Mr Majnu Trailer Decoded: Akhil Character Analysed & Explored

‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్: అఖిల్వి అన్నీ షార్ట్ టర్మ్ లవ్వులే!
అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ చేయగా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ‘మిస్టర్ మజ్ను’ థియేట్రికల్ ట్రైలర్ ఆ సినిమా ప్రి రెలీజ్ ఈవెంట్ సందర్భంగా జనవరి 19న విడుదల చేశారు. 15 గంటల్లోనే ఆ ట్రైలర్‌కు 2.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషమే. ట్రైలర్లో ప్రధానంగా రెండు పాత్రలు మనకు కనిపిస్తాయి. విక్కీ (అఖిల్), నిక్కీ (నిధి అగర్వాల్). అయితే ఈ ట్రైలర్ ద్వారా విక్కీ కేరెక్టర్ తీరుతెన్నులు ఎలా ఉంటాయో మనకు తెలియజేశాడు దర్శకుడు. అతనికి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్పులంటే పడవనీ, అతనివన్నీ షార్ట్ టర్మ్ లవ్వులేననీ మనకు అర్థమవుతుంది. అయితే అదంతా నిక్కీ పరిచయం అయ్యేత వరకు. ఆ తర్వాత విక్కీ జీవితం మార్పుకు గురవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.

రెస్టారెంట్లో కాఫీ తాగుతూ ఫోన్ చూస్తుంటుంది నిక్కీ. ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక టేబుల్‌పై కూర్చొని అచ్చం ఆమెలాగే ఫోన్ చూస్తున్న విక్కీ ఆమె వంక చూస్తూ ముద్దు పెడుతున్నట్లు పోజిస్తాడు. కట్ చేస్తే ఇద్దరూ ఫ్లైట్‌లో పక్క పక్కనే కూర్చొని జర్నీ చేస్తుంటారు. నిక్కీ “చూడు విక్కీ.. నువ్వెంత ట్రై చేసినా నేను పడను” అంటుంది. విక్కీ చాలా క్యాజువల్‌గా “ఓకే.. థాంక్స్” అంటాడు. నిక్కీ ఆశ్చర్యపోతూ “ఎందుకు?” అనడుగుతుంది. విక్కీ “ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటాను” అంటాడు. అంతలోనే ఒకమ్మాయి వాళ్ల దగ్గరకు వచ్చి నిక్కీని ఏదో అడుగుతుంది. నిక్కీ వంక ‘చూడు’ అన్నట్లు కళ్లెగరేస్తాడు విక్కీ.
దానికి కొనసాగింపుగా అన్నట్లు ఇద్దరూ ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా నిక్కీ “అయినా ఎలా పడతారు వీళ్లు నీకు?” అనడుగుంది. విక్కీ “సింపుల్.. స్వీట్‌గా అబద్ధాలు చెప్తాను” అంటాడు జోవియల్‌గా. జ్యూయలరీ షాపులో నిక్కీ చెవి రింగు పెట్టుకుంటూ “అందరమ్మాయిలు అలా ఉండరు. అబ్బాయిల విషయంలో మాక్కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ మీట్ అయినప్పుడే పడతాం” అని చెప్తుంది.

బయట ఒక తెలీని ప్రదేశంలో నిక్కీ “ఐ లవ్ యూ విక్కీ” అని తన మనసులో మాట చెప్తుంది. విక్కీ తన ధోరణితో “నా లాంగెస్ట్ రిలేషన్‌షిప్పే ఒన్ మంత్” అంటాడు. నిక్కీ “అయితే టూ మంత్స్ ట్రై చేద్దాం” అంటుంది. బెంచీపై నిక్కీని పొదివి పట్టుకొని “ఇప్పుడు లవ్వంటే ముందు కొంచెం లవ్ చేసుకొని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ లవ్ చేసుకొని, లాస్ట్‌లో పెళ్లి చేసుకుంటారు.. ఆ టైపు లవ్వా?” అనడుగుతాడు. నిక్కీ తలాడిస్తూ “యా..” అంటుంది. వెంటనే ఆమె తలని భుజం మీంచి తీసేసి, కూర్చున్నవాడల్లా లేచి రెండడుగులు అవతలకి వేసి “చచ్చాం. నాకలా లవ్ చెయ్యడం చేతకాదు నిక్కీ” అంటాడు విక్కీ.
కథ ప్రకారం నిక్కీ ఇంటికి వెళ్తాడు విక్కీ. అతడి చేయిపట్టుకొని “రా..” అంటూ నిక్కీ లోపలికి తీసుకుపోతుంటే.. విక్కీ “ఏయ్.. ఎవరైనా చూస్తే..?” అనడుగుతాడు. నిక్కీ “ఇంట్లో ఎవరూ లేరు.. రా..” అని లాక్కుపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇంటెరెస్టింగ్. పార్కింగ్ ప్లేస్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విక్కీ అసలు వ్యక్తిత్వాన్ని పట్టిస్తుంది. విక్కీ “నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ నా వల్ల ఒక్కళ్లు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పవుతుంది” అంటాడు. అయితే షార్ట్ టర్మ్ రిలేషన్లో అవతలి వాళ్లు బాధపడకుండా ఎలా ఉంటారు? అనేది ప్రశ్న. అందుకు తగ్గట్లే నిక్కీ ఇంకో సందర్భంలో “నేనీరోజు ఏడుస్తున్నాను విక్కీ. అది నీ కోసమో, నీ వల్లనో తెలీట్లేదు” అంటుంది.
విక్కీలో మార్పు వచ్చిందా? తనపై నిక్కీ ప్రేమలోని గాఢతను అర్థం చేసుకోగలిగాడా? ఆమెతో లైఫ్ టైం లవ్వుకు సిద్ధపడ్డాడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది జనవరి 25న మన ముందుకు వస్తున్న సినిమాయే.