Vinaya Vidheya Rama: Where Did The Bad Guys Hide?


Vinaya Vidheya Rama: Where Did The Bad Guys Hide?

వినయ విధేయ రామ: వాళ్లేమయ్యారు?

రాంచరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ముగ్గురు దుర్మార్గులు ఏమయ్యారో అంతు చిక్కడం లేదు. దర్శకుడు, కథకుడూ కూడా అయిన బోయపాటి శ్రీను ఆ ముగ్గురిని అర్థంతరంగా మాయం చెయ్యడానికి కారణమేమిటి? ఇంతకీ ఆ ముగ్గురెవరు? వైజాగ్‌లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అంటే ఎవరికైనా హడల్. అన్ని వ్యవస్థల్నీ తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యం చేస్తున్న వ్యక్తి. అతడికో కొడుడు (హరీశ్ ఉత్తమన్). ఎన్నికల్లో ఆ కొడుకు పోటీ చెయ్యాలనుకుంటాడు. ఓట్ల కోసం పంచడానికి అక్రమంగా తరలిస్తున్న అతడి కోట్లాది నోట్ల కట్టల్ని ఎన్నికల కమిషనర్ భువన్ కుమార్ సీజ్ చేస్తాడు. దాంతో పందెం గ్యాంగ్ అతడిని బెదిరిస్తుంది. భువన్ తమ్ముడు రామ వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పందెంను చితకబాదుతాడు. పరశురాంను అతడి దగ్గరకే వెళ్లి వార్నింగ్ ఇస్తాడు.

తర్వాత పందెం తరపున ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ (ప్రియదర్శిని రాం) రంగంలోకి దిగుతాడు. రామ ఇంటికి ఎవడినో తెచ్చి అతడిని ఆ ఇంట్లోనే ఎన్‌కౌంటర్ చేస్తాడు. ఒక క్రిమినల్‌కు ఆశ్రయం ఇచ్చినందుకు ఇంటరాగేట్ చెయ్యాలంటూ రామ కుటుంబాన్ని నిర్బంధించి వేధిస్తున్న సమయంలో రామ అక్కడకు వస్తాడు. తన వాళ్లను రామ కాపాడుకొనేంతలో ఇంకో బిహారీ గ్యాంగ్ అతడి కుటుంబంపై ఎటాక్ చేస్తుంది. ఆ బిహారీ గ్యాంగ్‌ను రామ తుదముట్టిస్తాడు. ఇది చూసి పందెం తండ్రీకొడుకులు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ బిత్తరపోతారు. అంతే! ఆ తర్వాతా ఆ ముగ్గురి ఆచూకీ దొరకదు. తన ఇంట్లోనే ఎవరినో ఎన్‌కౌంటర్ చేసి, తన కుటంబాన్ని నిర్బంధించి, వాళ్లపై చేయి చేసుకున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్టును కానీ, దానికి కారణమైన పందెంగాళ్లను కానీ రామ ఏమీ చెయ్యకుండా ఎలా వదిలేశాడో ఎవరికీ అర్థంకాక బుర్ర గోక్కున్నారు. తనవాళ్ల జోలికి ఎవరొచ్చినా వాళ్ల భరతం పట్టే రామ, ఈ ముగ్గురినీ ఎందుకు వదిలి వేసినట్టు? మెయిన్ విలన్ రాజాభాయ్ సంగతి చూసే క్రమంలో వీళ్లను పట్టించుకోలేదనుకోవాలా? కానీ రామ యాటిట్యూడ్ చూసినవాళ్లు అలా అనుకోలేరే? వాళ్ల సంగతి తర్వాత చూద్దామని బోయపాటే వదిలేశాడనుకోవాలి. బహుశా ‘వినయ విధేయ రామ’కు సీక్వెల్ తీద్దామనీ, ఆ సీక్వెల్‌లో వాళ్ల సంగతి చూసుకుందామనీ బోయపాటి భావించి ఉంటాడనే జోకులు కూడా పేలుతున్నాయి.