Vinaya Vidheya Rama Review: 3 Ups And 5 Downs


Vinaya Vidheya Rama Review: 3 Ups And 5 Downs

వినయ విధేయ రామ రివ్యూ: మూడడుగులు ముందుకి, ఐదడుగులు వెనక్కి

తారాగణం: రాంచరణ్, కియారా అద్వానీ, వివేక్ ఓబరాయ్, ప్రశాంత్, స్నేహ, ముఖేష్ రుషి, మహేశ్ మంజ్రేకర్, ఆర్యన్ రాజేశ్, చలపతిరావు

దర్శకుడు: బోయపాటి శ్రీను

విడుదల తేది: 11 జనవరి 2019

కాంబినేషన్ క్రేజ్ సినిమాలు తెలుగులో సాధారణం. హీరో-డైరెక్టర్ కాంబినేషన్, తారాగణం కాంబినేషన్‌తో సినిమాలకు క్రేజ్ వస్తుంటుంది. అలాంటి క్రేజ్ వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’. రాంచరణ్ హీరో, బోయపాటి శ్రీను డైరెక్టర్, వివేక్ ఓబరాయ్ విలన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంక ఈ కాంబినేషన్‌కు క్రేజ్ రాకుండా ఉంటుందా? ప్రచారమూ అదే తీరులో జరిగింది. బిజినెస్ వర్గాలు పోటీపడి థియేటర్ హక్కులు కొనుగోలు చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులూ ఆసక్తిగానే ఎదురుచూశారు. అంత ఆసక్తి రేకెత్తించిన సినిమా ఎలా ఉందయ్యా అంటే…

కథ

ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కథ. వాళ్లు ఎన్నో వందల సార్లు చూసిన కథ. సన్నివేశాలు, ప్రాంతాలు మారివుండవచ్చంతే. కాగితాలమ్ముకొని బతికే నలుగురు చిన్న కుర్రాళ్లకు తుప్పల్లో ఇంకో అనాథ శిశువు దొరుకుతాడు. ఆ ఐదుగురు అనాథలకు ఒక డాక్టర్ (చలపతిరావు) తండ్రిలా మారతాడు. చిన్నతనంలోనే అన్నలను చంపబోయిన ఒక రౌడీని చిన్నవాడైన రామ్ (రాంచరణ్) చంపేస్తాడు. అన్నలను చదివించడానికి తాను చదువు మానేసి కష్టపడతాడు. నలుగురు అన్నలకూ పెళ్లవుతుంది. వాళ్లకు పిల్లలు కలుగుతారు. అందమైన ఆ కుటుంబానికి రాముడే రక్ష. వాళ్లందరూ కలిసి రాంకు ఓ సంబంధం చూస్తారు. ఆ అమ్మాయి పేరు సీత (కియారా అద్వానీ). అప్పట్నుంచే ఆమె కూడా ఆ ఇంటి సభ్యురాలవుతుంది. అంతలోనే ఒక ఉత్పాతం. పెద్దన్న భువన్‌కుమార్ (ప్రశాంత్) ఎన్నికల నిర్వహణాధికారిగా బిహార్ వెళ్తే, అతని వల్లా, రామ్ వల్లా విశాఖపట్నంలో ఎన్నికల్లో అభాసుపాలైన పందెం పరశురాం, అతని కొడుకూ కలిసి ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ (ప్రియదర్శిని రాం)తో కలిసి ఇక్కడ వాళ్ల కుటుంబాన్ని చంపడానికి సిద్ధమవుతారు. వాళ్లను రామ్ రక్షించేంతలో బిహార్ నుంచి ఇంకో గ్యాంగ్ వచ్చి వీళ్లపై ఎటాక్ చేస్తుంది. వాళ్లందర్నీ తుదముట్టిస్తాడు రామ్. అప్పుడు మందీ మార్బలంతో ఏకంగా బిహార్ ముఖ్యమంత్రే అక్కడకు వచ్చి, రాంను మళ్లీ బిహార్ రమ్మని అభ్యర్థిస్తాడు. ఇదంతా అర్థం కాని పెద్ద వదిన (స్నేహ) ఏం జరిగిందని అడిగితే కథను బిహార్ సీఎం చెప్తాడు.

