Mr.Majnu Review: 3 Ups And 5 Downs

మిస్టర్ మజ్ను రివ్యూ: మూడడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి
తారాగణం: అఖిల్, నిధి అగర్వాల్, ప్రియదర్శి, రావు రమేశ్, పవిత్రా లోకేశ్, నాగబాబు, సితార, జయప్రకాశ్, సుబ్బరాజు, సత్యకృష్ణ, హైపర్ ఆది
దర్శకుడు: వెంకీ అట్లూరి
విడుదల తేది: 25 జనవరి
రెండు ఫ్లాపుల తర్వాత కోటి ఆశలతో ఒక యువ దర్శకుడితో కలిసి పనిచేసి ‘మిస్టర్ మజ్ను’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. తాతకు, తండ్రికి పేరు తెచ్చిపెట్టిన టైటిల్ తనకూ ఉపకరిస్తుందని, ప్రేమలో పడిన ఒక లవర్ బాయ్ కథతో వచ్చాడు. తొలి సినిమా ‘తొలిప్రేమ’తో ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి అదే ఫార్మట్‌లో ‘మిస్టర్ మజ్ఞు’ను ప్రెజెంట్ చెయ్యాలని చూసిన ప్రయత్నం ఎలా ఉందో చూద్దాం…
కథ
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్) ఒక లవర్ బాయ్. లండన్‌లో చదువుకుంటూ ఉంటాడు. కాలేజీలో అందరమ్మాయిలకూ అతడే కావాలి. విక్కీ ఎవరినీ నిరాశపరచడు. కానీ ఎవరితోనూ దీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించడు. అక్కడే అతడికి నిక్కీ (నిధి అగర్వాల్) పరిచయమవుతుంది. అమ్మాయిలతో అతడి వ్యవహారం చూసి చికాకుపడుతుంది. అనుకోకుండా ఇద్దరూ ఒకే ఫ్లైట్‌లో ఇండియాకి వస్తారు. అప్పుడు తెలుస్తుంది.. నిక్కీ అన్నయ్యకూ, విక్కీ బాబాయి కొడుక్కీ (రాజా) పెళ్లి అనే విషయం. పెళ్లి సందర్భంలో అందర్నీ తన ప్రవర్తనతో ఇంప్రెస్ చేస్తాడు విక్కీ. మొదట అతడంటే అసహించుకున్న నిక్కీ ఎవరినీ నొప్పించకుండా ప్రతి సమస్యనీ ఈజీగా పరిష్కరించే విక్కీని దగ్గరగా గమనిస్తూ అతడితో ప్రేమలో పడుతుంది. ‘ఐ లవ్ యూ’ చెబుతుంది. కానీ పెళ్లితో ముగిసే ప్రేమ తనకు కష్టమంటాడు విక్కీ. రెండు నెలల్లో తను లండన్‌కు వెళ్లిపోతాననీ, అప్పటిదాకా తన ప్రేమను యాక్సెప్ట్ చెయ్యమనీ, అప్పటికీ తనపై ప్రేమ కలగకపోతే అతడి ఇష్టమనీ అంటుంది నిక్కీ. సరేనంటాడు విక్కీ. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఏమయ్యాయి? నిక్కీని విక్కీ ప్రేమించగలిగాడా?.. అనేది మిగతా కథ.
