How To Direct Balakrishna: 6 Voices

బాలకృష్ణను డైరెక్ట్ చేయడం ఎలా?: ఆరు గొంతుకలు
బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందు వస్తోంది. దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో పనిచేసిన ఆరుగురు దర్శకులు నటుడిగా ఆయన ఎలాంటివాడో, ఆయనను డైరెక్ట్ చెయ్యడం ఎలా అనిపించిందో ఆయా సందర్భాల్లో చెప్పిన సంగతులు…
దాసరి నారాయణరావు (పరమ వీర చక్ర):
‘పరమ వీర చక్ర’లో బాలకృష్ణను నేను చూడలేదు. ఒక స్టూడెంట్ను చూశాను. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ముందు ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడో అదే విధంగా ఒక ఒబీడియెంట్ స్టూడెంట్‌లా నాతో పనిచేశాడు. ఒక దర్శకుడికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఈ సినిమాతో ఒక మహానటుడ్ని ఆవిష్కరించామనే తృప్తి మాకుంది. ఠంచనుగా 7 గంటలకు మేకప్‌తో షూటింగ్‌కు రావడం అప్పుడు రామారావుగారిలో చూశాను, మళ్లీ ఇప్పుడు బాలకృష్ణలో చూశాను.
బోయపాటి శ్రీను (సింహా, లెజెండ్):
బాలకృష్ణ వంటి హీరోతో ఏ దర్శకుడైనా హిట్ సినిమానే చేయాలనుకుంటాడు. నేను అదే చేశాను. ఆయన ఒక పరిపూర్ణ నటుడు. ఆయన్ని ఎలా కావాలనుకుంటే అలా మలుచుకోవచ్చు. ఎన్ని రకాల పాత్రలు చేసినా ఆయనలో మరో కోణం మిగిలేవుంటుంది. ఆయన నటనలోని మరో యాంగిల్‌ను నేను ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల్లో చూపించాను.
శ్రీవాస్ (డిక్టేటర్):
సినిమా అంటే షూటింగ్లో డైరెక్టర్‌కు బాలకృష్ణగారు తన బాడీని ఇచ్చేస్తారు, ఏమైనా చేసుకోందన్నట్లు. అంత డెడికేషన్ ఉన్న హీరోని ఇప్పటివరకు నేను పనిచేసినవాళ్లలో చూడలేదు. ఏ డైరెక్టర్‌కైనా ఆయనను హ్యాండిల్ చెయ్యడం చాలా ఈజీ.
క్రిష్ (గౌతమిపుత్ర శాతకర్ణి):
బాలకృష్ణ హైపర్ యాక్టివ్ పర్సన్. క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో డూప్లతో చేయించడానికి, రోప్ వర్క్‌కు ఆయన అస్సలు ఒప్పుకోలేదు. అంత వర్క్ ఓరియెంటెడ్ పర్సన్ ఆయన్. ఆకలితో ఉన్న సింహంలా ఈ సినిమాలో నటించారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనేది 99 చిత్రాల నటనానుభవాన్ని తన వందవ చిత్రంలో ఆవిష్కరించిన ఒక మహానటుడి నటవిశ్వరూపం.
పూరి జగన్నాథ్ (పైసా వసూల్):
ఆయనతో కలిసి వర్క్ చేశాక, ఇంత దాకా ఆయనతో ఎందుకు వర్క్ చెయ్యలేదు, ఎందుకింత లేటయ్యిందని బాధపడ్డాను. ఆయన స్పీడూ, దూకుడూ చూస్తుంటే ఇది ఆయనకు 101 సినిమాలా కాకుండా ఒకటో సినిమాలా అనిపించింది. ఆయనతో వర్క్ చెయ్యడం అమేజింగ్. ఆయనది మామూలు ఎనర్జీ కాదు.
కె.ఎస్. రవికుమార్ (జై సింహా):
ఇప్పటి వరకు నేను 40 మంది వరకు టాప్ యాక్టర్లతో కలిసి పనిచేశాను. షూటింగ్ సమయాల్లో ఎన్నో సవాళ్లు, డిస్టర్బెన్సులు ఎదుర్కొన్నాను. బాలకృష్ణ, అజిత్ మాత్రమే షూటింగ్ మొత్తం నన్నే రకంగానూ డిస్టర్బ్ చెయ్యలేదు. బాలకృష్ణ లాంటి గొప్ప యాక్టర్‌తో కలిసి పనిచెయ్యడం గౌరవంగా భావిస్తాను. ఆయన టైంకి సెట్స్‌కి వస్తారు. పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు. ఆయన విజయ రహస్యం పనిపై ఆయన ఏకాగ్రతే.