Vinaya Vidheya Rama Review: 3 Ups And 5 Downs

కథనం

ఈ కథను సినిమాకు అనువుగా రాసుకోవడంలో కథకుడు, దర్శకుడు కథన శిల్పం కన్నా తమ సౌకర్యాన్నే ఎక్కువగా పాటించారు. అందువల్లే కథనంలో చాలా లోపాలు కనిపిస్తాయి. తన కుటుంబాన్ని రామ్ కాపాడుకున్నాక పందెం పరశురాం, అతని కొడుకు (హరీశ్ ఉత్తమన్), ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏమయ్యారో తెలీదు. రామ్ వీరత్వాన్ని ప్రత్యక్షంగా చూసి, తట్టా బుట్టా సర్దుకొని బిచాణా ఎత్తేసి ఉంటారు. రామ్ చూడ్డానికి మానవ మాత్రుడే కానీ అతడి వీరత్వం, అతడి ధైర్యం మానవాతీతం. ‘మగధీర’లో కాలభైరవ లాంటి మహావీరుడే షేర్‌ఖాన్ సైన్యంలోని వందమంది వీరుల్ని చంపితే, ఇందులో రామ్ బిహార్‌లోని రాజాభాయ్ మున్నా (వివేక్ ఓబరాయ్) గ్యాంగ్‌లోని కిరాతకుల్లో మూడొందల మందిని సునాయాసంగా లేపేసి, ఇంకా చాల్లేదని, మరింతమందిని లెక్కపెట్టే ప్రయత్నంలో ఉంటాడు. రామ్ ఏం పని చేస్తాడని అడక్కండి. ఖాళీగా ఉంటానని అతడే చెప్తాడు. కాబోయే భార్య సీతతో రామ్ “మీ అమ్మ రాత్రి 9 తర్వాత నిన్ను తాకకూడదని చెప్పింది కదా” అంటే, “పగలంతా ఏం చేస్తుంటావ్” అని దెప్పుతుంది. మన రామ్ అంత ఖాళీ అన్నమాట!

భారత్, నేపాల్ బోర్డర్లోని కొండల మధ్య చావు బతుకుల మధ్య ఉన్న అన్న భువన్ తమ్ముడు రాంకి ఫోన్ చేయగానే రామ్ అంత వేగంగా అక్కడికి ఎలా వచ్చేశాడో మనకు అర్థం కాదు. ఆ సమయంలో అతడు గుజరాత్‌లోని ద్వారకలో తన కుటుంబంతో (ముగ్గురు అన్నలు మినహా) ఉంటాడు. అక్కడ్నుంచి ఆ కుటుంబానికి తెలీకుండా ఎయిర్‌పోర్టు బిల్డింగ్ అద్దాల్ని పగులగొడ్తూ కిందికి దూకి, ఇంకో బ్రిడ్జి మీంచి కింద వెళ్తున్న రైలుబండి మీదికి దూకి, అలాగే నిల్చొని అన్నలు ప్రమాదంలో ఉన్న ఏరియాకి వచ్చేస్తాడు. మూడొందల మందిని చంపేస్తాడు. విలన్‌ను దాదాపు చంపినంత పని చేస్తాడు. మళ్లీ ఏమీ ఎరగనివాడిలా తన కుటుంబం దగ్గరకు వచ్చేస్తాడు. అతడు వచ్చే దాకా ఎయిర్‌పోర్టు నుంచి హఠాత్తుగా రామ్ ఎక్కడికి వెళ్లిపోయాడు, ఫ్లైట్‌లో తమతోపాటు ఎందుకు రాలేదని ఏ ఒక్కరూ అతడిని అడగరు. అడిగితే బోయపాటి ఉన్నాడు జాగ్రత్త! బోయపాటి తీసిందే సినిమా. కథను ఎలా కావాలంటే అలా తన సౌకర్యం కోసం మార్చేసుకుంటాడు. ఎందుకని అడగొద్దంతే!

Vinaya Vidheya Rama Review: 3 Ups And 5 Downs

ఈ కథలో పెద్ద దోషం బిహార్ ముఖ్యమంత్రి తన సైన్యంతో రాంను వెతుక్కుంటూ వైజాగ్ రావడం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, అక్కడి పోలీసు బలగాన్నంతా ఉపయోగించుకోగలిగినవాడు, అవసరమైతే కేంద్రం ద్వారా మిలటరీ సాయం తీసుకోగలిగినవాడు రాజాభాయ్ పీడను వదిలించమని ఒక మామూలు యువకుడిని అర్థించడానికి రావడం.. ఏం కథయ్యా!! అంతేనా? ఎన్నికలు సక్రమంగా జరిపించడానికి వచ్చిన కేంద్ర బలగానలను తన ప్రైవేటు సైన్యంతో రాజాభాయ్ చంపేస్తే, కేంద్ర ప్రభుత్వం, పారా మిలిటరీ చేతులు కట్టుకొని చోద్యం చూస్తూ ఉంటాయా? వాడి అంతు చూడ్డానికి కదలవూ.. కదలవు. బోయపాటి చెప్పలేదుగా!

