Nag Is Going To Act As Bangarraju

‘బంగార్రాజు’కు నాగ్ గ్రీన్ సిగ్నల్
కల్యాణ్‌కృష్ణ కురసాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పట్నుంచి ఆ ఇద్దరి కాంబినేషన్లో ఆ సినిమా సీక్వెల్ వస్తుందనీ, దానిపేరు ‘బంగార్రాజు’ అనీ వినిపిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు ఆ ప్రచారం నిజం కాబోతోంది. ఇప్పటికే ‘బంగార్రాజు’ టైటిల్‌ను నాగార్జున రిజిస్టర్ చేయించారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగ్ చేసిన ఒక పాత్ర పేరు బంగార్రాజు అనే విషయం తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ చెప్పిన ఫైనల్ స్టోరీకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. గతంలోనే నాగ్‌కు కల్యాణ్ కథ వినిపించినా, ఆయన సంతృప్తి చెందలేదు. మరింత బాగా స్టోరీని మలచాలని కల్యాణ్‌కు సూచించారు. ఇప్పుడు తన కథతో నాగ్‌ను కల్యాణ్ ఇంప్రెస్ చేశాడు.
ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించనున్నాడు. ఇదివరకు ఆ ఇద్దరూ ‘మనం’లో కలిసి నటించారు. ‘బంగార్రాజు’లో చైతూ కేరెక్టర్ నాగ్ కేరెక్టర్‌కు సమాన స్థాయిలో ఉంటుందని సమాచారం. 2018లో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో నాగ్ చేసిన ‘ఆఫీసర్’ ఆయన కెరీర్లో అత్యంత చెత్త సినిమాగా అపకీర్తిని మూటగట్టుకుంది. ఆ షాక్ నుంచి నాగ్ అంత త్వరగా బయటపడలేక పోయారు. అందుకే సబ్జెక్ట్ విషయంలో ఆయన మరింత శ్రద్ధ చూపిస్తున్నారు. త్వరలోనే ‘బంగార్రాజు’ నిర్మాణ పనులు మొదలవనున్నాయి.