‘Hrudaya Kaleyam’ Director Sent Legal Notice To Reputed Website

వెబ్‌సైట్‌కు ‘హృదయ కాలేయం’ దర్శకుడి లీగల్ నోటీస్
నిరాధార ఆరోపణలతో తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయి రాజేశ్ అలియాస్ స్టీవెన్ శంకర్ ఒక పేరుపొందిన వెబ్‌సైట్‌కు లీగల్ నోటీస్ పంపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆయన లీగల్ నోటీస్‌ను కూడా పోస్ట్ చేశారు. సాయిరాజేశ్ పేరు ప్రస్తావించకుండా ఒక హాలీవుడ్ డైరెక్టర్ పేరు స్ఫురించేలా స్క్రీన్ నేమ్ (స్టీవెన్ స్పీల్బర్గ్ను స్ఫురించేలా స్టీవెన్ శంకర్) పెట్టుకొన్న ఒక కామెడీ డైరెక్టర్ తన రెండో సినిమా (‘కొబ్బరిమట్ట’) కోసం ఐదుగురు ఎన్నారైల నుంచి సినిమాలో భాగస్వామ్యం ఇస్తానంటూ రూ. కోటి వసూలు చేశాడని ఆ పోర్టల్ ఆరోపించింది. అలాగే ఒక మెగా ప్రొడ్యూసర్ నుంచి రూ. 75 లక్షలు తీసుకున్నాడని అందులో తెలిపారు. అంతే కాదు, తన తొలి సినిమాలో నాయికగా పరిచయం చేసిన నటి నుంచి పెట్టుబడి కింద రూ. 20 లక్షలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయని కూడా ఆ సైట్ పేర్కొంది.


ఆ పోర్టల్ తనపై చేసిన ఆరోపణలను సాయిరాజేశ్ ఖండించారు. తనపై అవాస్తవాలతో రాసిన ఆ ఆర్టికల్‌ను వెంటనే తొలగించాలనీ, బేషరతుగా క్షమాపణలు తెలపాలనీ ఆయన డిమాండ్ చేశారు. రూ. 2 కోట్ల ను పరువు నష్టం కింద చెల్లించాలని లీగల్ నోటీస్ పంపారు. పదేళ్ల నుంచీ ఆ పోర్టల్ ప్రచురిస్తున్న నిరాధార వార్తల కారణంగా చాలామంది బాధలు పడుతూ వస్తున్నారనీ, కానీ ఈసారి తాను ఉపేక్షించదలచుకోలేదనీ ఆయన ట్వీట్ చేశారు. తెలుగు దర్శకుల సంఘం ఎదుట తాను చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష తర్వాతైనా సినీ పరిశ్రమ మేల్కొంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్విట్టర్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా తనను టార్గెట్ చేస్తున్న మరో నలుగురికి కూడా లీగల్ నోటీసులు పంపానని సాయిరాజేశ్ తెలిపారు.