ఈ కథలో శిల్ప లోపం కన్నా పెద్ద దోషంగా ఎంచదగినది నైతిక లోపం. అన్నను విలన్ చంపేస్తే, ఆ విషయాన్ని రామ్ తన కుటుంబం వద్ద దాయడం. వదినకు ఆ విషయం చెప్పకపోవడం. అన్న చనిపోయాక కూడా కుటుంబంతో హ్యాపీగా గడపడం, హీరోయిన్‌తో డ్యూయెట్లు వేసుకోవడం. మొదట్లో విలన్‌ను రామ్ కత్తితో నరికినట్లు చూపించి, అది అతడికి వచ్చిన కలగా బిల్డప్ చేయడం ఎడిటింగ్ లోపంగా భావించాలి. ఎందుకంటే సీతను చూడ్డానికి పెళ్లిచూపులకు వెళ్లినప్పుడు పెద్దన్న భువన్ కూడా ఉంటాడు. రాంకు కల వచ్చిందని చూపించింది హీరోయిన్ ఎంట్రీ ఇవ్వక ముందే. అంటే కలగా చూపించిందే, తర్వాతెప్పుడో నిజంగా జరిగిందని అనుకోవాలా?

సినిమాలో ఇంకో విపరీతమైన విషయమేమంటే.. రాంకు నలుగురు అన్నలు (ఒక కడుపున పుట్టినవాళ్లు కాదు, అందరూ అనాథలే), నలుగురు వదినలు. ప్రశాంత్, స్నేహ జంటను మినహాయిస్తే మిగతా అన్నల భార్యలేవరో మనకు అర్థమైతే ఒట్టు. ఒక్కోసారి ఒక్కో వదిన ఒక్కో అన్న పక్కన నిల్చొని కనిపిస్తుంది. ఆర్యన్ రాజేశ్ భార్య స్వప్నమాధురా, ఇంకొకరా? అట్లాగే రవివర్మ, మధునందన్ భార్యలు ఎవరనేదీ క్లారిటీగా తెలీదు.

మనమెప్పుడో జానపద సినిమాల్లో చూశాం. ఒకడ్ని పాము కరిస్తే, వాడు చావడు, ఆ పామే చస్తుంది. ‘వినయ విధేయ రామ’ కూడా జానపద సినిమాయే అనుకోవాలి. ఇందులో కూడా విలన్ రాజాభాయ్ అప్పుడే అడవి నుంచి తెచ్చిన నల్ల త్రాచును పట్టుకొని, దానితో చేతిపై కాట్లు వేయించుకుంటాడు. త్రాచు చచ్చిపోతుంది! త్రాచును మించిన విషం ఉన్న మనిషి!

సాధారణంగా దర్శకుడు తన పాత్రలపై కొంత పక్షపాతం వహిస్తుండటం కద్దు. కానీ ఈ సినిమాలో లాగా పక్షపాతం ప్రదర్శించడం తరచూ చూడం. చిన్నప్పుడు నలుగురు అనాథ పిల్లలకూ కొంత స్క్రీన్ స్పేస్ కల్పించాడు దర్శకుడు. ప్రతి ఒక్కరి చేతా మాట్లాడించాడు. ప్రతి ఒక్కరి బాధనూ మనకు చూపాడు. వాళ్లు పెద్దవాళ్లయ్యాక ఒక్క ప్రశాంత్‌ను మినహాయించి మిగతా ముగ్గురిపై చిన్నచూపు చూశాడు. ఆర్యన్ రాజేశ్‌ని దిష్టిబొమ్మలాంటి పాత్రలో చూడాల్సి వచ్చినందుకు అతనికి సానుభూతి చూపాల్సిందే. రవివర్మ విలన్‌గానూ ప్రూవ్ చేసుకున్నవాడు. అతనూ ఇందులో ఉన్నాడంతే! ఇక మధునందన్ కామెడీ టైమింగ్ సంగతి మనకు తెలుసు. అతనూ చేష్టలుడిగిపోయి నిల్చున్నాడు.

