Lakshmi’s NTR Look Came Out


Lakshmi's NTR Look Came Out

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపం ఇదే!

రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రూపం ఎలా ఉంటుందో వెల్లడైంది. ఆ సినిమాకు సంబంధించిన ఒక నిమిషం నిడివి వీడియోను వర్మ నేటి సాయంత్రం 6.57 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ పునర్జన్మదర్శనం’ అనే పేరు పెట్టారు. ఇందులో కేవలం ఎన్టీఆర్ పాత్రధారి మాత్రమే కనిపించారు. కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ నిట్టూర్పు వదిలిన ఎన్టీఆర్ కళ్లల్లో నీళ్లు తిరిగినట్లుగా వీడియోలో చిత్రీకరించారు వర్మ. ఎన్టీఆర్ పాత్రధారి ఎవరనేదీ తెలియడం లేదు. అయితే ఆయన ఎన్టీఆర్‌లా కనిపించకపోవడం గమనార్హం.

ఎన్టీఆర్ నిజ జీవితాన్ని, అందులోనూ ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడానికి దారి తీసిన పరిస్థితులనూ, లక్ష్మీపార్వతిని ఆయన వివాహం చేసుకున్న తర్వాత జరిగిన నిజ ఘటనలతోనూ ఈ సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ చెప్పారు. లక్ష్మీపార్వతి పాత్రను కన్నడ తార యజ్ఞాశెట్టి పోషించారు. “వెన్నుపోటు ద్వారా మరణించిన ఎన్టీఆర్ మరోసారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో జీవించడానికి వెనుతిరిగి వచ్చారు” అని వీడియో విడుదల సందర్భంగా ట్వీట్ చేశారు వర్మ. కల్యాణీ మాలిక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. జనవరి 24న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలవుతోంది.