Padi Padi Leche Manasu: The Brilliant Earthquake Episode Gone Wasted


Padi Padi Leche Manasu: The Brilliant Earthquake Episode Gone Wasted

పడి పడి లేచే మనసు: వృథా అయిన భూకంప ఎపిసోడ్

కొన్నేసి సార్లు అంతే. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ప్రేక్షకుల దరికి చేరదు. కొన్నేసి సార్లు అంతే. ఆడుతూ పాడుతూ సునాయాసంగా తీసిన సినిమా బాక్సాఫీసును కుమ్మేస్తుంది. ‘పడి పడి లేచే మనసు’.. ఒక క్రేజీ ప్రాజెక్టు. శర్వానంద్, సాయిపల్లవి జోడీ అనేసరికి ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి! పైగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేం హను రాఘవపూడి డైరెక్టర్. సినిమా వసూళ్ల వర్షం కురుస్తుందని ఎంతగానో ఆశించారు. వచ్చిన ఫలితం భిన్నం. ఆ సినిమా కోసం నిర్మాత బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సన్నివేశం రిచ్‌గా కనిపించాలని ప్రయత్నించారు. అందులో భాగంగా నేపాల్ రాజధాని ఖాడ్మండులో ఒక భూకంపం ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. దాని కోసం చాలా చాలా కష్టపడ్డారు. కథలో ఆ భూకంపం ఎపిసోడ్ చాలా కీలకం.

ఏడాది తర్వాత హీరో హీరోయిన్లు కలుసుకోవాలనుకున్న ప్రదేశంలో, వారు కలుసుకోవాలనుకున్న సమయంలోనే భూకంపం వస్తుంది. ఇద్దరూ వస్తారు. ఒకరి కోసం ఒకరు వెతుకుతూ ఉంటారు. కానీ ఒకర్నొకరు కలుసుకొనేలోపు భూమి బద్దలవుతుంది. భవనాలు కూలుతాయి. వాటి శిథిలాల కింద చిక్కుకొని జనం ఆర్తనాదాలు. ఎవరు చనిపోయారో, ఎవరు గాయపడ్డారో తెలీని గందరగోళం. శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డ వాళ్లను సూర్య, వైశాలి వేర్వేరు చోట్ల కాపాడే ప్రయత్నం చేస్తారు. అలాంటి దారుణ స్థితిలో అక్కడికి సూర్య రాకుండా ఉంటే బాగుండునని వైశాలి, ఆమె రాకుండా ఉంటే బాగుండునని సూర్య అనుకుంటారు. ఒకరినొకరు పిలుచుకుంటూ వెతుకుతారు. ఫలితం కనిపించదు. మళ్లీ భూమి కంపిస్తుంది. భూమి చీలిపోతుంది. భవనాలు నేలమట్టమవుతాయి. సూర్య ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. హీరోయిన్ వైశాలి గాయపడుతుంది. ఆ విషయం తెలిసి ఆమె తండ్రి ఆఘమేఘాల మీద కోల్‌కతా నుంచి వచ్చి కూతుర్ని తీసుకుపోతాడు. ప్రేమికులు కలుసుకోలేకపోతారు.

ఆ భూకంప సన్నివేశాల్ని, భవనాలు కూలి వాటి శిథిలాల కింద జనం చిక్కుకున్న సన్నివేశాల్ని చాలా కష్టపడి తీశాడు దర్శకుడు. ఎన్నో వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఆ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్ హృదయాల్ని పిండేస్తుంది. కళ్లు తడవుతాయి. కానీ ఏం లాభం. సెకండాఫ్ స్క్రీన్‌ప్లే అంతా కలగాపులగం అయిపోవడంతో, కథనం తికమక పెట్టేయడంతో జనం సినిమాని నిరాదరించారు. దాంతో అంత శ్రమపడి, ఎన్నో రోజులు కష్టపడి, డబ్బు ధారాళంగా వెచ్చించి గొప్పగా తీసిన ఆ సన్నివేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. దర్శక నిర్మాతల ప్రయాస వృథా అయ్యింది. వాళ్లకు తీవ్ర నిరాశ మిగిలింది.

Padi Padi Leche Manasu: The Brilliant Earthquake Episode Gone Wasted