Raghava Lawrence To Direct Akshay Kumar


Raghava Lawrence To Direct Akshay Kumar

అక్షయ్‌ని డైరెక్ట్ చేయనున్న లారెన్స్

పన్నెండేళ్ల క్రితం అక్షయ్ కుమార్ నటించిన ‘భూల్ భులయ్యా’ సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. ఓ వైపు భయపెడుతూ, ఇంకో వైపు నవ్విస్తూ ఆ సినిమా ఆకట్టుకుంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఒక హారర్ కామెడీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సన్నిహితుడైన నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

అవును. ఇది నిజం. లారెన్స్‌కు డైరెక్టర్‌గా ‘ముని’ సిరీస్ ఎంత పేరు తెచ్చాయో తెలిసిందే. ఇప్పుడు ‘ముని’, ‘కాంచన’ సినిమాలను రెండింటిని కలిపి ఒకే సినిమాగా అక్షయ్‌తో తీసేందుకు అతను స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. ఆ సినిమాల్లో లారెన్స్ పోషించిన హీరో పాత్రను అక్షయ్ చేయనున్నాడు. దెయ్యాలంటే భయపడుతూ రాత్రివేళ ఇంట్లోనుంచి బయటకు అడుగుపెట్టడానికే వణికిపోయే ఒక యువకుడికి దెయ్యం ఆవహిస్తే ఏం జరిగిందన్నది ఈ చిత్రంలోని ప్రధానాంశం. ‘కాంచన’లో శరత్‌కుమార్ పోషించిన ట్రాన్స్‌జెండర్ కేరెక్టర్ కూడా ఇందులో ఉంటుందని సమాచారం. ఆ పాత్రను ఎవరు చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏప్రిల్ ఆఖరులో షూటింగ్ మొదలై, జూలై వరకు జరగనున్నది. 2020 ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.