Pink Remake: Vidya Balan’s Special Appearance!


Pink Remake: Vidya Balan's Special Appearance!

విద్యా బాలన్ చేయనున్నది గెస్ట్ రోల్!

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’ తమిళ రీమేక్‌లో విద్యా బాలన్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఒరిజినల్‌లో తాప్సీ చేసిన కేరక్టర్‌ను ఆమె చేస్తున్నదనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే విద్య ఆ సినిమాలో కేవలం స్పెషల్ అప్పీరెన్స్ ఇస్తున్నారు. ఈ విషయన్ని ఆమె ధృవీకరించారు. నిర్మాత బోనీ కపూర్ కోసమే ఆ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఆమె అభినయం అందరి అభినందనల్నీ అందుకుంటోంది. అలాగే ఫిబ్రవరి 7న రానున్న ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’లోనూ ఆమె కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ‘పింక్’ తమిళ రీమేక్‌లో నటించేందుకు అంగీకారం తెలిపారు. ఒరిజినల్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేస్తుండగా, తాప్సీ సహా ముగ్గురు హీరోయిన్ల పాత్రల్లో ఎవరు నటిస్తున్నదీ వెల్లడి కావాల్సి ఉంది.

“నేను ఆ రీమేక్‌లో స్పెషల్ అపీరెన్స్ ఇస్తున్నా. అదొక చిన్న పాత్ర. బోనీ కపూర్ నిర్మిస్తున్నందునే నేను అది చేస్తున్నా. ఆ సినిమాలో ఒక స్పెషల్ అప్పీరెన్స్ ఉందనీ, నువ్వు చేస్తావా?.. అనీ ఆయన అడిగాడు. మీ కోసం చేస్తానని ఆయనకు చెప్పాను. రీమేక్స్ చెయ్యడం నాకిష్టం ఉండదు. కేవలం బోనీజీ కోసమే అది చేస్తున్నా. ఆయనతో నాకు ప్రత్యేకానుబంధం ఉంది” అని విద్య చెప్పారు. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2019 మే 1న విడుదల చేయాలనేది బోనీ కపూర్ సంకల్పం.