి చేసుకున్నాక ఇద్దరు వ్యక్తులు పడ్డ తిప్పల్ని ఒక శాంపిల్‌గానే చూపించినా, సినిమా ఎలా ఉండబోతున్నదో, నిజంగా ఎంతగా నవ్వించనున్నదో అర్థమైపోతోంది.

పెళ్లి పీటలపై కూర్చున్న వెంకటేశ్‌తో పురోహితుడు “చివరిగా నవ్వుకొని తాళికట్టు నాయనా” అని తాళిబొట్టు ఇస్తుంటే, “ఆ!” అంటూ దేభ్యం మొహం వేసుకొని వెంకీ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌కి నవ్వాగదు.

వెంకటేశ్‌తో తమన్నా “సర్ఫ్ ఎక్సెల్ తెచ్చారా?” అనడిగితే, మర్చిపోయినట్లు “ఓ.. షిట్” అంటాడు. “మల్లెపూలు తెచ్చారా?” అని ఆమె అడిగితే, బ్యాగ్‌లోంచి మలీపూలు తీసి చూపిస్తూ, వాటిని వాసన చూస్తూ సరసంగా “ఊ” అంటాడు వెంకీ. ఆ తర్వాత మేకని పులి తరుముతున్నట్లు వాటి బొమ్మల నీడల్ని చూపిస్తూ ఆ ఇద్దరూ గొడవపడుతున్న బిట్స్‌ని చూపించారు. ఇక్కడ మేక వెంకీ అయితే, పులి తమన్నా అన్నమాట!

వెంకటేశ్‌తో అన్నపూర్ణ “అట్టా ఏడిపిచ్చకపోతే దాని కడుపున ఓ కాయ కాయించొచ్చుగా” అని చేతులు ఝాడించి విదిలిస్తుంది. దానికి వెంకీ “24 గంటలూ మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలెక్కడ కాస్తాయ్ నీ తలకాయ్” అని అంతే విసురుగా చేతులు ఝాడించి విదిలించి కొడతాడు. ట్రైలర్‌లోనే అంత నవ్వు తెప్పించిన ఈ సీన్ మొత్తాన్ని సినిమాలో చూసి ఎంత నవ్వుకుంటామో అనిపించక మానదు.

వరుణ్ “మజాక్ చేస్తున్నావా?” అని వెంకీని అడుగుతాడు. వెంకీ “మజాక్ చేయనీకి నువ్వు నా తోడల్లుడివా?” అంటాడు. “ఏమో.. కాలం కలిచొస్తే అయితానేమో” అంటాడు. సో.. ఇద్దరూ తోడల్లుళ్లు అవడం ఖాయం. తమన్నా, మెహ్రీన్ అక్కాచెల్లెళ్లన్నది ఖాయం.

ఒక షాట్‌లో తమన్నా, మెహ్రీన్.. ఇద్దరూ బికినీలు వేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరకొస్తుంటే, వాళ్లను చూసి వెంకీ దడుసుకొని వెనక్కి వరుణ్ చేతుల్లో విరుచుకుపడతున్నట్లు కనిపిస్తాడు.

ఒక బీచ్ దగ్గర “వెంకీ! చాలా ఇంపార్టెంట్ మేటర్ ఉంది. అదైనా వినండి” అని వేలు చూపిస్తుంది తమన్నా. వెంకీ గుండె దగ్గర రెండు చేతులూ పెట్టుకొని భయపడుతున్నట్లు “అమ్మో బ్రో.. ఉరికొచ్చేత్తుంది. ఏలు చూపిత్తుందిగా” అంటాడు వరుణ్‌తో. వరుణ్ “అమ్మో.. ‘భారతీయుడు’ సినిమాలో కమలహాసన్ లెక్క మెలితిప్పుద్దా ఏందీ” అంటాడు. తమన్నా అయోమయంగా వేలు చూసుకుంటుంది.

సో.. పెళ్లయ్యాక తోడల్లుళ్లు ఫ్రస్ట్రేషన్‌తో చేసే పనుల్లోంచి కావాల్సినంత ఫన్ వస్తుందనేది స్పష్టం. వాళ్లెంత ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యారో, మనకెంత ఫన్ అందించారో జనవరి 12న రుచి చూస్తాం.