Peta (Petta) Review: 4 Ups And 5 Downs


Peta (Petta) Review: 4 Ups And 5 Downs

‘పేట’ రివ్యూ: 4 అడుగులు ముందుకి, 5 అడుగులు వెనక్కి

తారాగణం: రజనీకాంత్, విజయ్ సేతుపతి, నవాజుద్దీజ్ సిద్దిఖి, సిమ్రాన్, త్రిష, బాబీ సింహా, సనత్‌రెడ్డి
దర్శకుడు: కార్తీక్ సుబ్బరాజ్
విడుదల తేది: 10 జనవరి 2019

కొంతకాలంగా రజనీ సినిమాలను చూస్తుంటే వాటిలో సమాజానికి పనికొచ్చే ఏదో ఒక అంశం ఉంటూ ఉంటోంది. అలాంటిదేమీ లేకుండా ఫక్తు మాస్ యాక్షన్ సినిమా రజనీ నుంచి వస్తే ఎలా ఉంటుంది? ‘పేట’ సరిగ్గా అలాంటి సినిమాయే. పగ, ప్రతీకారాలతో కూడిన హింసాత్మక చిత్రం ‘పేట’. ఎప్పటిలా తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

కథ

ఒక కాలేజీ హాస్టల్‌కు వార్డెన్‌గా వస్తాడు కాళీ (రజనీకాంత్). జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్న సీనియర్ల తాటతీస్తాడు. హాస్టల్‌తో సంబంధం లేకపోయినా జులుం చేస్తున్న సీనియర్ స్టూడెంట్, రౌడీ కొడుకు మైఖేల్ (బాబీ సింహా)కు బుద్ధి చెబుతాడు. కాలేజీలో ప్రేమికులైన యువజంటకు అండగా నిలుస్తాడు. ఆ జంటలోని అన్వర్‌పై జరిగిన హత్యాయత్నాన్ని నిలువరిస్తాడు. అప్పుడే కాళి గతం బయటకు వస్తుంది.

అతడి అసలుపేరు పేట వీర అలియాస్ పేట అని తెలుస్తుంది. రజని అనుచరుడు మాలిక్ (శశికుమార్) ప్రత్యర్థి వర్గానికి చెందిన పూర్ణను ప్రేమిస్తే, ఆ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాడు పేట. కన్నతండ్రినే చంపి చెల్లెలినీ, మాలిక్‌నూ చంపేస్తానని చిందులేస్తున్న దేవరాజ్‌ను కాల్చి చంపుతాడు పేట. దేవరాజ్ తమ్ముడు సింహాచలం (నవాజుద్దీన్) ఉత్తరప్రదేశ్‌కు పారిపోతాడు. అతడు ఊరికే ఉన్నాడా?

పేట వర్గం ఏమయ్యింది? అన్వర్ ఎవరు? అతడిపై హత్యాయత్నం ఎవరు చేశారు? సింహాచలం కొడుకు జిత్తు (విజయ్ సేతుపతి) రంగంలోకి వచ్చి ఏం చేశాడు? చివరకు ఎవరు హతమయ్యారు? ఎవరు మిగిలారు?.. అనేది మిగతా కథ.

Peta (Petta) Review: 4 Ups And 5 Downs

కథనం

రజనీకాంత్ కెరీర్‌లో ‘బాషా’ సినిమాకు ఉన్న ప్రతేకత తెలిసిందే. ఆ సినిమా ఫార్మట్‌లో ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించాయి. ఇప్పుడు అదే ఫార్మట్‌లో కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’ కథను నడిపించాడు. ‘పేట’ అంటే తెలుగులో ఒక ఏరియా అని. ఆ పేరుతో మనిషిని పిలవడం ఉండదు. అదే కాస్త ఇబ్బందిపెట్టే విషయం.

ఇందులోని మాలిక్, అన్వర్ అనే పేర్లున్న కేరక్టర్లు ‘బాషా’ సినిమాలోనూ మనకు కనిపిస్తాయి. రజనీని ఆయన అభిమానులు ఎలాంటి పాత్రలో కోరుకుంటారో సరిగ్గా అలాగే ఆయన పాత్రను, కథను డిజైన్ చేసి తీశాడు కార్తీక్. పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా రజనీని చూపించాడు. అయితే ఈ క్రమంలో హింస మోతాదు మించింది. తర్వాత సీన్‌లో ఎలాంటి ఉత్పాతం జరుగుతుందోననే టెన్షన్‌ను క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు.

అన్వర్ ప్రేమించిన మేఘా ఆకాశ్ తల్లి మంగళ (సిమ్రాన్) పాత్రను ఫస్టాఫ్‌కే పరిమితం చేసి నిరుత్సాహపరిచాడు. మంగళ, కాళి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే మంగళ పాత్రను అర్థంతరంగా ఆపేయడం బాలేదు. అదివరకే భార్యనీ, కొడుకునీ పోగొట్టుకున్న కాళి అలియాస్ పేట.. ఆమెతో రొమాంటిక్‌గా వ్యవహరించడం అంతుబట్టని విషయం. కేవలం అభిమానుల్ని అలరించడం కోసమే అలాంటి సీన్లు కల్పించాడు దర్శకుడు.