కథనం

ప్రతి కథకూ ఒక ఆశయం ఉంటుంది. ఈ కథ ఆశయం నిక్కీ ప్రేమను విక్కీ గెలుచుకోవడం. ప్రథమార్థం విక్కీ ప్రేమను గెలుచుకోడానికి నిక్కీ చేసిన ప్రయత్నాలు విఫలమయితే, ద్వితీయార్థమంతా నిక్కీ ప్రేమను తిరిగి పొందడానికి విక్కీ పడే పాట్లే కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపూ ఆ సన్నివేశాలన్నీ ఇదివరకే వేరే ఏదో ఒక సినిమాలో చూసిన అనుభూతే కలుగుతుంది. కథ కానీ, సన్నివేశాలు కానీ కొత్తగా అనిపించవు. నిక్కీకి దగ్గరవడానికి విక్కీ ప్రయత్నం చెయ్యడం, ప్రతిసారీ ఆమె అతడిని రిజెక్ట్ చేస్తూ రావడం చికాకు తెప్పిస్తాయి. ఆ సన్నివేశాలైనా గ్రిప్పింగ్‌గా ఉంటే ప్రేక్షకుడు విక్కీ పాత్రతో సహానుభూతి చెందేవాడు. నిక్కీని అతను బతిమిలాడే ధోరణిలోనే తన ప్రేమను యాక్సెప్ట్ చెయ్యమని వెంటపడుతుంటే ఆ పాత్రపై మనకు సానుభూతి కలగదు, ప్రేమ కలగదు. నిక్కీ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిగా ఎస్టాబ్లిష్ అయివుంటే, ఆమె కోసం విక్కీ వెంపర్లాడటం ఆ పాత్రపై సానుభూతి కలిగించేది. నిక్కీ కేరెక్టర్‌ను గొప్పగా ఏమీ డైరెక్టర్ ప్రొజెక్ట్ చెయ్యలేదు. క్లైమాక్స్ మరీ రొటీన్. అలాంటి ముగింపును కొన్ని వందల చిత్రాల్లో మనం చూసి ఉంటాం. హీరో/హీరోయిన్ వెళ్లిపోతుంటే హీరోయిన్/హీరో ఎయిర్‌పోర్టుకు లేదా రైల్వే స్టేషన్‌కూ పరిగెత్తుకుంటూ వెళ్లడం, చివరికి కలుసుకోవడం.. పరమ మూస.
ఫస్టాఫే బెటర్. కాస్త వినోదమైనా ప్రేక్షకుడికి దక్కుతుంది. అంతే కాదు.. ఒక బలమైన సన్నివేశం కూడా విక్కీ కేరెక్టర్‌ను ఉన్నతంగా నిలబెట్టింది. అది విక్కీ బాబాయ్ కూతురు, నిక్కీ అన్న పెళ్లి ఎపిసోడ్. పెళ్లి సమయానికి అప్పులవాడు (అజయ్) వచ్చి బాబాయ్ (రావు రమేశ్) పీకల మీద కూర్చొని, అప్పటికప్పుడు తన బాకీ సెటిల్ చెయ్యమంటే, దిక్కు తోచని స్థితిలో ఉన్న బాబాయికి అండగా నిలవడమే కాకుండా, అప్పటిదాకా తనను చదువులో వీకంటూ వెటకారం చేసిన ఆయన మనసు సైతం గెలుచుకుంటాడు. విక్కీ ఎంత మంచివాడో ఎస్టాబ్లిష్ చేసిన ఎపిసోడ్ అది. అది చూశాకే నిక్కీ అతడివైపు ఆకర్షితురాలవడం మొదలవుతుంది. కానీ ఆ తర్వాత కథనాన్ని ఆ స్థాయిలో దర్శకుడు కొనసాగించలేకపోయాడు. బలహీన కథనం, సన్నివేశాలతో నిరాసక్తంగా కథను నడిపాడు.

తారల అభినయం
మొదట లవర్ బాయ్‌గా, తర్వాత నిజాయితీ కలిగిన ప్రేమికుడిగా కనిపించే విక్కీ పాత్రలో అఖిల్ పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. ఫస్టాఫ్ బాగా ఆకట్టుకున్నాడు. లవర్ బాయ్‌గా అయితే మరింత ఈజ్‌ను కనపరిచాడు. చక్కని డిక్షన్‌తో డైలాగ్స్ చెప్పాడు. పెళ్లి ఎపిసోడ్లో మంచి అభినయం చూపాడు. తనపై నిక్కీ తొలిసారి ప్రేమను వ్యక్తం చేసినప్పుడు చక్కని హావభావాలు చూపించాడు. స్నేహితుడితో (ప్రియదర్శి) నిక్కీ గురించి చెపుతూ ఆమె వల్ల టార్చర్ పడుతున్నానని చెప్పిన సన్నివేశంలోనూ మెప్పించాడు. చివరలో నిక్కీ తనకు దక్కదని అనిపించినప్పుడు కలిగే బాధను ఉన్నత స్థాయిలో ప్రదర్శించాడు. ఇక ఫైట్లు, డాన్సులను సునాయాసంగా చేశాడు.
