NTR Kathanayakudu: Sumanth At His Best


NTR Kathanayakudu still

యన్.టి.ఆర్ కథానాయకుడు: తాత పాత్రలో ఒదిగిన మనవడు

అక్కినేని నాగేశ్వరరావు పొట్టి. సుమంత్ పొడుగు. అయినా తాత పాత్రను చేయడానికి ఒప్పుకొని అందులో ఒదిగిపోయాడు సుమంత్. చిన్నతనం నుంచి తాతగారి దగ్గరే పెరగడం వల్ల ఆయన మాట తీరు, ఆయన నడక, ఆయన నడత అన్నీ సుమంత్‌కు తెలుసు. అందుకే ఆ పాత్రలోకి వెళ్లగలిగాడు సుమంత్.

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’లో మిగతా నటుల కంటే ఏఎన్నార్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు దర్శకుడు క్రిష్. చిత్రసీమలో ఆ ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారంటూ చూపించాడు. వాస్తవంగా ఎన్టీఆర్ రూపం ఏఎన్నార్ కంటే ఒడ్డూ పొడుగూ ఎక్కువ. ఎన్టీఆర్‌ది బలిష్ఠమైన దేహం. ఆయన ముందు ఏఎన్నార్ చిన్నవాడిలా కనిపించేవారు.

కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా ఆరడుగుల ఎత్తులో ఏఎన్నార్ కనిపిస్తుంటే ఆయన కంటే పొట్టిగా ఎన్టీఆర్ కనిపించారు. అయినా కూడా ఏఎన్నార్ పాత్ర పండింది. ఏఎన్నార్‌లోని నెమ్మదితనం, సున్నితత్వాన్ని బాగా పట్టుకున్న సుమంత్ ఆయనలా ప్రవర్తించగలిగాడు.

ఇప్పటివరకూ ఈ తరహా హావభావాలను పలికించే అవసరం కానీ, అవకాశం కానీ ఆయనకు రాలేదు. ఇంత మెచ్యూర్డ్ కేరక్టర్ కూడా ఆయనెప్పుడూ చెయ్యలేదు. ఇప్పుడు దొరికిన అవకాశాన్ని రెండు చేతులా ఆహ్వానించి వహ్వా అనిపించేలా చేశాడు.

సుమంత్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. ఆయన సన్నివేశాలన్నీ దాదాపుగా బాలకృష్ణ కాంబినేషన్‌తోనే ఉన్నాయి. అయినా బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా నటనను ప్రదర్శించాడు సుమంత్. తాత పాత్రకు న్యాయం చేశాడు.