Vinaya Vidheya Rama Review: 3 Ups And 5 Downs

పాత్రధారుల అభినయం

ఇది రాంచరణ్ పాత్ర కేంద్రంగా నడిచిన సినిమా. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌కు పూర్తి భిన్నంగా వయొలెంట్‌గా కనిపించే పాత్ర రామ్. తన కుటుంబలోని ఏ ఒక్కరిపైనా ఈగ వాలినా దాని అంతు చూసే రకం. అలాంటీ యాంగ్రీ యంగ్‌మ్యాన్ కేరెక్టర్‌ను సునాయాసంగా చేసుకుపోయాడు రాంచరణ్. ‘రంగస్థలం’లో మాదిరిగా హావభావ ప్రదర్శనకు అవకాశం ఉన్న పాత్ర కాదు. ఎదురైన వాడి కీళ్లు విరిచేసే, అవసరమైంతే నరికేసే పాత్ర. బలిష్ఠమైన శరీరం మాత్రం ఆ పాత్రకు అవసరం. దానికి తగ్గట్లే కండలు పెంచి, చొక్కా లేకుండా రాంబో తరహాలో కనిపించాడు చరణ్. హీరోయిన్ కాంబినేషన్ సీన్లలో కాస్త జోవియల్‌గా నటించాల్సి వచ్చినప్పుడు మాత్రమే చరణ్ కష్టపడ్డాడు.

అతడి తర్వాత చెప్పుకోవాల్సింది విలన్ రాజాభాయ్ మున్నా పాత్రను చేసిన వివేక్ ఓబరాయ్‌ని. ఆ పాత్రకు తగ్గ స్టామినా అతడిలో కనిపించింది. హావభావాల విషయంలో పరిణతి ప్రదర్శించాడు. హీరోకు తగ్గ విలన్ అనిపించాడు. ఆ తర్వాత మరో రెండు పాత్రలకే ఎక్కువ స్కోప్ లభించింది. ఆ పాత్రలు భార్యాభర్తలుగా నటించిన ప్రశాంత్, స్నేహ. ప్రేక్షకుల సానుభూతి పొందే విషాదభరిత పాత్రలో ప్రశాంత్, అతడి భార్యగా, రాం పెద్ద వదినగా స్నేహ చక్కగా సరిపోయారు. ఇలాంటి కథలో హీరోయిన్‌కు చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం ఉండదు. పాటలకు, కొన్ని సరదా సన్నివేశాలకూ పనికొచ్చే పాత్రలో కియారా అందంగా కనిపించింది. ద్వారకలో రామ్ ఆసరాగా గంటకొట్టే సీన్‌లో ఆమె సౌందర్యం ఇనుమడించింది. రామ్ మిగతా అన్నలు, వదినల కంటే హేమ చేసిన హీరోయిన్ తల్లి పాత్రే ఎక్కువగా ప్రేక్షకుల అటెన్షన్ పొందుతుంది. మిగతా పాత్రధారులు తమకిచ్చిన పాత్రలకి న్యాయం చెయ్యడానికి ప్రయత్నించారు. ఇషా గుప్తా పాత్రను ఒక పాట కోసం బలవంతంగా చొప్పించినట్లు కనిపిస్తుంది.

సాంకేతిక అంశాలు

సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం మెరుగ్గా అనిపిస్తాయి. ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేసినా తేడా ఏమీ కనిపించలేదు. బిహార్ కొండల్ని కెమెరా చక్కగా చూపించింది. లాంగ్ షాట్లు అందంగా ఉన్నాయి, క్లోజప్ షాట్లు ఎఫెక్టివ్‌గా వచ్చాయి. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే పాటల అందం గురించే మాట్లాడుకుంటాం. కానీ ఈ సినిమాలో ఒక్క ఫ్యామిలీ సాంగ్ మాత్రమే ఆకట్టుకుంటుంది. డ్యూయెట్లు పెద్దగా ఆకట్టుకోలేదు. అతడందించిన నేపథ్య సంగీతం ఎస్సెట్. సంభాషణలు కొన్ని చోట్ల మెప్పించాయి. ప్రొడక్షన్ డిజైనింగ్ రిచ్‌గా ఉంది.

చివరి మాట

ఇది మూస కథతో కోట్లు కుమ్మరించి తీసిన హింస మోతాదు మించిన ఫక్తు మాస్ మసాలా సినిమా. కథల పరంగా తెలుగు సినిమాని వెనక్కి తీసుకుపోయే సినిమా.

– బుద్ధి యజ్ఞమూర్తి