RRR Movie: Tamil Actor Samuthirakani To Play A Crucial Role


RRR Movie: Tamil Actor Samuthirakani To Play A Crucial Role

‘ఆర్ఆర్ఆర్’లో సముద్రకని

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రకని (సముదిరకని) ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. మూడేళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘విశారణై’లో నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆయన జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో ధనుష్ తండ్రి పాత్రలో ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. అంతే కాదు, తెలుగులో ఆయన మూడు సినిమాలను డైరెక్ట్ చేశారు. ఒకటి పృథ్వీ, ఎస్పీ చరణ్ హీరోలుగా చేసిన ‘నాలో’, రెండు రవితేజ సినిమా ‘శంభో శివశంభో’ కాగా, మరొకటి నాని ద్విపాత్రాభినయం చేసిన ‘జెండాపై కపిరాజు’.

“నా సినిమా ‘నాడోడిగల్’ చూసిన రాజమౌళి సార్ నాకొక సుదీర్ఘమైన మెసేజ్ పంపారు. అప్పట్నించి మేం టచ్‌లోనే ఉన్నాం. ఇటీవల నన్ను వాళ్లింటికి ఆహ్వానించి, తన కుటుంబాన్ని పరిచయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న తన తాజా చిత్రంలో ఒక కీలక పాత్ర చేయాల్సిందిగా కోరారు. అప్పటికప్పుడు ఒప్పేసుకున్నా” అని తమిళ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తెలిపారు సముద్రకని.

రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తయారవుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఇప్పటివరకు హీరోయిన్ల పేర్లు వెల్లడికాకపోయినా ఒక నాయికగా కీర్తి సురేశ్ ఎంపిక ఖాయమని తెలిసింది.