The Most Exciting Biographical Movie Is Coming


The Most Exciting Biographical Movie Is Coming

అత్యంత ఉద్వేగభరిత బయోగ్రాఫికల్ మూవీ వస్తోంది

అధికారంలోకి రాకముందు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందించిన ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకు ముందు ‘ఆనందో బ్రహ్మ’ వంటి హారర్ మూవీని తీసిన మహి వి. రాఘవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని వార్త బయటకు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఈ సినిమా గురించి సీరియస్ గా తీసుకోలేదన్నది నిజం. రాజశేఖరరెడ్డి పాత్రను మలయాళ అగ్ర నటుల్లో ఒకరైన మమ్ముట్టి చేస్తున్నారనే విషయం వెల్లడైనప్పుడు ఇంకొంతమంది ఆశ్చర్యపోయారు.

మమ్ముట్టి గొప్ప నటుడనే విషయంలో ఎవరికీ సంశయం లేదు. కానీ కోలముఖం మమ్ముట్టి గుండ్రని ముఖం రాజశేఖరరెడ్డిగా నప్పుతారా?.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు కూడా దీనిని రాబోతున్న ఒక ప్రముఖ చిత్రంగా భావించిన వాళ్లు తక్కువ. రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపిస్తారనే విషయం తెలిసినప్పుడు పెదవి విరిచిన వాళ్లే ఎక్కువ. ఎందుకంటే మమ్ముట్టి తండ్రిగా జగపతిబాబు చేయడమేంటనేది వాళ్ల ప్రశ్న.

షూటింగ్ పూర్తయింది. డైరెక్టర్ మహి వి. రాఘవ్ తన పని తాను చేసుకుంటూ పోయాడు. కొద్ది రోజుల క్రితం థియేట్రికల్ ట్రైలర్ ను నిర్మాతలు విడుదల చేశారు. అది చూశాక అప్పటివరకు ‘యాత్ర’ను చిన్న చూపు చూసిన వాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. తామనుకున్నట్లు అది చిన్న సినిమా కాదనీ, సంచలనం సృష్టించగల విషయం ఉన్న సినిమా అనీ వాళ్లు రియలైజ్ అయ్యారు. థియేటర్లలో ఆ ట్రైలర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే జనం ఆ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అర్థమైపోతుంది. రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. ట్రైలర్ లోని డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. జనంపై ఇంపాక్ట్ కలిగించే విధంగా అవి ఉన్నాయి. అందుకే ఫిబ్రవరి 8 కోసం జనం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నారు. సందర్భవశాత్తూ దానికి ఒక రోజు ముందు ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో భాగం ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఇంతకన్నా మజానిచ్చే విషయం ఇంకేముంటుంది!