ప్రేమ కథాచిత్రాల్లో కథంతా నడిచేది ఇద్దరు ప్రేమికులపైనే. మిగతా పాత్రలు వాళ్ల కథను రసవత్తరంగా మార్చడానికి పనికొస్తాయి. ప్రేమికుల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌కు వేరే బలమైన పాత్ర ఏదీ సినిమాలో లేదు. ఇందులో ప్రేమికుల కథకు విలన్లు ఆ ప్రేమికులే. తొలి భాగంలో హీరోనే విలన్ అయితే, రెండో బాగంలో హీరోయినే విలన్ (క్లైమాక్స్ మినహా)! దాంతో సినిమా మొత్తం ఆ ఇద్దరి అభినయం మీదే ఆధారపడాల్సి వచ్చింది. అలాంటప్పుడు పాత్రధారులు ఉన్నత స్థాయి నటనను ప్రదర్శిస్తే తప్ప ఆ పాత్రలు పండవు. ఈ సినిమాలో దొర్లిన పెద్ద లోపం హీరోయిన్ ఎంపిక. నిక్కీ పాత్రను ఒక చక్కగా నటించగలిగే తారకు ఇచ్చినట్లయితే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. నిధి అగర్వాల్‌లో ఆ మ్యాజిక్ లేదు. నిక్కీ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లగలిగే అభినయ సామర్థ్యం కానీ, ఆ ఆకర్షణ కానీ కనిపించలేదు. క్లోజప్ షాట్లలో ఆమె మేకప్‌లోని లోపాలూ బహిర్గతమయ్యాయి. ఇదే దర్శకుడు తీసిన ‘తొలిప్రేమ’కు హీరోయిన్ రాశీ ఖన్నా ప్లస్సయితే, ‘మిస్టర్ మజ్ను’కు నిధి అగర్వాల్ మైనస్.
సినిమాలో కామెడీ కోసం ఉద్దేశించిన పాత్రలు రెండు.. ప్రియదర్శి, హైపర్ ఆది. విక్కీ స్నేహితుడైన ప్రియదర్శి ఫస్టాఫ్‌లో, లండన్‌లో విక్కీకి ఆశ్రయమిచ్చిన ఆది సెకండాఫ్‌లో వినోదాన్నివ్వడానికి యత్నించారు. అయితే బాగా నవ్వించడానికి తగిన సన్నివేశాల్ని దర్శకుడు వాళ్లకు ఇవ్వలేకపోయాడు. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో సూపర్ పాపులర్ అయిన ఆది ఇందులో సినిమాల్ని ఆన్లైన్లో పైరసీ చేసేవాడిగా కనిపిస్తాడు. పైరసీ చెయ్యడం తప్పనే ఒక సందేశాన్నివ్వడానికి ఆది పాత్రను ఉపయోగించారు కానీ పెద్దగా నవ్వించడానికి ఉపయోగించలేదు. ఇక ఫస్టాఫ్‌లో ప్రియదర్శి కంటే అఖిలే మనకు ఎక్కువ వినోదాన్నిస్తాడు. రావు రమేశ్, నాగబాబు, సుబ్బరాజు తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. విద్యుల్లేఖ, పవిత్రా లోకేశ్, సితార తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

సాంకేతిక అంశాలు
కొన్ని కొన్ని చోట్ల డైలాగ్స్ మెప్పించాయి, మెరుపులు మెరిపించాయి, ముందే చెప్పుకున్నట్లు సెకండాఫ్ స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. సినిమాలో బాగా ఆకట్టుకుంది తమన్ ఇచ్చిన రీ రికార్డింగ్. ఉన్నత స్థాయి పనితనాన్ని ప్రదర్శించాడు. సన్నివేశాల్లోని మూడ్ ఆ మాత్రమైనా కన్వే అయ్యిందంటే అది తమన్ సంగీతం వల్లే. పాటల్లో రెండు బాగున్నాయనిపించింది. జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ చాలావరకు బాగుంది, హీరోయిన్ను క్లోజప్‌లో చూపించినప్పుడు తప్ప. నవీన్ నూలి తన ఎడిటింగ్ కత్తెరకు మరింత పదునుపెట్టి ఉండాల్సింది.
చివరి మాట
అఖిల్ మూడో ప్రయత్నం కూడా ఆశించనట్లు లేదు. మనకు కావాల్సింది ఫస్టాఫ్‌లోని ఎనర్జీయే కానీ, సెకండాఫ్‌లోని పాసివ్నెస్ కాదు.