Geetha Arts Registered Ghajini 2 Title


Geetha Arts Registered Ghajini 2 Title

త్వరలో ‘గజిని’ సీక్వెల్?

సూర్య, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గజిని’ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇదే సినిమా బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్ హీరోగా రీమేక్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించింది. హిందీలో మధు మంతెనతో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. ఆ సినిమా వచ్చి పదేళ్లు దాటింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తీసే పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్ సంస్థ ‘గజిని 2’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం. తెలుగు, హిందీ భాషలకు సంబంధించి ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

హిందీ వెర్షన్ సీక్వెల్‌లో ఆమిర్ ఖాన్ నటిస్తాడని వినిపిస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర పోషణ కోసం ఆయన ప్రత్యేక డైట్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. అమ్నీసియా (షార్ట్ టర్మ్ మెమరీ లాస్) వ్యాధితో బాధపడుతూ కూడా తన ప్రేయసిని చంపిన గజినిపై ప్రతీకారం తీర్చుకొనే యువకుడిగా తమిళంలో సూర్య, హిందీలో ఆమిర్‌ఖాన్ గొప్పగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. రెండు సినిమాల్నీ మురుగదాస్ రూపొందించడం గమనార్హం. ఇప్పుడు సీక్వెల్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. తెలుగు, హిందీల్లో వేర్వేరు హీరోలు చేస్తారా? లేక హిందీలో రూపొందించి తెలుగులో డబ్ చేస్తారా? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయమై స్పష్టత రావచ్చు.