మనుషుల్ని చంపడంపై పేటకు అనురక్తి ఉన్నట్లు కనిపించడం కూడా మంచిగా అనిపించదు. అందర్నీ చంపేస్తానంటూ పదిమంది మధ్యా నోటికొచ్చినట్లు వాగుతున్న దేవరాజ్‌ను అతని చెల్లెలి అంగీకారం తీసుకొని, అంతమంది మధ్యా గన్‌తో పేట కాల్చివెయ్యడం గగుర్పాటు కలిగించే విషయం. అప్పుడక్కడ చిన్నా పెద్దా అందరూ ఉంటారు. ఆ హత్య దేన్ని సూచిస్తుంది?

క్లైమాక్స్ సన్నివేశంలోనూ అదే రకమైన యాటిట్యూడ్‌ను చూపిస్తాడు పేట. సింహాచలంను, అతని గ్యాంగ్‌ను మట్టుపెట్టే క్రమంలో పేట జరిపే హత్యాకాండ కూడా అలాగే ఉంటుంది. విలన్ కొడుకును తన కొడుకుగా భ్రమింపజేసి, అతని ద్వారానే విలన్‌ను చంపించడం రజనీ వంటి హీరోకి తగిన విషయమేనా? జిత్తు (విజయ్ సేతుపతి) పాత్రను అలా మోసం చేసి, తన పగ తీర్చుకుంటాడు పేట.

చివరకు వాలి, సుగ్రీవుల కథ చెప్పి, వాలిని రాముడు దొంగచాటుగా ఎందుకు చంపాడో చెప్పి, అది రాముడు చూపించిన యుద్ధతంత్రంగా పేర్కొని, అప్పుడు జిత్తు తండ్రి సింహాచలమే అనే విషయం చెప్తాడు. మోసపోయిన జిత్తు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటే, అతనికి పేట రివాల్వర్ గురిపెట్టడం అస్సలు ఏమీ బాలేదు. రజనీతో ఇలాంటి బ్యాడ్ గేం ఆడించడం ఇంకా బాలేదు.

Peta (Petta) Review: 4 Ups And 5 Downs

పాత్రధారుల అభినయం

కాళి అలియాస్ పేట పాత్రలో రజనీకాంత్ చెలరేగి నటించారు. ‘కబాలి’, ‘కాలా’ సినిమాలకంటే మరింత ఎనర్జీతో ఆయన కనిపించారు. హాస్టల్‌లో రౌడీ గ్యాంగ్ కోసం ఎదురుచూస్తూ ఆయన చేసే నుంచాక్ విన్యాసాలు అలరించాయి. టిపికల్ రజనీ విన్యాసాలను ఇంత కాలం మిస్సయ్యామనుకుంటున్న వాళ్లు ఇందులో అలాంటివి చూడవచ్చు. రజనీ సిగరెట్ తాగే స్టైల్‌నూ చూడవచ్చు. కాకపోతే సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే నినాదాన్ని ఇచ్చారు రజనీ. త్రిషతో కంటే సిమ్రాన్‌తోటే ఆయన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

సింహాచలంగా నవాజుద్దీన్ సిద్దిఖి బ్రహ్మాండంగా రాణించాడు. తన అన్నను చంపిన పేటపై పగ తీర్చుకొనే వ్యక్తిగా తన ముద్రను వేశాడు. అతని కొడుకు జిత్తుగా విజయ్ సేతుపతి ఆశ్చర్యకరమైన పాత్ర చేశాడు. ఆ పాత్ర ద్వారా దేశభక్తి పేరిట కొన్ని సంస్థలు చేసే నిర్వాకాన్ని దర్శకుడు బయటపెట్టాడు. అయితే సేతుపతి ఆకారమే బాలేదు. బాగా పొట్టపెరిగి, చాలా లావుగా కనిపించాడు.

త్రిష, సిమ్రాన్ చేసినవి ప్రత్యేక పాత్రల లాంటివి. పరిధుల మేరకు చేశారు. అన్వర్ పాత్రలో సనత్‌రెడ్డి చక్కగా చేశాడు. అతని ప్రియురాలిగా మేఘా ఆకాష్ పాత్ర కూడా ప్రథమార్థానికే పరిమితమైంది. మాలిక్‌గా శశికుమార్, మైఖేల్‌గా బాబీ సింహా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు

సాంకేతికంగా ‘పేట’ చాలా నాణ్యంగా ఉంది. తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ కానీ, సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్ కానీ బాగున్నాయి. అయితే అన్నింటికంటే రెండు అంశాలు మరింత ఆకట్టుకున్నాయి. ఒకటి అనిరుధ్ నేపథ్య సంగీతం, పీటర్ హెయిన్స్ కూర్చిన ఫైట్లు. యాక్షన్ ప్రియుల్ని రజనీ చేసిన ఫైట్లు అలరిస్తాయి. సన్నివేశాలకు అనిరుధ్ మ్యూజిక్ మంచి టెంపోనిచ్చింది. పాటలే తెలుగులో ఏమాత్రం వినసొంపుగా లేవు. సాహిత్యం పక్కా డబ్బింగ్ సినిమా మాదిరే ఉంది.

చివరి మాట

పక్కా మాస్ యాక్షన్ హీరోగా, యాంగ్రీమ్యాన్‌గా రజనీని చూడాలనుకొనేవాళ్లకు కన్నుల పండుగ ఈ సినిమా. అభిరుచి కలిగిన ప్రేక్షకులకు మాత్రం కథాంశం కానీ, రజనీ పాత్ర తీరు కానీ వంటపట్టదు.

  • బుద్ధి యజ్ఞమూర్తి