Peta: Simran’s Role Is Just Bigger Than A Guest Appearance


Peta: Simran's Role Is Just Bigger Than Guest Appearance

పేట: సిమ్రాన్ పాత్ర అంతేనా?

రజనీకాంత్ సరసన ‘పేట’లో తొలిసారి కలిసి నటించారు సిమ్రాన్. ఆయనతో జంటగా ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి మురిసిపోయారు. ఆమె సంబరం చూస్తే, సినిమాలో ఆమె పాత్ర కీలకమైందని ఎవరైనా అనుకుంటారు. రజనీ ప్రియురాలిగానో, భార్యగానో ఆమె కనిపిస్తారని ఊహిస్తారు.

కానీ సినిమా చూస్తే.. ఆమె పాత్ర సినిమా మొత్తంపై కనిపించేది పది నుంచి పదిహేను నిమిషాలలోపే. అది కూడా ఫస్టాఫ్‌లోనే. సెకండాఫ్‌లో ఆమె ముఖం చాటేసింది. డైరెక్టర్ ఆమెను దాచిపెట్టేశాడు. మేఘా ఆకాశ్‌కు తల్లిగా, ఒక ప్రాణిక్ హీలర్‌గా మంగళ అనే పాత్రలో కనిపించారు సిమ్రాన్.

ఇంట్రడక్షన్ సీన్‌లో గ్లామరస్‌గా, కాస్త ఎక్స్‌పోజింగ్‌గా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆమెను చూపించాడు. సింగిల్ మదర్ అయిన ఆమెకు లైన్ వేస్తుంటాడు పేట (రజనీకాంత్). తర్వాత ఇద్దరి మధ్యా స్నేహం లేదా సాన్నిహిత్యం కుదిరినట్లు కొన్ని షాట్లు చూపించాడు.

అంతే.. ఆ తర్వాతా ఆమె పాత్ర ఆచూకీ మనకు కనిపించదు. సెకండాఫ్‌లో ఆమె పాత్రకు ఏమాత్రం చోటు కల్పించలేదు. దాంతో ఆమె పేటకు జంటేనా? కాదా? అనే సందేహం మనకు మిగిలిపోతుంది. నిజానికి ఆమెతో రజనీ కెమిస్ట్రీ బాగుంది.

ఫ్లాష్‌బ్యాక్‌లో భార్య (త్రిష)ను కోల్పోయిన పేట, ఆ చింతేమీ లేకుండా మంగళతో రొమాన్స్ చెయ్యాలని చూడ్డం మాత్రం మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఏదేమైనా ‘పేట’లో రజనీతో కలిసి నటించాననే తృప్తి ఒక్కటే ఆమెకు మిగిలింది.