Yatra: ‘Rajanna Ninnapagalaraa’ Single Explores YSR’s Character

యాత్ర: వైఎస్సార్ కేరక్టర్ ఏమిటో చెప్పిన ‘రాజన్న నిన్నాపగలరా’ పాట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి పేదప్రజల సమస్యల్ని నేరుగా వినటానికి చేసిన పాదయాత్రలో ముఖ్య ఘట్టాల్ని తీసుకుని ‘యాత్ర’ పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై.యస్.ఆర్. పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్, డైలాగ్ టీజర్లతో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్‌తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు.
ఇప్పుడు “రాజన్న నిన్నాపగలరా..” అంటూ సాగే రెండవ సింగిల్‌తో ఆయన పాదయాత్ర వలన ప్రజల ఆనందాన్ని చూపించారు. “కోటలో కోలువయ్యే రేడు పేట దారే పట్టినాడు.. పాత రాతలన్నీ మారిపోయే ఆసలెన్నో తెచ్చినాడు..” అంటూ సాగే ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, కె స్వరాలు కూర్చారు. తన పాదయాత్రలో వైఎస్సార్ ఎన్ని విషయాలు ఎంత దగ్గరగా చూశారో, సాధారణ కష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా కలిశారో, పేదవారంటే ఎవరో.. వారు దేనికోసం చూస్తున్నారో.. అన్న విషయాల్ని ఈ పాటలో సీతారామశాస్త్రి పొందుపరిచారు.
“మెతుకును ఎరగని బతుకుల మొరవిని నీటి మబ్బులా కరిగాడు.. బీటను విచ్చిన బీళ్ళను తడిపిన వాన జల్లులా కురిసాడు” అంటూ ఆయనను ఇందులో కీర్తించారు. “ఉసూరుమంటూ నిట్టూర్పు సెప్పే ఊసులన్నీ విన్నాడురా.. లేనోళ్ళ గడపకి ఐనోడిలాగా ఆసరా తానన్నాడురా” అంటూ ఆయనలోని మంచి మనిషిని చూపించారు. “రైతన్న సేనుకి సంక్రాంతిగా.. కష్టాల పడవకి సుక్కానిగా.. నీ అడుగు పడితే మావైపిలా.. రాజన్న నిన్నాపగలరా..” అని ఆపదలో అండగా ఉండే ఆయనలోని ధీరుడి గురించి చెప్పారు.
రావు రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ ఖేడ్కర్, వినోద్ కుమార్, జీవా, పృథ్వి తారాగణమైన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ – సత్యన్ సూర్యన్, మ్యూజిక్ – కె (క్రిష్ణ కుమార్), ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం – సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్ – రామకృష్ణ, మోనిక సబ్బాని, సమర్పణ – శివ మేక, బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – మహి వి రాఘవ్.