Most Insane Scene In Vinaya Vidheya Rama


వినయ విధేయ రామ: పెద్ద పిచ్చి సన్నివేశం

రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలోని సన్నివేశాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా నడుస్తోంది. ఫలితంగా గుజరాత్ నుంచి బోర్డర్ దాకా చరణ్ ట్రైన్‌పై నిల్చొని ప్రయాణించే సన్నివేశాన్నీ, చరణ్ నరికిన తలల్ని రాబందులు ఎత్తుకెళ్లే సన్నివేశాన్నీ నిర్మాతలు తొలగించారు. విలన్ రాజాభాయ్ (వివేక్ ఓబరాయ్) నల్లత్రాచుతో కాటు వేయించుకుంటే అదే చచ్చిపోయే సన్నివేశంపై కూడా జోకులు బాగా పేలుతున్నాయి. అవే కాదు.. మరికొన్ని పిచ్చి సీన్లు కూడా సినిమాలో ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి (మహేశ్ మంజ్రేకర్)ని రాజాభాయ్ భయపెట్టే సీన్ వాటిలో ఒకటి.

అన్నింటికంటే పిచ్చి సీన్ అని చెప్పదగిన ఇంకోటుంది. అది బిహార్ ముఖ్యమంత్రి సెక్యూరిటీతో హైదరాబాద్ వచ్చి రామ (చరణ్)ను కలవడం. అదెంత హాస్యాస్పదం. బోయపాటి తలచుకుంటే ప్రొటోకాల్ లాంటివి కూడా చాప చుట్టేస్తాయ్. లాజిక్కులు పడుకుంటాయ్. తమ రాష్ట్రాన్ని రాజాభాయ్ నుంచి కాపాడమని అడగడానికి ఒక ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి వచ్చి ఒక మామూలు యువకుడిని అడగడం.. ఊహించుకోడానికే కష్టం. పైగా అతడు ఎక్కడో ఫైట్లు చేస్తుంటే తెలిసినవాడిగా, నేరుగా అక్కడికే రావడం! బిహార్ ముఖ్యమంత్రి వస్తే, ఇక్కడి ముఖ్యమంత్రికి తెలీకుండా జరుగుతుందా? అతడొచ్చిన కారణం తెలుసుకొని రామ మహిమాన్విత పరాక్రమం విని, అతడికి జేజేలు పలకకుండా ఉంటాడా? వీటిని చూపకుండా మిస్ చేశాడు డైరెక్టర్ బోయపాటి. పైగా బిహార్‌లో రామ పరాక్రమాన్ని అతని వదినకు ఆ సీఎమ్మే స్వయంగా చెప్తాడు, అంతకు మించిన భాగ్యం లేదన్నట్లు. ఇలాంటి ఊహాతీత సన్నివేశాల్ని ఎన్నింటినో ఒకే సినిమాలో కల్పించిన బోయపాటి ప్రతిభను ఏమని కొనియాడాలి!!