Mr Majnu: 3 Reasons To Be Excited


Mr Majnu: 3 Reasons To Be Excited

మిస్టర్ మజ్ను: ఆసక్తి కలిగిస్తున్న అంశాలు

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా వెంకీ అట్లూరి రూపొందించిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా జనవరి 25న విడుదలవుతోంది. ‘సవ్యసాచి’తో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ ఈ చిత్రంలో అఖిల్ సరసన కనిపించనున్నది. చాలామంది దృష్టి ఇప్పుడు ఈ సినిమాపై నిలుస్తోంది. కారణం.. ఇది అఖిల్‌కు మూడో సినిమా కావడం, ఇప్పటివరకు అతనికి హిట్టు లేకపోవడం. తొలి చిత్రం ‘అఖిల్’, మలి చిత్రం ‘హలో’.. రెండూ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఇది అఖిల్‌కూ, అతని తండ్రి నాగార్జునకూ ఊహాతీతమైన విషయం. స్ఫురద్రూపం, డాన్సుల్లో, ఫైట్స్‌లో ఈజ్, నటనలో పరిణతి చూపించినా విజయం లభించక పోవడానికి ఎంచుకున్న సబ్జెక్టులే కారణమని ఇద్దరికీ అర్థమైంది. ఆ రెండు సినిమాలూ సీనియర్ డైరెక్టర్ల నుంచి వచ్చినవే.

టైటిల్‌తో పాజిటివ్ వైబ్రేషన్స్

ఇప్పుడు అఖిల్ రూటు మార్చాడు. నటుడి నుంచి డైరెక్టర్‌గా మారి రూపొందించిన తొలి చిత్రం ‘తొలిప్రేమ’తో హిట్టు కొట్టిన వెంకీ అట్లూరిని దర్శకుడిగా ఎంచుకున్నాడు. వినోదాత్మక ప్రేమకథతో ఈ సినిమా చేశాడు. తాతకు, తండ్రికి పేరు తెచ్చిన ‘మజ్ను’ టైటిల్‌ను ఎంచుకున్నాడు. కొద్ది కాలం క్రితమే అదే టైటిల్‌తో నాని సినిమా వచ్చింది కాబట్టి ముందు ‘మిస్టర్’ను జోడించాడు. మరి ఆ టైటిల్ అఖిల్‌కు కలిసొస్తుందా?.. అనేది ఆసక్తికరం. చాలా మంది దర్శకులు తొలి సినిమాతో విజయాన్ని సాధించి, ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయారు. వెంకీ అట్లూరి ఆ విఘ్నాన్ని దాటగలుగుతాడా?.. అనేది మరో ఆసక్తికర అంశం.

మ్యూజిక్ బిగ్ ప్లస్

ఈ చిత్రానికి తమన్ సమకూర్చిన సంగీతం ఇప్పటికే జనం నోళ్లలో నానుతోంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్, ‘ఏమైనదో’, ‘నాలో నీకు’, ‘చిరు చిరు నవ్వుల’ పాటలు సంగీత ప్రియుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ పాటల్లో అఖిల్ డాన్సులు కూడా అలరిస్తున్నాయి. దాంతో ఈ సినిమా మ్యూజికల్ హిట్టయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

ఫ్రెష్ కాంబినేషన్

కాంబినేషన్ పరంగా చూసినప్పుడు చాలా ఫ్రెష్‌నెస్ కనిపిస్తోంది. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ క్రేజ్ ఉన్న తార కాదు. పైగా ‘సవ్యసాచి’ రూపంలో ఆమె ఖాతాలో ఫ్లాప్ ఉంది. ఫరా కరిమి కేరెక్టర్ చూస్తుంటే హీరోని సెడ్యూస్ చేసే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే బ్రెజిల్‌కు చెందిన మోడల్ ఇజాబెల్లా లీటే కేరెక్టర్ కథలో ఆసక్తికర మలుపుకు కారణమవుతుందని సమాచారం. వీళ్లంతా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీనివాళ్లు కాబట్టి ఆ ఫ్రెష్‌నెస్ సినిమాకు ఉపయోగపడుతుందని ఇటు అఖిల్, అటు వెంకీ నమ్ముతున్నారు. ఏదేమైనా మూడో సినిమాతోనైనా అఖిల్ విజయాన్ని అందుకుంటాడా, లేదా అని అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.